సరిహద్దుకు ప్రణామం

దేశ సంరక్షణ మనందరి బాధ్యతఒకప్పుడు భారతదేశ సరిహద్దులు హిమాలయాలు-దేశం చుట్టూ ఉన్న మూడు సముద్రాలుగా ఉండేవి. మహాభారత  కాలంలో అంటే 5,113 సంవత్సరాలకు పూర్వం వ్రాయబడ్డ విష్ణు పురాణంలో మనదేశ సరిహద్దులను వివరించే ఒక శ్లోకం మనకు కనబడుతుంది. 

"ఉత్తరం యత్ సముద్రస్య
హిమాద్రేశ్చైవ దక్షిణమ్
వర్షం తత్ భారతమ్ నామ
భారతీ యత్ర సంతతి
: " 

ఉత్తరమున ఉన్న హిమాలయాల నుండి దక్షిణంలో ఉన్న సముద్రం వరకు వ్యాపించి ఉన్న దేశం భారతదేశమని, అక్కడ నివసించే వారంతా భారతమాత సంతానమని ఈ శ్లోకం అర్థం. ఇందులో 1.మన సరిహద్దులు, 2.ఈ సరిహద్దుల మధ్యలో ఉన్న దేశం పేరు, 3.ఈ దేశంలోని ప్రజలను ఏమని పిలుస్తారు? అనే మూడు అంశాలు వివరించబడ్డాయి. 

బ్రిటిష్ పాలనలో ఈ దేశం నుండి బర్మా, శ్రీలంక, నేపాల్ మొదలైన భూభాగాలు ప్రత్యేక దేశాలుగా మార్చబడ్డాయి. 1947లో దేశ విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పడింది. మొత్తంమీద ఈ దేశం మీద రెండు వేల సంవత్సరాలుగా జరిగిన నిరంతర దాడులు చేయలేని పనిని బ్రిటిష్ వాళ్లు రెండు వందల సంవత్సరాలలో చేసారు. ఫలితంగా ఈ దేశానికి అసహజమైన సరిహద్దులు ఏర్పడ్డాయి. 

వాటి రక్షణ క్లిష్టతరంగా మారింది. ఒకప్పుడు  సరిహద్దుల సంరక్షణ గురించి ఆలోచించేవారు 1) సరిహద్దులలోని రక్షణ బలగాల గురించి, 2) సరిహద్దులలో జరిగే గూఢచర్య కార్యకలాపాల గురించి విశేషంగా ఆలోచించేవారు. బ్రిటిష్ పాలనకాలంలోకూడా సరిహద్దులకు ఎంతో ప్రాధాన్యమిచ్చారు. కాశ్మీర్ లోని గిల్గిత్, బాల్టిస్థాన్ ల నుండి ఇరాక్, రష్యాలకు భూమార్గం ఉండేది. దానిని దృష్టిలో ఉంచుకొని అక్కడ రక్షణ దళాలు ఏర్పాటు చేసారు. రెండవ ప్రక్క చైనా నుండి రక్షణ దృష్ట్యా టిబెట్ వైపు రక్షణ దళాలు ఉండేవి. 

స్వతంత్ర భారతదేశ మొదటి ప్రధాని నెహ్రూ తనను తాను ఒక అంతర్జాతీయ నాయకుడుగా భావించుకొని, అన్ని దేశాలతో తనకు సఖ్యత సంబంధాలు ఉన్నాయనే ఊహాలోకంలో ఉండేవారు. దాని కారణంగా దేశ సరిహద్దుల ఆవల ఉన్న దేశాలు ఎటువంటివి? వాటి నుండి మన రక్షణ వ్యవస్థ ఎలా ఉండాలి? అసలు ఆ దేశాలతో మనకు సరిహద్దుల సమస్యలు ఉన్నాయా? ఇటువంటి విషయాలు ఏవీ పట్టించుకోలేదు. భారత్ కు-చైనాకు మధ్య స్వాతంత్ర్యం వచ్చిననాటి నుండి సరిహద్దులలోసమస్యలు ఉన్నాయి. భారత్-చైనాల మధ్య నాలుగు వేల కి.మీ. సరిహద్దు ఉన్నది. భారత్ ఆధీనంలోతమ భూభాగాలు ఉన్నాయని సాకు చూపించి భారత్ కు బుద్ధి చెప్పాలని మావో భారత్ పై దాడి చేసాడు. దాడిని తానే ఏకపక్షంగా విరమించుకొన్నాడు. దానికి ఆ సమయంలో ఏర్పడిన అంతర్జాతీయ పరిణామాలు కొంత కారణం. పశ్చిమ దేశాలు భారత్ కు సమర్ధనగా రావచ్చనే ఉద్దేశంతో దాడిని విరమించింది చైనా. నాటి నుండి నేటి వరకు మనదేశం చైనాతో మనకున్న సరిహద్దులకు సంబంధించి నిర్దిష్ట చర్చలు జరపలేదు. సరిహద్దులను స్పష్టంగా ప్రకటించలేదు. చైనా ఆధీనంలోని భూభాగాలను వెనక్కు తెచ్చుకోనూలేదు. ఇంకొక ప్రక్క స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లోనే పాకిస్థాన్ 'కాశ్మీర్ ఆక్రమణ' ప్రయత్నం చేయటం, ఆక్రమణ చేసిన పాకిస్థాన్ ను వెనక్కు తరుముతూ ఉంటే ఏకపక్షంగా మన ప్రధాని కాల్పలు విరమణ ప్రకటించటం, ఫలితంగా అత్యంత కీలకమైన గిల్గిత్, బల్టిస్థాన్ లను చేజార్చుకోవటం జరిగింది. బంగ్లాదేశ్ ఏర్పడిన తరువాత బంగ్లాకు మనకు మధ్య సరిహద్దులను నిర్దిష్టంగా గుర్తించక పోవటం, అక్కడ తగిన రక్షణ వ్యవస్థ చేయకపోవటం, ఆ కారణంగా బంగ్లాదేశ్ నుండి రికార్డు  స్థాయిలో చొరబాటుదార్లు భారత్ లో (అస్సాంలో) ప్రవేశించి తిష్ట వేసుకొని కూర్చోవడం నేటి సమస్య. 

ఈ బంగ్లా చొరబాటుదారులు నేడు కేవలం అస్సాంలోనే కాక దేశమంతటా విస్తరించారు. దేశ సరిహద్దుల రక్షణకు నిరంతరం మన సైన్యం అప్రమత్తంగా ఉంటున్నది. సరిహద్దులు కొన్నిచోట్ల అస్పష్టంగా ఉన్నాయి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని కొందరు జాతీయవాదులు దేశ రక్షణకు మనం ఏం చేయవచ్చు? అని ఆలోచించారు. ఫలితంగా రెండు సంస్థల ఆవిర్భావం జరిగింది. 1) ఫిన్స్ (FINS) ఫోరం ఫర్ ఇంటిగ్రేటెడ్ నేషనల్ సెక్యూరిటీ, 2) సీమా సురక్షా మంచ్. 

1) సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేసిన సైనికాధికారులకు సరిహద్దుల అంతర్గత రక్షణపై విశేష అనుభవం ఉంటుంది. ఆ అనుభవాన్ని ప్రజలను జాగృతంగా ఉంచేందుకు ఎలా ఉపయోగించుకోవచ్చు? అని ఆలోచించి, ఆ దిశలో పని చేసేందుకు ఏర్పడిన సంస్థే ఫిన్స్ (FINS). 2) సరిహద్దులలో ఉన్న గ్రామాలలో ప్రజలను జాగృతంగా ఉంచేందుకు ఏర్పాటు చేసిన సంస్థే సీమాసురక్షా మంచ్. ఈ రెండు సంస్థలు గడిచిన రెండు సంవత్సరాలుగా దేశంలోఅనేక విశేష కార్యక్రమాలు తీసుకొన్నాయి. చైనా ఆక్రమణ జరిగి 50  సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సరం "సర్ హద్ కో ప్రణామ్" అనే కార్యక్రమాన్ని తీసుకొంది. ఈ కార్యక్రమం రూపకల్పన అద్భుతమైనది. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ఎంపిక చేసిన 15వేల మంది యువకులకు నవంబర్ 21, 22, 23 తేదీలలో దేశ సరిహద్దుల సందర్శన చేయించారు. ఆ కార్యక్రమంలో పాల్గొని వారు తమ ప్రదేశాలకు తిరిగి చేరుకొన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల యువకులు దేశంలోని అన్ని సరిహద్దులను సందర్శించటం ఈ కార్యక్రమ విశేషం.

సరిహద్దు సందర్శనకు వెళ్ళిన వారు 1) దేశంలో పవిత్ర నదుల నుండి జలాలు, మట్టిని తీసుకొని వెళ్ళి అక్కడ అభిషేకించడం, అక్కడి మట్టిని దేశమంతటికి తీసుకొని వెళ్ళడం, 2) సరిహద్దులలోఉన్న సైనికులను కలిసి సంఘీభావం ప్రకటించటం, 3) సరిహద్దులలోని గ్రామాలలోఉన్న ప్రజలకు "దేశమంతా మా వెనుక ఉంది" అనే ఆత్మవిశ్వాసం నిర్మాణం చేయటం చేసారు. "ఈ దేశ సంరక్షణ మనందరి బాధ్యత" అని దేశం మొత్తం నుండి వెళ్ళిన యువకులకు స్ఫురిపంచేయ గలిగింది ఫిన్స్. ఈ కార్యక్రమం దేశ ప్రజలందరి దృష్టిని మళ్ళీ ఒకసారి సరిహద్దుల వైపు మళ్ళించింది. సరిహద్దులకు వెళ్ళి వచ్చినవారి నుండి విశేషాలను తెలుసుకోవడం, అక్కడి పరిస్థితులు విని ఆశ్చర్యపోవటం ప్రజల వంతు అయింది. ప్రభుత్వం, సైన్యం కాకుండా సరిహద్దుల రక్షణ విషయంలో ఆలోచించే వ్యవస్థలు కూడా మన దేశంలో ఉన్నాయని, ఇక్కడి ప్రజలలోఒక ఆత్మవిశ్వాసం కలిగించటం ఈ "సర్ హద్ కో ప్రణామ్" లక్ష్యం.

క్రింది ఆల్బమ్ లో "సర్ హద్ కో ప్రణామ్" ఫోటోలు చూడవచ్చు. 

Sarhad Ko Pranaam