హిందుత్వమే ప్రపంచశాంతికి మూలం

వరల్డ్ హిందూ కాంగ్రెస్ సదస్సులో శ్రీ మోహన్ జీ భాగవత్
 
 
ఢిల్లీలో నవంబర్ 21 నుండి 23 వరకు మూడురోజులపాటు వరల్డ్ హిందూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో "వరల్డ్ హిందూ కాంగ్రెస్ - సంగచ్ఛధ్వం-సంవదధ్వమ్" మహా సదస్సు జరిగింది. ఈ సభకు అతిరథమహారథులెందరో విచ్చేశారు. ప్రపంచంలోని దాదాపు 50 దేశాల నుండి 1500 మందికి పైగా ప్రముఖులు పాల్గొన్నారు. 
 
టిబెట్ బౌద్ధ గురువు దలైలామా, గయానా దేశం నుండి అష్నీసింగ్, స్వామి దయానంద సరస్వతి, శ్రీలంక నాయకుడు విఘ్నేశ్వరన్, ఆర్.ఎస్.ఎస్. సరసంఘచాలక్ పూజనీయ మోహన్ జీ భాగవత్, విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ నాయకులు శ్రీ అశోక్ సింఘాల్, డా.ప్రవీణ్ భాయి తొగాడియా, కేంద్రమంత్రులు శ్రీ నితిన్ గడ్కరి, శ్రీమతి నిర్మలాసీతారామన్, శాస్త్రవేత్తలైన శ్రీ మాధవన్ నాయర్, శ్రీ విజయభాస్కరన్, ప్రముఖ విద్యావేత్తలు శ్రీ మజుందార్, శ్రీ విశ్వనాథం, శ్రీ కపిల్ కపూర్, చిత్రనిర్మాతలు శ్రీ ప్రియదర్శన్, రవి మరియు ప్రముఖ చలనచిత్ర నటి సుకన్య, ఇంకా ఎందరో ప్రముఖులు ఈ మహాసభలో పాల్గొన్నారు.

ఈ మహాసభ దేశంలోను, ప్రపంచంలోని ఇతర దేశాలలోను ఉన్న హిందువులందరి సాధకబాధకాల గురించి కూలంకషంగా చర్చించింది. చర్చలలో పాల్గొన్నవారిలో మేధావులు, విద్యావేత్తలూ, విశ్వవిద్యాలయాల స్థాపకులు, కులపతులు, ఉప కులపతులు, పారిశ్రామికవేత్తలు, వ్యపారస్తులు, బ్యాంకర్లు, ఆర్థిక నిపుణులు, ప్రజానాయకులు, యువకసంఘాల నాయకులు, పాత్రికేయులు, సంపాదకులు, మీడియా దిగ్గజాలు మరియు వివిధ హిందూ సంస్థలకు చెందిన నాయకులు ఇంకా ఎందరో ఉన్నారు.  
 
సామాజిక, ధార్మిక, రాజకీయ అంశాలు వాటిలో హిందువుల పాత్ర వంటి అంశాలు ప్రత్యేకంగా చర్చించబడ్డాయి. 
 
విశ్వహిందూపరిషత్ నాయకులు శ్రీ అశోక్ సింఘాల్ మాట్లాడుతూ - "800 సంవత్సరాల అనంతరం దేశంలో మొదటిసారిగా హిందూజాతీయ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. 'నేను హిందువును' అని సగర్వంగా ప్రకటించే వ్యక్తి మనదేశ ప్రధాని అయ్యారు" అని అన్నారు. 
 
"హిందువుల-బౌద్ధుల మధ్య ఒక లోతైన అనుబంధం ఉంది. నేను కూడా ఒక ఆదర్శ హిందువునే" అని ప్రకటించారు టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సరసంఘచాలకులు శ్రీ మోహన్ భాగవత్ గారు జ్యోతిప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. అనంతరం మోహన్ జీ ప్రసంగిస్తూ "తీవ్రవాదం, రక్తపాతంతో అతలాకుతలమవుతున్న నేటి ప్రపంచానికి దశ-దిశ చూపించే శక్తి కేవలం హిందుత్వానికి మాత్రమే ఉన్నది. ప్రపంచ ప్రజల మధ్య మానవతా సంబంధాలు నెలకొల్పడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమౌతుంది తప్ప, సైనికబలంతోను, ఆయుధాలతోనూ కాదు. సమస్త విశ్వానికి మానవతా విలువలు బోధించే శక్తిసామర్ధ్యాలు హిందుత్వానికి మాత్రమే ఉన్నవి, నిజానికి అది హిందువుల బాధ్యత కూడా" అని అన్నారు. 
 
హిందూశక్తి బలోపేతానికి, తద్వారా లోకకల్యాణానికి తీసుకోవలసిన చర్యలను నిర్ణయించి కార్యరంగంలోకి దిగడానికి ఉద్యుక్తులవుతూ సభ విజయవంతంగా ముగిసింది.

  • 2018లో ప్రపంచ హిందూ సదస్సు (వరల్డ్ హిందూ కాంగ్రెస్) అమెరికాలో నిర్వహించటానికి నిర్ణయమైంది. 
  • 2015లో లండన్ లో ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై, ఆర్థిక సిద్ధాంతాలపై చర్చించేందుకు నిర్ణయించారు.  
  • నవంబర్ 21 నుండి 23 వరకు ఢిల్లీలో నిర్వహించిన ప్రపంచ హిందూ సదస్సు (వరల్డ్ హిందూ కాంగ్రెస్) లో ప్రపంచంలోని 54 దేశాల నుండి 1700 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని బౌద్ధగురువు దలైలామా, దయానంద సరస్వతిస్వామి నిర్వహించారు. ఈ సమావేశాలలో ప్రపంచం ఈ రోజున ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించటానికి తగిన దిశానిర్దేశనం చేయబడింది. ఈ సమయంలో ఈ సదస్సుకు సమాంతరంగా ఏడు సదస్సులు నిర్వహించబడ్డాయి. ఆ సదస్సులలో ప్రపంచానికి సంబంధించి అన్ని జీవనరంగాల అన్నిటి గురించి చర్చించారు. మీడియా, ఆర్థిక అంశాలు, రాజకీయాలు, మహిళలు, యువకులు, వాళ్ళకు తగిన మార్గదర్శనంపై చర్చలు జరిగాయి. ప్రపంచంలో ఉన్న హిందువులకు ఒకవేదిక ఏర్పాటుకు చేసే ప్రయత్నమే ఈ సదస్సు. ప్రపంచంలో హిందువుల పరిస్థితి, ప్రపంచ పరిస్థితి చర్చించేందుకు వాటిపరిష్కారానికి హిందుత్వ ఆలోచనలు అందరికి పంచటానికేయత్నం.
 
- ధర్మపాలుడు