జవహర్లాల్ నెహ్రూ జాతికి చేసిందేమిటి?

పండిట్ జవహర్లాల్ నెహ్రూ
 
దేశ ప్రథమప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 125వ జయంత్యుత్సవ సంవత్సరమిది. 1989లో ఆయన శతజయంతి జరిగిన సంవత్సరం. అప్పడు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నారు. ప్రభుత్వం 400 కోట్లు ఖర్చుపెట్టింది. అదేసమయంలో ఆర్.ఎస్.ఎస్. స్థాపకులు డా.హెడ్గేవార్ శతజయంత్యుత్సవాలు కూడా జరిగాయి. దేశవ్యాప్తంగా జనజాగరణ జరిగింది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మట్టికరిచింది. జాతీయశక్తులు విజృంభించాయి. జయంత్యుత్సవాల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో దేశభక్తిని, నిర్మాణాత్మక దృక్పథాన్ని కలిగించేందుకేమాత్రం ప్రయత్నించలేదు. అదే సమయంలో ఆర్.ఎస్.ఎస్. ప్రతి సందర్భాన్ని ఒక అవకాశంగా మలుచుకొని దేశప్రజల్ని సేవించేందుకు ఉద్యమించింది. డా.హెడ్గేవార్ శతజయంత్యుత్సవాల్లో 'సేవానిధి'ని ప్రజలనుండి సేకరించింది. ఆ నిధితో సేవాభారతి పేర దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను ప్రారంభించింది. 
 
గత సంవత్సరం స్వామి వివేకానంద 150వ జయంత్యుత్సవాల సందర్భంగా గ్రామగ్రామాన హిందుత్వ జాగరణ జరిగింది. ఫలితంగా కేంద్రంలో జాతీయవాద ప్రభుత్వం ఏర్పడింది. నెహ్రూ వారసత్వ రాజకీయాలు దేశాన్ని భ్రష్ఠుపట్టించాయి. ఆర్థిక విధానాల్లోనూ నెహ్రూకు స్వదేశీ దృక్పథం ఉండేదికాదు. ఆయనకు భారత్ కంటే పాశ్చాత్యదేశాల జీవనవిధానంపై ఎక్కువ మక్కువ ఉండేది. మాతృభూమి అంటే ఆయన దృష్టిలో కేవలం భూమిమాత్రమే. అందుకే 1962లో చైనా మనపై దాడిచేసి ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఒక పార్లమెంటు సభ్యుడు అంటే 'అక్కడ గడ్డికూడా మొలకెత్తద'ని సమాధానం చెప్పారు. 
 
 
మహాత్మాగాంధీ, నెహ్రూల మధ్య జరిగిన లేఖలయుద్ధం అందరికీ తెలిసిందే. గాంధీజీ గ్రామస్వరాజ్యం అనేవారు, నెహ్రూ పట్టణాలవైపే చూసేవారు. గాంధీజీ 'ఖాదీ' అనేవారు, నెహ్రూకు ఖరీదైన విదేశీ బట్టలు, సూట్లు, బంగళాలు అంటే మోజుండేది. గాంధీజీ స్వదేశీ ఆర్థికవ్యవస్థ, వ్యవసాయాధారిత పరిశ్రమలు, కుటీర పరిశ్రమల గురించి మాట్లాడేవారు, నెహ్రూ ఎప్పుడూ సోషలిస్టు విదానాల మంత్రజపం చేసేవారు. రష్యావైపు చూసేవారు. పరిశ్రమ అంటే 100 కోట్ల పెట్టుబడి, 100 ఎకరాల భూమి అని కలవరించేవారు. ప్రభుత్వరంగ సంస్థల్లో 'లాభం' చూసుకోకూడదనేవారు. ఈ విషయంలో జె.ఆర్.డి. టాటా కూడా నెహ్రూతో విబేధించేవారు. క్రమంగా ప్రభుత్వరంగ సంస్థలు కుదేలవడంతో దేశ ఆర్థిక వ్యవస్థ పతనదిశగా ప్రయాణించింది. ఋణగ్రస్త, రుజాగ్రస్త ఆర్థికవ్యవస్థను జాతికందించి వెళ్ళారు. 
 
 
హిందుత్వం అన్నా, భారతీయత అన్నా నెహ్రూకు పరమ అసహ్యం. 1948లో గాంధీజీ హత్య తరువాత 'ఆకాశవాణి'లో మాట్లాడుతూ 'కాషాయజెండాను తగులబెడితే తాను సంతోషిస్తానన్నాడు. గాంధీజీ హత్యకు ఆర్.ఎస్.ఎస్. కారణమంటూ ప్రభుత్వం సంఘాన్ని నిషేధించింది. విచారణ పూర్తయిన తరువాత అదేప్రభుత్వం నిజం తెలుసుకొని నిషేధం ఎత్తివేసింది. చివరకు చైనా యుద్ధసమయంలో ఆర్.ఎస్.ఎస్. సేవల్ని గురించి తెలుసుకున్న నెహ్రూ 1963 జనవరి 26 గణతంత్ర వేడుకల్లో పాల్గొనమని సంఘానికి ఆహ్వానం పంపారు. ఆ రోజున ఢిల్లీలో 3000 (మూడువేలమంది) మంది స్వయంసేవకులు గణవేష ధరించి వాయిద్యాలతో సహా సంచలన్ చేశారు. 
 
 
బ్రిటిష్ వారు వెళ్ళిపోతూ దేశాన్ని విభజించారు. 554 సంస్థానాలను భారత్ లో విలీనం చెయ్యాల్సి వుంది. మరోప్రక్క పాకిస్తాన్ లో హిందువుల ఊచకోత, వెల్లువలా వస్తున్న శరణార్థులు. నెహ్రూకు ప్రధానిపీఠం మీద ఉన్న మక్కువ హిందువులమీద లేదు. దిక్కుతోచక నెహ్రూ ఉంటే ఒంటిచేత్తో పరిస్థితిని చక్కదిద్దారు పటేల్. నెహ్రూ అసమర్థత వలన కాశ్మీర్ అంతర్జాతీయ వివాదమైంది. దేశభక్తుడైన రాజా హరిసింగ్ ను నెహ్రూ తప్పుపట్టేవాడు. దేశద్రోహం నెఱపిన షేక్ అబ్దుల్లాను చంకనెత్తుకొనేవాడు. చివరకు నాడు ఆర్.ఎస్.ఎస్.ద్వితీయ సరసంఘచాలక్ శ్రీ గురూజీ రాజా హరిసింగ్ తో నెరపిన చర్చలు ఫలప్రదమై కాశ్మీరు భారత్ లో విలీనమైంది. 
 
 
యుద్ధమంటే నెహ్రూకు వణుకు. సైన్యం అంటే భయం. ఆయుధాలు సమకూర్చుకున్న సశస్త్ర, సశక్త సైన్యం భారత్ కు కావాలని ఎందరో నిపుణులు సూచించినా ఆయన రక్షణరంగం బడ్జెట్ ను పెంచేవారు కాదు. మనకు యుద్ధం ఎందుకనేవారు. శాంతి-శాంతి అంటూ పావురాలు ఎగరేసేవారు. 1954 నుండి 1962 వరకు చైనా సరిహద్దులో పొంచిఉండటాన్ని ఆయన పసిగట్టలేకపోయారు. టిబెట్ ను ఆక్రమించిన తరువాతైనా చైనా భారత్ పై కన్నేసిందనే వాస్తవాన్ని గుర్తించలేకపోయారు. శ్రీ గురూజీ చెప్పినప్పటికి దానిని నిర్లక్ష్యం చేశారు. పైగా చైనా వెళ్ళి 'పంచశీల' ఒప్పందం చేసుకొచ్చారు. ఆ సంతకం తడి ఆరకముందే చైనా మనపై దాడిచేసింది. అప్పుడు కూడా జాతిని, జవాన్లను అప్రమత్తం చేయలేకపోయారు. అదే మనోవేదన ఆయనను చాలారోజులు వెంటాడింది. పార్లమెంటరీ సంప్రదాయాలు, పద్ధతుల్ని మాత్రం ప్రధానిగా తు.చ. తప్పకుండా పాటించేవారు. 15ఏళ్ళపాటు భారతప్రధానిగా ఉండి స్వతంత్రభారత ప్రధమ ప్రధాని గౌరవం దక్కించుకున్నారు. అన్ని హోదాలను అనుభవించారు. తనదైన శైలిలో భారత్ ను వర్ణిస్తూ 'డిస్కవరీ ఆఫ్ ఇండియా' గ్రంథం వ్రాశారు. గొప్పజ్ఞాని. కాని ఆయన మేధస్సు బారత్ ను ఉద్ధరించేందుకు, భారత ప్రజల అజ్ఞానాన్ని తొలగించేందుకు ఉపయోగపడలేదు. చివరకు తన మరణానంతరం తన చితాభస్మం గంగానదిలో కలపమని మాత్రం చెప్పి వెళ్ళిపోయారు.
 
- హనుమత్ ప్రసాద్