పది కోట్ల మందితో విజయవంతమైన సార్వత్రిక సమ్మె

భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి శ్రీ బైజ్యనాథ్ రాయ్ ప్రకటన


ఫిబ్రవరి 28 న దేశవ్యాప్తంగా పదకొండు జాతీయ సంస్థలు కలిసి నిర్వహించిన సార్వత్రిక సమ్మె విజయవంతమైందని భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి శ్రీ బైజ్యనాథ్ రాయ్ ఒక ప్రకటనలో తెలియచేశారు.  దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, కర్మాగారాలు, బ్యాంకులు, ఎల్.ఐ.సి., బొగ్గు గనులు, మొదలైన సంఘటిత సంస్థలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు, వ్యవసాయం, బీడీ పరిశ్రమ, గృహ నిర్మాణ, అంగన్ వాడీ మొదలైన అన్ని అసంఘటిత రంగాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు.  దేశవ్యాప్తంగా జరిగిన ఈ సమ్మెలో 10 కోట్ల మందికి పైగా పాల్గోన్నట్లుగా శ్రీ బైజ్యనాథ్ రాయ్ తెలియచేశారు. ఇంత పెద్ద సమ్మె స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు. 
  • ధరల పెరుగుదల, నిరుద్యోగము, ఆర్ధిక సరళీకరణ కారణంగా కార్మిక చట్టాలలో వస్తున్న మార్పులు, సామాజిక భద్రత, మొదలైన విషయాలలో కార్మిక సంఘాల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అంగీకరించాలి. 
  • ప్రభుత్వం ఆర్ధిక విధి విధానాలను, ప్రజలకు, కార్మికులకు వ్యతిరేకంగా తయారు చేయటం ఆపివేయాలి.
ఈ విషయంలో ప్రభుత్వం విఫలమైతే ఈ ఉద్యమాన్ని రాబోయే రోజులలో తీవ్రతరం చేస్తామని, దాని కారణంగా ఏర్పడే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని రాయ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమ్మెలో పాల్గొన్న కార్మికులు, ఉద్యోగులు అందరికీ ఒక ప్రకటనలో రాయ్ ధన్యవాదములు తెలిపారు.