వ్యూహం మార్చిన మజ్లిస్


రాష్ట్రంలో మజ్లిస్ పార్టీ తన పరిధిని విస్తరించేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది. లేని వివాదాలు సృష్టిస్తూ ముస్లింలను రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకునేందుకు పక్కాగా వ్యూహరచన చేస్తోంది. దీనికోసం పాతబస్తీలోని చార్మినార్ ను ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయాన్ని టార్గెట్ గా ఎంచుకుంది. 

బల ప్రదర్శన 

అక్టోబర్ 31న మజ్లిస్ ఎమ్మెల్యే పాషా ఖాద్రీ నేతృత్వంలోవందలాది మంది ముస్లిం యువకులు ఏటా దీపావళికి ఆలయానికి చేసే అలంకరణ పనుల్ని అడ్డుకునేందుకు యత్నించారు. ఆ తర్వాత తమ పార్టీ కార్పొరేటర్ 'మోసిన్ బలాలా'తో చారిత్రాత్మక కట్టడమైన చార్మినార్ ఉనికికి ప్రమాదం ఏర్పడిందంటూ హైకోర్టులో కేసును ఫైల్ చేయించింది. అయితే కోర్టులో ఆ పార్టీకి చుక్కెదురైంది. దీంతో పందిరిని అడ్డుకుంటామని హెచ్చరికలు చేస్తూ నగరంలో ఉద్రిక్తత పరిస్థితులు సృష్టించేందుకు పన్నాగాలు పన్నింది. తమ పార్టీ ఎమ్మెల్యేల, కార్పొరేటర్లతో కలిసి నిరసన ర్యాలీకి యత్నించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ వార్త తెలిసిన వెంటనే జోహ్రాబీ కా దర్గా, కోమటివాడీ, హుస్సేనీ ఆలంలోని హిందువుల ఇళ్ళు, వాహనాలపై రాళ్ల దాడులు జరిగాయి.

రంగంలోకి దిగిన హిందూ సంస్థలు 

పాతబస్తీలో రోజు రోజుకు పరిస్థితి దిగజారుతుండటంతో హిందూ సంస్థలు రంగంలోకి దిగాయి. భాగ్యలక్ష్మి ఆలయ రక్షణ కమిటీని ఏర్పాటు చేసి హిందువులకు రక్షణగా నిలిచాయి. అమ్మవారి దేవాలయాన్ని రక్షించుకొనేందుకు ఉద్యమ కార్యాచరణకు రక్షణ కమిటీ పిలుపునిచ్చింది. సుందరయ్య పార్కు నుంచి ఇందిరా పార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో హిందువులు తరలివచ్చారు. దీంతో దిగివచ్చిన సర్కార్ పోలీసుల బలగాలను మోహరించి పందిరి ఏర్పాట్లు చేయించింది. 

రూటు మార్చిన మజ్లిస్   

గతంలో ఎన్నడూ లేనివిధంగా హిందువులు జాగృతం కావడంతో ఖంగుతిన్న మజ్లిస్ పార్టీ తన రూటు మార్చింది. ఆ పార్టీ నేత అసదుద్దీన్ నవంబర్ 12న తమ పార్టీ కార్యాలయంలో సమావేశమై కాంగ్రెస్ కు తమ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలోనే ఎం.ఐ.ఎం. కార్యకర్తలు తమ గూండాయిజాన్ని ప్రదర్శించారు. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక రిపోర్టర్ తో పాటు కెమెరామన్ పై దాడిచేసి, వారి వాహనాన్ని సైతం ధ్వంసం చేసి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు యత్నించారు. అటు అప్రమత్తత పేరుతో పోలీసులు భాగ్యలక్ష్మి ఆలయానికి పండుగ పూజల కోసం వస్తున్న హిందువులను అడ్డుకుని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. 


స్వామీజీని సైతం.. 

అమ్మవారిని దర్శించుకొనేందుకు వచ్చిన పరిపూర్ణానంద స్వామీజీని సైతం అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించారు. ఆ తర్వాత పోలీసు జీపులోనే స్వామివారిని చార్మినార్ తరలించి కిందకు దిగనీయకుండా జీపులోంచే అమ్మవారి దర్శనం చేయించారు. మరోవైపు బిజెపి నాయకులు కూడా ఆలయం వద్దకు రాకుండా పోలీసులు అనేక రకాల అడ్డంకులు సృష్టించారు. అయితే స్థానిక మహిళలు మాత్రం తమ ప్రాణాలు పోయినా అమ్మవారి దర్శనం చేసుకొనేవరకు కదలమని భీష్మించడంతో చేసేది లేక దర్శనాలకు అనుమతి ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆలయం వద్ద ఏటా కానుకగా ఇచ్చే అమ్మవారి రూపాయ నాణేలను ప్రసాదంగా పొందారు. 

విధ్వంసాలకు శ్రీకారం 

మరోవైపు హిందూ జాగృతితో భాగ్యలక్ష్మి ఆలయం వద్ద పూజలను అడ్డుకునే యత్నాలు విఫలం కావడంతో మజ్లిస్ పార్టీ విధ్వంసాలకు శ్రీకారం చుట్టింది. నవంబర్ 16 శుక్రవారం ప్రార్థనల పేరుతో మక్కా మసీదుకు చేరుకున్న అల్లరి మూకలు రెచ్చిపోయాయి. గుల్జార్ హౌస్, ఎతెచార్ చౌక్, మచిలికమాన్ ప్రాంతాల్లో ఆరు కార్లకు నిప్పు పెట్టారు. 12కు పైగా వాహనాలను తగులబెట్టారు. బందోబస్తు నిర్వహిస్తున్న అదనపు ట్రాఫిక్ కమీషనర్ సీపీ ఆనంద్ పై సైతం రాళ్ళు రువ్వారు. 

- నారద