బృహత్తర కార్యక్రమం 'మిషన్ కాకతీయ'

 
తెలంగాణ రాష్ట్రంలో ఓ బృహత్తర కార్యక్రమానికి తెరలేచింది. క్రొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రతిపాదించిన 'మిషన్ కాకతీయ' ఇటు అన్నదాతలకు, అటు భూ, జలవనరులకూ ఎనలేని మేలు చేకూరుస్తుందనడం ఎవరూ కాదనలేని వాస్తవం. ఇదే సమయంలో ఈ పథకం పెడధోరణులు పట్టకుండా సక్రమంగా కొనసాగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇప్పటికే ప్రభుత్వం 'మిషన్ కాకతీయ'కు భారీ ప్రచారం కల్పించింది. ఒక్క ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లలేదని, గ్రామాలను, చెరువులను దత్తత తీసుకోవాలనీ, వ్యక్తులు-సంస్థలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు 'మిషన్ కాకతీయ'లో భాగస్వామ్యమయ్యేందుకు పలువురు ఎన్నారైలు కూడా ముందుకొచ్చారు. 
 
చెరువులతో సస్యశ్యామలం : 
 
ఒకప్పుడు గ్రామాలన్నీ చెరువులతో కళకళలాడేవి. చెరువులన్నీ నీటి సిరులతో పులకరింపచేసేవి. చెరువుగట్లపై నడక ఒక చక్కని అనుభూతిని మిగిల్చేది. వర్షాకాలంలోనైతే నిరంతరాయంగా పారే మత్తళ్ళ చప్పుళ్ళు కొన్ని నెలలపాటు గ్రామంలో ప్రతిధ్వనించేవి. ఆ చెరువులే పంటలకు ప్రాణాధారాలు. అన్నదాతలకు ఆసరానిచ్చే వనరులు. కాలువల ద్వారా వదిలే నీళ్ళు, మత్తళ్ళ నుండి పారేనీళ్ళు పంట పొలాలకు ప్రవహించేవి. భూములు సాగయ్యేవి. ఇక చెరువుల చుట్టూ ఉండే వ్యవసాయ భూములు నిండుకుండల్లా తొణికిసలాడేవి. భూగర్భజలాలతో సమృద్ధిగా అందుబాటులో ఉండేవి. కాలక్రమేణా పరిస్థితులు మారిపోయాయి. పంటపొలాలు తగ్గిపోయాయి. చెరువులు కళ తప్పాయి. కొన్ని చెరువులైతే నామరూపాల్లేకుండా పోయాయి. చెరువుల శిఖం భూములే కాదు, చెరువులూ ఆక్రమణకు గురయ్యాయి. ఇండ్లూ, అపార్టుమెంట్లూ వెలిశాయి. ఈ పరిణామాలతో సాగులో ఉన్న కాస్తంత భూమికీ జలవనరులు కరువయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. వ్యవసాయంలో సాగుబడి ఖర్చులు ఊహించనంతగా పెరిగిపోయాయి. ఈ వాస్తవాలను గ్రహించిన ప్రభుత్వం 'మిషన్ కాకతీయ'కు శ్రీకారం చుట్టింది. 
 
కాకతీయుల కాలంలో ఉద్యమంలా సాగిన చెరువుల తవ్వకాలు, గొలుసుకట్టు చెరువుల నిర్మాణాలనే తెలంగాణ ప్రభుత్వం స్ఫూర్తిగా తీసుకుంది. అందుకే ఈ పథకానికి 'మిషన్ కాకతీయ' అని నామకరణం చేసింది. దేశంలో ఎక్కడా లేనంతగా తెలంగాణలో సుమారు 40 వేల గొలుసుకట్టు చెరువులు ఉన్నట్లు ప్రభుత్వం లెక్కకట్టింది. 'మిషన్ కాకతీయ'లో భాగంగా వాటన్నింటిని పునరుద్ధరించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 
 
మిషన్ కాకతీయ :
 
తెలంగాణలో జలవనరులు, నీటి లభ్యత పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. చెరువుల్లో పూడిక తీతలు, చెరువుల్లో పూడికను పంటపొలాలకు తరలించడం వంటి చర్యల ద్వారా చెరువులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ పనులను ఉపాధి హామీ పథకం కింద చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా చెరువుల తూములు, అలుగులు, మత్తళ్ళు, మట్టి కట్టల మరమ్మత్తు పనులు కూడా చేపట్టనున్నారు. అంతకుముందే రాష్ట్రంలోని చెరువుల వివరాలు, విస్తీర్ణం వివరాలను కూడా ప్రభుత్వం సేకరించింది. ప్రస్తుతం ఉనికిలో ఉన్నవి, నిరుపయోగంగా మారినవి, కబ్జాలకు గురైన చెరువుల లెక్కలను కూడా నమోదు చేసింది. 
 
'మిషన్ కాకతీయ'ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం దానికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించడమే కాదు, అధికార యంత్రాంగానికి అవసరమైన ఆదేశాలిచ్చింది. ప్రవాస భారతీయులకూ చెరువులను దత్తత తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ఇందులో భాగంగానే ప్రముఖులు, ప్రతికా సంపాదకులతో ప్రత్యేకంగా సమావేశాలు కూడా నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. సమాజంలోని అన్నివర్గాలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేందుకు సమాయత్తమవుతోంది. మొత్తానికి 'మిషన్ కాకతీయ'ను ఓ ప్రజా ఉద్యమంలా చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం చెబుతున్నట్లు ప్రజల భాగస్వామ్యం లేకుండా 'మిషన్ కాకతీయ' విజయవంతం కావడం అసాధ్యం. ఇలాంటి మహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం, అవినీతికి చోటులేకుండా చూడటం,స్వచ్ఛమైన ఫలితాలను ప్రజలకు అందేలా చూడటం వంటి విషయాలను అందరూ బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉంది.  
 
- హంసినీ సహస్ర