గురువు భగవత్ స్వరూపం

వివేక సూర్యోదయం - ధారావాహికం - 11


సత్యం తనలో లేనివాడు సత్యం ప్రవచించలేడు. అందుకు హృదయం విప్పారి ఉండాలి. వేల సంవత్సరాల నదీనదాల, రాళ్ళురప్పల అఖండతత్వం అపుడే అతనికి బోధపడుతుంది. ఒక గుడ్డివాడు ఓ ప్రదర్శన శాలకు రావచ్చు. కాని అతను చూడాలంటే అతని కళ్ళు తెరుచుకోవాలి. 'ఇలా కళ్ళు తెరిపించే మతమే గురువు'. గురువు పరంపరను కొనితెచ్చే వాడే సనాతనుడు. అతడో ఆధ్యాత్మిక వాహిని. ఆ వాహినిని అందుకొనే ధార్మికవాది శిష్యుడు. స్వేచ్చా, స్వాతంత్ర్యాల గురించి మాట్లాడటం తేలికే. కాని అణకువ, విశ్వాసం, సమర్పణ లేనిదే మతం లేదు. ఈ సంబంధం ఉన్న చోటనే ఆధ్యాత్మిక పరిమళం పల్లవిస్తుంది. అది లేనిచోట మతం పెడదారి పడుతుంది. 

జాతుల్లో, చర్చిల్లో గురువుకు శిష్యునికి సంబంధం లేనిచోట, ఆధ్యాత్మికత ఓ తెలియని జడపదార్ధం. దాన్ని ప్రసారం చేసేవాళ్ళు ప్రసరింప బడేవాళ్ళు అక్కడ లేరు. కారణం వాళ్ళంతా స్వతంత్రులు. వారెవరికి నేర్పగలరు? వారు వస్తే భావం కనుక్కోనేందుకే వస్తారు. ''ఓ డాలరు విలువగల మతం నాకివ్వండి'' అని అంటారక్కడ. మతం అలా సాధించుకొనేది కాదు. ఓ ఆధ్యాత్మిక గురువు వద్ద నుంచి ప్రసరించే జ్ఞాన గంగకు మించింది లేదు. యోగి అయినవాడికి స్వతహాగానే అది సంక్రమిస్తుంది. కాని అది పుస్తకాల ద్వారా రాదు. ప్రపంచ నలుమూలలకు వెళ్లి, హిమాలయాల్లో, ఆల్ఫ్స్ పర్వతాలలో గోబీ, సహారా ఎడారుల్లో తల పగలగొట్టుకున్నా గురువును కనుగొనందే ప్రయోజనం ఉండదు. గురువును కనుక్కోవాలి. పిల్లాడిలా సేవించాలి, గుండె తెరిచి ఆయన ప్రాభవాన్ని స్వీకరించాలి. ఆయనలోని భగవంతుణ్ణి చూడాలి. భగవంతుని అత్యున్నత ప్రతిరూపమైన గురువు పట్లనే మన ధ్యానం లగ్నం కావాలి. ఓ సాధారణ మానవుడి రూపం కరిగిపోయి గురువు ఓ భగవత్స్వరూపంలా భాసిస్తాడు. అలాంటి గురువులు ప్రపంచంలో చాలా తక్కువగా ఉన్నారు. కాని ప్రపంచం వారు లేకుండా లేదు. సమాజంలో బంధాలు, అనుబంధాలు నిలిచి ఉండేది వీరివల్లే.

భగవంతుడి బొమ్మ గీయాలని ప్రయత్నించే వ్యక్తి కోతి బొమ్మ గీశాడట. భగవంతుణ్ణి ముందు 'మనిషి'గా అర్థం చేసుకుంటే చాలు. మనుషుల్లో భగవంతుడున్నాడని భావించాలి. 'భగవంతుడు' లేడని వాదించే మేధావులు కనీసం మనుషుల్లో భగవంతుణ్ణి  చూడగలరా?! భగవదారాధనకు వ్యతిరేకంగా ఉపన్యాసాలిచ్చే వీరు వీధిలో ఏ పుస్తకం చదవని దరిద్రుడి గురించి ఆలోచించగలరా? మతం అంటే ఈ వివేకమే. దీన్ని తట్టి లేపడమే నేడు మనందరి కర్తవ్యం.

- హనుమత్ ప్రసాద్