సంఘ వటవృక్షానికి బీజం డా.హెడ్గేవార్

డా.హెడ్గేవార్ 125వ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం 

డా.కేశవరావ్ బలిరాం హెడ్గేవార్

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ పేరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. సంఘాన్ని వ్యతిరేకిస్తున్నవారి వల్ల సంఘం పేరు బాగా వినపడుతోంది. ఎంత వ్యతిరేకించినా సంఘం పెరుగుతోంది. మరోవైపు దేశహితమైన కార్యంలో ఏదో ఒకరూపంలో పాలుపంచుకునేందుకు సజ్జనులైన దేశ ప్రజలు సంఘం వైపు ఆకర్షితులవుతున్నారు. సంఘం వెబ్ సైట్ కు 2012లో ప్రతినెలా 1000 మంది స్పందించేవారు. వారి సంఖ్య 2013లో 2500కు, 2014లో ఇదే సంఖ్య 9000కు పెరిగింది. దీనికి కారణం సంఘం ఒక శాశ్వత సత్యానికి మూలమైన శుద్ధ దేశభక్తి భావ నిర్మాణం కోసం పనిచేస్తున్న సంస్థ కావడమే. ఈ విశాల సంఘ వటవృక్ష నిర్మాణానికి బీజం వేసింది సంఘ స్థాపకులు డా.హెడ్గేవార్. ఈ ఉగాదికి వారు జన్మించి 125 ఏళ్లు పూర్తవుతాయి.

1889 ఏప్రిల్ 1వ తేదీన నాగపూర్ లో ఉగాదినాడు డా.హెడ్గేవార జన్మించారు. వారు జన్మత: దేశభక్తులు. బాల్యంలో విక్టోరియా రాణి వజ్రోత్సవాల సందర్భంగా పాఠశాలలో పంచిన మిఠాయిని విసిరికొట్టారు. 1907లో వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నారు. దేశం బ్రిటిషువారి దాస్యంలో ఉండడాన్ని సహించలేకపోయేవారు. విప్లవకారుల కేంద్రం బెంగాల్ లో వైద్యవిద్యనభ్యసించి 1916లో నాగపూర్ తిరిగి వచ్చారు. ఇంట్లో కడు బీదరికం ఉంది. అయినా ఉద్యోగం చేయాలని, వివాహం చేసుకోవాలని ఆయన భావించలేదు. దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని సమర్పించాలనుకున్నారు. 1920లో నాగపూర్ లో జరిగిన కాంగ్రెసు మహాసభల నిర్వహణ బాధ్యత తీసుకున్నారు. 1200 మంది వాలంటీర్లను సమీకరించారు. దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం, ప్రపంచాన్ని పెట్టుబడిదారీ విధానం నుంచి విముక్తి చేయడమనే రెండు విషయాలను కాంగ్రెసు తీర్మానాల ప్రస్తావన సమితి ముందుంచారు. 1930లో కాంగ్రెసు సంపూర్ణ స్వాతంత్ర్యం తీర్మానం చేసింది. దానిని సమర్థిస్తూ డాక్టర్ హెడ్గేవార్ అన్ని సంఘశాఖల్లో కాంగ్రెసును అభినందించే కార్యక్రమం చేయమని సూచించారు. ఇది వారి దూరదృష్టికి నిదర్శనం. ఖిలాఫత్ ఉద్యమాన్ని కాంగ్రెసు సమర్థించినపుడు వ్యక్తిగతంగా వారికి ఇష్టం లేకపోయినప్పటికి దాన్ని బహిరంగపరచకుండా గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. అంతా కలిసి ఉద్యమించాలన్నదే ఆయన అభిప్రాయం. పోయిన స్వాతంత్ర్యం సాధించుకోవడం కంటే దాన్ని నిలుపుకోవడం కోసం దేశభక్తి గుణవికాసం కలిగిన సమాజ నిర్మాణం చాలా అవసరమని ఆయన భావించారు. అందుకే 1925లో ఆయన సంఘాన్ని ప్రారంభించారు.   

కలిసి పనిచేయడం, శక్తినుపాసించడం, అనుశాసనము, దేశభక్తి, సమాజం పట్ల ప్రేమ, నిస్వార్థభావన వంటి గుణాల వికాసం కోసం శాఖలో కార్యక్రమాలు యోజన చేశారు. 15 సంవత్సరాలలో సంఘం దేశవ్యాప్తంగా విస్తరించింది. సంఘం ప్రారంభం తరువాత కూడా 1930లో వారు వ్యక్తిగత స్థాయిలో అటవీ సత్యాగ్రహంలో పాల్గొని 9 నెలలపాటు కారాగారవాసం అనుభవించారు. ఆ సమయంలో వారి మిత్రులు డా.పరాంజపేను సంఘ సరసంఘచాలక్ గా నియమించారు. ఆనాడు కాంగ్రెసులో మితవాదులు, అతివాదులు అనే వర్గాలుండేవి. డాక్టర్జీ ఈ వర్గాలకతీతంగా ఉండేవారు. ఇతరులమీద, బయటివారిమీద ఆధారపడకుండా స్వయంసేవకులే తమ సమయాన్ని, ధనాన్ని సమర్పించేలా 'గురుదక్షిణ' కార్యక్రమం ప్రారంభించారు. భగవాధ్వజమే మన గురువన్నారు. వ్యక్తి నిష్ఠకంటే తత్వనిష్ఠకే పెద్దపీట వేశారు. 9 దశాబ్దాల తరువాత కూడా సంఘ నీతి, రీతి మారలేదు. సంఘాన్ని స్థాపించామన్న అహంకారం వారికి లేశమాత్రమైనా ఉండేది కాదు. 1933లో జరిగిన సంఘచాలకుల బైఠక్ లో మాట్లాడుతూ 'నా అయోగ్యత వల్ల సంఘ వికాసానికి ఆటంకం ఏర్పడితే, నన్ను తొలగించి మరో యోగ్యవ్యక్తిని మీరు సర్ సంఘచాలక్ గా నియమించుకోవచ్చు' అన్నారు. వారి ధ్యేయసమర్పిత వ్యక్తిత్వానికి ఇది నిదర్శనం. సంఘంలో గణవేష, సంచలన్, సైనిక కవాతు, ఘోష్, శిబిరాలు వంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. అందరితో వితండవాదన చేయకుండా ఉండడం, ప్రశంసించినా, విమర్శించినా ఒకేతీరుగా అందరితో వ్యవహరించడం వంటి గుణాలను ఆయన స్వయంసేవకులకు నేర్పారు.  

1936లో నాసిక్ లో శంకరాచార్య విద్యాశంకర భారతీస్వామి ద్వారా డాక్టర్ జీకి 'రాష్ట్ర సేనాపతి' బిరుదునివ్వడం జరిగింది. ఈ విషయం వార్తాపత్రికల్లో చదివి డాక్టర్జీకి అభినందన సందేశాలు రావడం మొదలయింది. కాని ఆయన స్వయంసేవకులకు 'ఈ బిరుదును మనం ఏనాడు ఉపయోగించవద్దు, మనకు ఇది అసంగతమైనది' అని సూచించారు. వారి చరిత్ర రాయాలనుకున్న వారిని కూడా 'మేము నాలుగు రోజులున్నా లేకపోయినా, నీ వైభవం అమరం తల్లీ' అంటూ ఆశ్చర్యపడేలా చేశారు. 

----------------------------------------------------------------------
దేశ హితమే మన కర్తవ్యం 

ఎవరికి తన దేశమూ, దేశ సోదరులూ తప్ప మరొకరంటే ఎట్టి వ్యామోహం లేదో, ఎవరికి తమ కర్తవ్యము, కర్తవ్యపాలనమూ తప్ప మరొక వృత్తి లేదో, ఎవరికి తన హిందూధర్మం అభివృద్ధి చెంది, హిందూప్రతాపభానుని నిరంతరం మహా తేజశ్శాలిగా ఉంచాలనే ధ్యేయం తప్ప మరో స్వార్థం లేదో అట్టివాని హృదయంలో భయమూ, దు:ఖమూ, నిరుత్సాహమూ జనింపచేయటం ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యం కాదు. 
- డా.హెడ్గేవార్
----------------------------------------------------------------------
మాటలతో కాక చేతలతో నేర్పడం వారి కార్యపద్ధతి. తాను వేసిన సంఘబీజం మంచిదా, చెడ్డదా అన్న చర్చ చేయకుండా సంఘవృక్షం పెద్దదై చక్కటి ఫలాలనిస్తున్నప్పుడు విత్తనగుణం అర్థమవుతుందని, కనుక వృక్షాన్ని పెంచడమే మన పని అని ఆయన చెప్తుండేవారు. అందుకే ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని సంఘం నిలబడింది. నిశ్చలంగా, నిర్ణీత వేగంతో ముందుకు పోతోంది. ఈ విజయగాధ వెనుక డాక్టర్జీ దార్శనికత ఉంది. వారికి 125 వసంతాలు నిండిన సందర్భంగా శతశత పాదాభివందనములు.

- డా.మన్మోహన్ వైద్య (హిందీమూలం)
- హనుమత్ ప్రసాద్ (తెలుగు అనువాదం)