పోచయ్యా... నీ ఆదర్శం అనుసరణీయమయ్యా...!

 
"రామయ్య తండ్రీ రాజ్యమేలిన భూమే నీదన్నా"... అని ఒక పాత చలనచిత్ర గీతం ఉన్నది. ఒక బందిపోటుకు ధర్మం, న్యాయం గురించి చెప్తూ ఒక గ్రామీణ యువతి పాడినపాట అది. అమ్మాయి మాట ఆలకించిన బందిపోటు మంచివాడుగా మారిపోతాడు. ఇది మనకు అతిశయోక్తిగా అనిపించవచ్చును గాక. కాని సత్యం ఇంకా బ్రతికే ఉందని నిరూపించాడు శ్రీ దుస్సయ్య పోచయ్య. కరీంనగర్ జిల్లా రామగుండం పట్టణం, దేవాలయం వీథిలో నివాసముంటున్న 'జెన్ కో' విశ్రాంత ఉద్యోగికి ప్రభుత్వం పథకం 'ఆధారం' క్రింద పింఛను శాంక్షన్ అయ్యింది. ఈ పింఛను ఏ ఆధారం లేని నిరుపేదల కొరకు ఉద్దేశించబడినది. ఐతే తాను విశ్రాంత ఉద్యోగిననీ, తాను 'ఆధారం' పింఛను పథకానికి అర్హుడను కాదంటూ డబ్బును తిరిగి చెల్లించేశాడు ఆ విశ్రాంత ఉద్యోగి. అతడే దుస్సయ్య పోచయ్య. తాను నడవలేని స్థితిలో ఉండికూడా మిత్రుల సహాయంతో నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చి పింఛను వద్దంటూ అధికారులకు విన్నవించాడు. భళా పోచయ్యా... నీ ఆదర్శం అనుసరణీయమయ్యా...!!
 
- ధర్మపాలుడు