భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడడమే సంపూర్ణ వైజ్ఞానిక దృష్టి


సంపూర్ణ జీవితమూ - సంపూర్ణ సృష్టి, ఈ రెండింటినీ కలిపి ఒకటిగా ఆలోచించటం భారతీయ సంస్కృతిలోని మొదటి విశేషం. దీని దృష్టి కోణం ఏకాత్మకమైనది. ముక్కలు ముక్కలుగా ఆలోచించటం వైజ్ఞానికుల దృష్టిలో సరియైనదే. అయినా వ్యావహారిక దృష్టిలో మాత్రం ఉపయోగకరమైనది కాదు. పాశ్చాత్యుల సమస్యలకు ముఖ్య కారణం వారు వారి జీవన విధానాన్ని గురించి ఖండఖండాలుగా ఆలోచించి, తిరిగి వాటినన్నింటినీ ఒకటిగా అతికించడానికి యత్నించడమే. 

మనం, జీవితంలో వివిధత్వము లేదా వైవిధ్యం ఉన్నదని అంగీకరించినా, వాటి మూలంలో నిహితమై ఉన్న ఏకత్వాన్ని కనుగొనటానికి నిరంతరం ప్రయత్నం చేశాము. ఈ దృష్టి సంపూర్ణంగా వైజ్ఞానికమైనట్టిది. ప్రపంచంలో శోధించటం, కనిపించే అవ్యవస్థలో నుండి వ్యవస్థను కనుగొనడం, దాని నియమాలను పరిశోధించి వాటి ఆధారంగా వ్యావహారిక నియమాలను రూపొందించడంలో విజ్ఞానవేత్తల ప్రయత్నం ఎల్లప్పుడూ ఉంటుంది. రసాయనిక శాస్త్రవేత్తలు సంపూర్ణ భౌతిక జగత్తు నుండి కొన్ని ఆధారభూతమైన మూలకాలను పరిశోధించి, కనుక్కొని అన్ని వస్తువులూ వాటితోనే నిర్మించబడినవని  తెలిపారు. భౌతిక శాస్త్రజ్ఞులు మరింత ముందుకు పోయి ఈ మూలకాలలో నిహితమై ఉన్న శక్తిని అనగా చైతన్యాన్ని కనుగొన్నారు. సంపూర్ణ జగత్తులో చైతన్యం మాత్రమే ఆవిష్కరించబడి ఉన్నది అని నిగ్గు తేల్చారు.