ప్రపంచ హిందూ కేంద్రంగా తిరుపతి

పరిపూర్ణానంద స్వామి డిమాండ్


తిరుపతిని ప్రపంచ హిందూ కేంద్రంగా ప్రకటించి, హిందూ ధర్మాన్ని రక్షించాలని శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి డిమాండ్ చేశారు. దానికి కట్టుబడి ఉన్న పార్టీలకే వచ్చే ఎన్నికల్లో హిందువుల మద్దతు ఉంటుందని హెచ్చరించారు. తిరుమల తిరుపతిలో అన్యమత ప్రచారాన్ని అరికట్టాలని, శేషాచలం చుట్టూ 30 కి.మీ.ల వరకు అన్యమత ప్రచారం జరగకుండా జీ.ఓ. ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తిరుమల తిరుపతి సంరక్షణ సమితి (టి.టి.ఎస్.ఎస్.) ఆధ్వర్యంలో ఆగష్టు 18వ తేదీన టిటిడి పరిపాలనా భవనం ఎదుట పరిపూర్ణానంద స్వామి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా స్వామి పైవిధంగా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హిందూ ధర్మ ప్రచారం కోసం మఠ, పీఠాదిపతులతో త్వరలో రథయాత్ర చేపట్టనున్నట్లు స్వామి ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని తిరుమల పవిత్రతను కాపాడే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు టిటిడి ఇ.ఓ. ఎల్.వీ.సుబ్రహ్మణ్యంకు వినతిపత్రం సమర్పించారు. 


వినతిపత్రంలోని డిమాండ్లు : 

  • తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దివ్యక్షేత్రం. హిందువులు శ్రీ స్వామివారి పట్ల భక్తితో సమర్పించుకుంటున్న నిధులతో తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా నిర్వహించబడుతున్న ధార్మిక సంస్థ ఇది. ప్రభుత్వం వలె సెక్యులర్ సంస్థ కాదు.  
  • తిరుమల తిరుపతి దేవస్థానపు ఉద్యోగస్తుల నియమావళి - ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన (GOMs No.s1060, revenyoo endoments-1) 24 అక్టోబర్ 1989-90 (సెక్షన్-6) నియమం ప్రకారం విద్యాసంస్థలు మినహా తితిదే ఉద్యోగులను హైందవేతరులను తీసుకోరాదు.  
  • 2007లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన జీ.ఓ. ప్రకారం తిరుమల ఏడుకొండలూ శ్రీ స్వామివారి దివ్యక్షేత్రం. అక్కడ హైందవేతరుల మతప్రచారం నిషిద్ధం, శిక్షార్హం. 2007 జీ.ఓ. 747 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరాధనా స్థలాల వద్ద అన్యమత ప్రచారం చేసిన వారికి 3 సంవత్సరాల కఠిన కారాగారము లేదా రూ.5,000 జరిమానా లేదా రెండు విధించవచ్చు.
  • పై నియామాలను ఉల్లంఘిస్తూ తిరుమలలోని తితిదే ఉద్యోగస్తులు క్రైస్తవమత ప్రచార సాహిత్యంతో తితిదే విజిలెన్సు విభాగం వారికి పట్టుబడ్డారు. వారిని ఉద్యోగాల నుంచి తొలగించడానికి  బదులు కేవలం వారిని తిరుపతికి బదిలీ చేసి చేతులు దులుపుకోవడం గర్హనీయమైన విషయం. ఆ ముగ్గురిని ఉద్యోగాల నుండి తొలగించారి. 
  • తితిదే ఉద్యోగస్తులలో  హైన్దవేతరులను గుర్తించి వారిని ఉద్యోగాల నుండి తొలగించాలి. ఈ ఉద్యోగస్తుల గుర్తింపుకై తితిదే విజిలెన్స్ విభాంలో ఒక ప్రత్యేక సెల్ ని ఏర్పాటు చేయాలి.  
  • తిరుమలలో వివిధ దుకాణాలలో, హోటల్ తదితర సంస్థలలో హైందవేతరులు లేకుండునట్లు అన్ని చర్యలూ చేపట్టాలి.  
  • తిరుమలలో అటవీ సంరక్షణకు అన్ని చర్యలు చేపట్టాలి.  
  • పేరూరు గ్రామంలోని వకుళామాత, దేవాలయమును తితిదే జీర్ణోద్ధరణ కావించి భక్తుల దర్శనమునకు సౌకర్యం కల్పించాలి.