విలీనం మాత్రమే కాదు విముక్తి


325 సంవత్సరాల బానిసత్వం అంతమైంది. భారత్ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్న శుభతరుణం. బ్రిటిష్ వాళ్ళు దేశం వదలి వెళ్లారు. కాని దేశంలో ఉన్న 554 స్వతంత్ర సంస్థానాలకు కూడా స్వతంత్రంగా ఉండేందుకు లేదా భారతదేశంలో చేరడానికి అవకాశమిస్తూ ప్రకటన చేసి వెళ్ళారు. దానితో హైదరాబాద్ సంస్థానాన్ని పాలిస్తున్న నిజాంకు ఆశ పుట్టింది. స్వతంత్రంగా ఉండాలనుకున్నాడు. నిజాంను దారికి తెచ్చింది నాటి గృహమంత్రి సర్దార్ పటేల్. 1948 సెప్టెంబర్ 13న హైదరాబాద్ ను భారతసైన్యం చుట్టుముట్టింది. సెప్టెంబరు 17న నిజాం భారతప్రభుత్వం ముందు తలవంచాడు. మైద్రాబాద్ భారత్ లో విలీనమైంది. అయితే ఇది కేవలం విలీనమయిన రోజే కాదు నిజాం నిరంకుశ వైఖరిని, అకృత్యాలను నిరసిస్తూ అనేకమంది జరిపిన పోరాటానికి ఫలం లభించినరోజు. హైద్రాబాద్ నిజాం కబంధ హస్తాల నుంచి విముక్తి లభించిన రోజు. 
 
నిరంకుశ పాలనను వ్యతిరేకించిన హిందువులపై నిజాం అమానుషాలకు, అత్యాచారాలకు పాల్పడ్డాడు. అందుకు కాశీం రజ్వీ నాయకత్వంలో రజాకర్లను ప్రోత్సహించాడు. బ్రిటిష్ వాళ్ళు 1947 ఆగస్టులో భారత్ ను వదలి వెళ్లిన వెంటనే ఆయన స్వతంత్రుడనని ప్రకటించుకున్నాడు. హైద్రాబాద్ సంస్థానం దేశంలోని అతిపెద్ద సంస్థానాల్లో ఒకటి. 82,698 చ.మైళ్ల భూభాగం కల్గిన ఈ సంస్థానంలో తెలంగాణతో బాటు, కర్నాటక, మహారాష్ట్రలలోని కొన్ని భూభాగాలు కూడా ఉండేవి. నిజాం ఆస్తులకు అంతులేదు. నిజాం కాలంనాటి ఆస్తులను, భవనాలను హైద్రాబాద్ వారసత్వ సంపదగా భావించే దౌర్భాగ్యులు ఇంకా నేటికీ ఉన్నారు. వారికి భారత్ పట్ల కంటే నిజాం పట్ల గౌరవమెక్కువ.
 
1911లో గద్దెనెక్కిన నిజాం హిందువులపై, వారి ఆస్తులపై, దేవాలయాలపై, మత కార్యక్రమాలపై జరిగే దాడుల్ని సమర్థించేవాడు. హిందువులకు వ్యతిరేకంగా ఉర్దూలో కవితలు రాశాడు, రాయించేవాడు. నిజాంను జిన్నా ప్రోత్సహించేవాడు. కమ్యూనిస్టులు కూడా నిజాంకు మిత్రులైపోయారు. తెలంగాణలో విజయదశమికి ముందు జరిగే 9 రోజుల బతుకమ్మ పండుగలపై రజ్వీ నాయకత్వంలో రజాకర్లు దాడిచేసేవారు. మహిళల్ని వివస్త్రలను చేసి బతుకమ్మ ఆటాడించేవారు. వరంగల్ జిల్లా అష్రఫ్ పేటపై దాడి, పంజాగుట్ట గ్రామంపై దాడి, గుల్బర్గా జిల్లాలోని సైదాబాగ్ గ్రామంపై దాడి, బీదర్ జైల్లో పండిత శ్యాంలాల్ కు విషమిచ్చి చంపడం, ఇమరోజ్ పత్రిక సంపాదకుడు (రజాకార్లను విమర్శించినందుకు) షోయబుల్లాను హత్యచేయడం - ఇలా అనేక సంఘటనలు జరిగాయి.
 
హైద్రాబాద్ సంస్థానంలో జరుగుతున్న హింసాకాండను నెహ్రూకూడా ఒప్పుకున్నాడు. అయినా ఎటువంటి చర్య తీసుకోలేదు. భారత ప్రభుత్వం పట్ల విధేయత ప్రకటించినవారిని రజాకార్లు వేటాడి చంపేవారు. హైద్రాబాద్ సంస్థానానికి భారత ప్రభుత్వ ఏజంట్ జనరల్గా నియమించబడిన దేశభక్త శ్రీ కె.యం.మున్షీ మీద కూడా రజాకార్లు గూఢచర్యం సాగించారు. వారిని హత్య చేసేందుకు ప్రయత్నించారు. హైద్రాబాద్ ను ముస్లిం బాహుళ్య ప్రాంతంగా చేసేందుకు వివిధ ప్రాంతాల నుండి 8 లక్షలమంది ముస్లింలను హైద్రాబాద్ కు తరలించారు. ఉర్దూ పత్రికలు డజనుకు పైగా నడిపారు. హిందూ వ్యతిరేక వ్యాసాలు వ్రాసారు. 
 
 
నిజాం రేడియోలో కాశిం రజ్వీ ఉపన్యాసాలు ప్రసారం చేసేవారు. హిందూసమాజంలోని బడుగువర్గాలను ఇస్లాంలోకి మార్చేందుకు హైద్రాబాద్ అసిఫ్ నగర్ లో దీన్ దార్ అంజుమన్ సంస్థను స్థాపించారు. 10 ఏళ్ళ క్రితం ఈ సంస్థ మతాల ప్రార్థనా స్థలాలలో బాంబులు పెట్టి విధ్వంసానికి పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నిషేధంలో ఉంది. నిజాంకు వ్యతిరేకంగా స్వామి రామానంద తీర్థ, వందేమాతరం రామచంద్రరావు, నారాయణరావు పవార్ లాంటి యోధులు ఉద్యమించారు. నారాయణరావు పవార్ వేసిన బాంబు నుంచి నిజాం తృటిలో తప్పించుకున్నాడు. కాశీంరజ్వి ప్రారంభించిన మజ్లిస్ వారసత్వం నేటికీ హైద్రాబాద్ నడుస్తున్నది. కాశీం రజ్వీ రాక్షసపాలనకు కేంద్రమైన దార్-ఉల్-సలాం నేటికీ మతపిచ్చితో, ఉన్మాదంతో జరిగే చర్యలకు స్థావరంగానే ఉంది. నేడు హైద్రాబాద్ కు ఓ అభినవ సర్దార్ పటేల్ అవసరం ఉంది.  
 
 
2014 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి, గతం మర్చిపోయి మజ్లిస్ తో జతకట్టింది. తెలంగాణకు రజాకార్ల నుండి విముక్తి లభించిన సెప్టెంబరు 17ను కేవలం విలీన దినంగా పరిగణించే ప్రయత్నం చేస్తోంది.  నేటికీ నిజాంను, నిజాం పాలనను పొగడుతూ, నిజాం పాలన హైద్రాబాద్ కీర్తికిరీటంలో ఓ మైలురాయిగా భావిస్తున్న మజ్లిస్ తో చెట్టాపట్టాలేసుకుని, ముస్లింలకు 12% రిజర్వేషన్లు ఇస్తామంటోంది. హైద్రాబాద్ లో రజాకార్ల ఆగడాలు గతము అయినా గతం నుండి పాఠం అవగతం చేసుకుని ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవహరిస్తే బావుంటుంది. తెలంగాణ ఆవిర్భావం దినం జూన్ 2 ఎంత ముఖ్యమో, అసలు జూన్ 2 చరిత్రలో చేరేందుకు కారణమయిన సెప్టెంబర్ 17ను విస్మరిస్తే ప్రజలు క్షమించారు. 'గతం నాస్తి కాదు, అది అనుభవాల ఆస్తి, వెనుకచూపు లేకపోతే వెన్నెముక జారిపోవడం యదార్థం' అన్న కవి వాక్యం  చెవికెక్కించుకోవడం నేడు తెలంగాణకు హైద్రాబాద్ కు ఓ జాతీయ అవసరం. 
 
- హనుమత్ ప్రసాద్