చేతనైతే మా ప్రభుత్వాన్ని రద్దు చేయండి చూద్దాం !

పశ్చిమ బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ
 
భారతదేశంలో రాజకీయాలు అధికారం, ఆర్థిక విషయాల చుట్టూ ఎక్కువగా తిరుగుతుంటాయి. రాజకీయ నాయకులు అధికారం కోసం మైనార్టీలను ప్రసన్నం చేసుకొనే పనిలో ఎక్కువగా ఉంటారు. ఈ విషయాలలో ఏ పార్టీ అతీతం కాదు. కాంగ్రెస్ ఈ దేశానికి ఎంతమంచి చేసిందో కాని దేశంలో నైతికభ్రష్ఠత్వం మాత్రం చాలా ఎక్కువగా కలిగించింది. దేశంలో అన్ని రాజకీయ పార్టీలపైనా కాంగ్రెస్ ప్రభావం పడింది. 
 
ఈమధ్యకాలంలో వెలుగులోకి వచ్చిన శారదా గ్రూపు కుంభకోణం అనేక మలుపులు తిరుగుతూ బెంగాలు ముఖ్యమంత్రి దీదీని చక్రబంధంలో పడేసింది. శారదా కుంభకోణం ఈమధ్య బెంగాలులో జరిగిన బాంబుప్రేలుళ్ళతో ముడిపడి ఉందని సమాచారం. తీగ లాగితే డొంక అంతా కదిలినట్లుగా అయింది. 
 
1970 సంవత్సరాలలో ఒక ప్రముఖ నక్సలైట్ నాయకుడిగా పేదప్రజల కోసం పనిచేసిన శంకరాదిత్యన్ 1990లో ఆ ఉద్యమం నుండి బయటికి వచ్చాడు. ఒకప్పుడు పేదప్రజల కోసం పనిచేసిన ఆ నాయకుడు 2000 సంవత్సరం నుండి పేదబ్రతుకులు కూల్చే కార్యక్రమం మొదలుపెట్టాడు. రాజకీయ అండదండలతో శారదాగ్రూప్ ఛత్రం క్రింద 300 మోసకారి కంపెనీలు ప్రారంభించాడు. తృణమూల్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సిమి (స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్ మెంట్) వ్యవస్థాపకుడు అహ్మద్ హుసేన్ ఇమ్రాన్ నిషిధ్ధ బంగ్లాదేశీ తీవ్రవాద సంస్థ జమాత్ ఇస్లాం ద్వారా శారదాగ్రూపు అక్రమార్జనను విదేశాలకు తరలిస్తున్నట్లుగా ఇంటలిజెన్స్ విభాగం చెబుతున్నది. బంగ్లాదేశ్ సరిహద్దులలో ఉన్న పశ్చిమబెంగాల్ లోని గ్రామాలలో బాంబులు తయారీకేంద్రాలు ఏర్పాటుచేసే పనిచేస్తున్నది. ఈ సంస్థకు ఇస్లామింక్ తీవ్రవాద సంస్థలతో కూడ సంబంధాలు బయటపడుతున్నాయి. దేశద్రోహ కార్యకలాపాలకు తోడ్పడుతున్నట్లుగా కనబడుతున్నది. అందుకే ఇటువంటి క్లిష్టమైన కేసు విచారణను సుప్రీంకోర్టు సి.బి.ఐ.కి అప్పగించింది. 
 
ఇట్లా తృణమూల్ కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తూ ఉంటే 'చేతనైతే మా ప్రభుత్వాన్ని రద్దు చేయండి చూద్దాం' అంటూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు మమతాబెనర్జీ ప్రయత్నించడం తాజా పరిణామం. ఇటువంటి శక్తులు రాజకీయాలు నడిపిస్తే ఎట్లా ఉంటుందో విశేషంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇటువంటి చిక్కుల్లోంచి దేశం ఎప్పడు బయటపడుతుందో...?