కలియుగ రాక్షసులు


లోకకళ్యాణం కోసం ఋషులు యజ్ఞాలు చేస్తుంటే వాటిని అడ్డుకోవడమే పనిగా పెట్టుకునే రాక్షసుల గురించి ఎన్నో పురాణాల్లో విన్నాం. అటువంటి వారు ఈ కాలంలోనూ ఉన్నారంటే ఆశ్చర్య పోవలసినదేమీ లేదు.

హిందూ ధర్మ పరిరక్షణ కోసం కాకినాడలో శ్రీ పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామి 'అమ్మ ఒడి' అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రలోభాలు ఇతర కారణాల చేత మాతృధర్మానికి దూరమై అవస్థలు పడుతున్న అనేకమందిని తిరిగి స్వధర్మంలోకి తీసుకురావడం ఈ కార్యక్రమ ఉద్దేశ్యం. అనుకున్నట్లుగానే ఇది మంచి ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. నిస్సహాయ స్థితిలో క్రైస్తవ మతా ప్రచారకుల ప్రలోభాలకు గురై, స్వధర్మాన్ని వీడిన అనేక కుటుంబాలు బొట్టు, పూలు ధరించే భాగ్యాన్ని దక్కించుకుంటున్నందుకు మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో జిత్తులమారి నక్కల కళ్ళు ఇటువంటి వారిపై పడ్డాయి. స్వామీజీ చేపట్టిన పునరాగమన కార్యక్రమానికి వ్యతిరేకంగా రాక్షస పన్నాగం మొదలైంది. ఇందులో భాగంగా 'షిలోహి' మినిస్ట్రీస్ అనే క్రైస్తవ మిషనరీ సంస్థ హిందూ ధర్మంలోనికి తిరిగి రావాలనుకునే వారికి రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్చను అడ్డుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. క్రైస్తవ మతంలోకి మారితే ప్రతినెలా రూ.500 పింఛన్ గా ఇస్తామని ప్రలోభానికి గురిచేస్తోంది. సామర్లకోట పిఠాపురం, కొత్తపల్లి. ప్రత్తిపాడు తదితర గ్రామాల్లో ఈ ప్రచారం విస్తృతంగా సాగిస్తోంది. ఈ కుతంత్రానికి మద్దతుగా ఆస్ట్రేలియా, అమెరికా నుండి భారీ ఎత్తున విరాళాలు కూడా తమకు అందుతున్నట్లు మినిస్ట్రీస్ కు చెందిన పాస్టర్ గీసాల సత్యానందం, అతని కుమారుడు శ్రీనివాస్ లు బహిరంగంగానే ఒప్పుకుంటున్నారు. అంతేకాదు, మతం మారిన వారికి వైద్య సహాయం కూడా చేస్తామంటున్నారు. రాక్షసులు ఈ కాలంలో కూడా ఉన్నారనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేం కావాలి?

- అయ్యలసోమయాజుల