ఆరోగ్యానికి, సంస్కృతికి ప్రతీక రథసప్తమి


సంవత్సరం మొత్తంమీద హిందువులకు అనేక పండుగలు వస్తూనే ఉంటాయి. అయితే చాలా పండుగలలో ఆయా పురాణ, ఇతిహాస గాథకు సంబంధించిన చరిత్ర లేదా తిథులకు సంబంధించిన రోజును పండుగగా జరుపుకోవడం ఆనవాయితీ. విజయదశమి, దీపావళి, శ్రీరామ నవమి వంటివి ఈ కోవలోనివి. కాగా కాలాన్ని అనుసరించి గ్రహాల గమనాన్ని అనుసరించి జరుపుకునే పండుగలూ కొన్ని ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి ఉగాది, సంక్రాంతి, రథసప్తమి. ప్రతి సంవత్సరం 'మాఘ శుద్ధ సప్తమి' ని రథసప్తమి పండుగగా ఆచరిస్తారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీన శలవు దినమైన ఆదివారం నాడు రథసప్తమి పండుగ రావడం విశేషం.

రథసప్తమి పండుగనాడు ఉదయాన్నే లేచి, ఒక ప్రమిదలో దీపం వెలిగించి నదికి గాని, చెరువుకు గాని వెళ్ళి ఆ దీపాన్ని నీటిలో వదలి సూర్యునికి నమస్కరించాలి. అటుపై తలమీద, రెండు భుజాల మీద ఒక్కొక్కటి చొప్పున ఏడు జిల్లేడు ఆకులను ఉంచి స్నానం ఆచరించాలి.

ఆ తరువాత గృహంలో సర్వాలంకృతమైన రథాన్ని (చిన్నది) నిర్మించి, అందులో సంపూర్ణ లక్షణమైన సూర్యుని విగ్రహాన్ని ఉంచి షోడశోపచార పూజలు నిర్వహించాలి. అటు తరువాత సూర్యరశ్మి గిన్నెలో పడేవిధంగా ఆరుబయట పొయ్యి అమర్చి, సంక్రాంతి పండుగలలో పెట్టిన (ఈ పాటికే ఎండినవి) ఆవు పేడ గొబ్బిళ్లను ఆ పొయ్యిలో వేసి మండించాలి. ఆ గొబ్బిళ్ల మంటపై కొత్త బియ్యం, పాలతో తీపి పొంగలి వండి ఆ ప్రత్యక్ష సూర్య భగవానునికి నైవేద్యం నివేదించాలి. అనంతరం రథాన్ని, రెండు ఎరుపు రంగు వస్త్రాలను గురువుకు దానమివ్వాలి. ఈ విధంగా రథసప్తమి వ్రతాన్ని ఆచరించడం వల్ల వారి సంతానానికి సమస్త సుఖభోగాలు చేకూరుతాయని నిరూపించే కథాంశం భవిష్య పురాణంలో ఉన్నది.

సంపూర్ణ ఆరోగ్యానికి సూర్య నమస్కారాలు


దేవతలలో విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు. కాగా సూర్యుడు నమస్కార ప్రియుడు. కనుకనే మన ఋషులు అర్ష సాంప్రదాయంలో ఆరోగ్యంతో కూడిన జీవితాన్ని ప్రసాదించడానికి ప్రతినిత్యమూ శారీరిక వ్యాయామంతో కూడిన 13 సూర్య నమస్కారాలను విధిగా చేయాలని సూచించారు. కాని మనం పాశ్చాత్య వ్యామోహంలో పడి, వికృత సంగీతంతో కూడిన 'జిమ్'లకే ప్రాధాన్యత నిస్తున్నాము. ఏది ఏమైనప్పటికి స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని, వారి స్ఫూర్తితో, ఈ సూర్య నమస్కారాల ప్రాధాన్యతను తిరిగి యువతకు తెలియచేయాలనే ప్రధాన ఉద్దేశ్యంతో 'స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవ సమితి' ఈ సంవత్సరం రథసప్తమిని పురస్కరించుకొని తరువాతి రోజు ఉదయం (ఫిబ్రవరి 18 సోమవారం) 'సామూహిక సూర్య నమస్కార ప్రదర్శన' కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించబోతున్నది. కనుక అన్ని కుటుంబాలలోని బాలలు, యువకులు ఆయా స్థలాలలో జరిగే ఈ సూర్యనమస్కార కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్యాన్ని, వివేకానందుని స్ఫూర్తిని పొందగలరని ఉత్సవ సమితి వారు ప్రజలకు పిలుపునిస్తున్నారు. 

- పతికి