పాలకులను నిలదీయాలి

కలియుగాబ్ది 5114 , శ్రీ నందన నామ సంవత్సరం, అధిక భాద్రపద మాసం

దేశాన్ని పాలించే బాధ్యత అధికార పక్షానికి ఎంత ఉందో, పాలన సక్రమంగా జరిగేటట్లు చూడవలసిన బాధ్యత ప్రతిపక్షానికి కూడా అంతే ఉంది. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించినప్పుడు పాలన బాగుంటుంది. అధికార - ప్రతి పక్షాలు రెండూ శత్రువుల్లా కత్తులు దూసుకొంటూంటే దేశంలో పరిస్థితులు అస్తవ్యస్తమవుతాయి. దేశంలో ఏ ప్రమాదం సంభవించినా, ఘర్షణలు చెలరేగినా పాలకులు, ప్రతిపక్షాలు పరస్పర నిందారోపణలు కాకుండా పరస్పరము కలసి వెళ్లి పరిస్థితులను పరిశీలించి ప్రజలకు ధైర్యం చెప్పినట్లయితే దేశ ప్రజలకు వెళ్ళే సందేశం వేరుగా ఉంటుంది. ఈ పరిస్థితులు ఈ రోజున మనం చూడలేకపోతున్నాము. 

పార్లమెంటు చర్చలలో దేశానికి సంబంధించిన చర్చలకంటే వీధి రాజకీయాల చర్చలే ఎక్కువగా ఉంటున్నాయి. ఏ పార్టీ నుండి ఎన్నిక కాబడినా అందరి లక్ష్యం దేశ హితమే. దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా పరస్పరం దాడులకు దిగుతుంటే ప్రజలు చోద్యం చూడవలసి వస్తున్నది. దేశంలో పెట్రేగిపోతున్న తీవ్రవాదం, మత ఘర్షణలు మొదలైనవాటిని వీళ్ళేం కట్టడి చేయగలుగుతారు? కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు ఎంతగా దిగజారి మాట్లాడతారో దానికి మంచి ఉదాహరణ "దిగ్విజయ్ సింగ్". ప్రస్తుత రాజకీయాలలో దిగ్విజయం సింగ్ లా దిగజారి మాట్లాడేవాళ్ళు ఇంకా ఎందరున్నారో వెతకాలి. వాళ్ళ నోళ్ళు మూయించాలి. దానికి దేశంలో ప్రజలు, మేధావులూ పూనుకోవాలి. గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నానాజీ దేశ్ ముఖ్ గుజరాత్ లో గొడవలు జరిగినప్పుడు దేశ ప్రధాని వాజపాయ్, అప్పటి ప్రతిపక్ష నాయకురాలు సోనియాగాంధీ ఇరువురినీ కలిసి, సంఘర్షణలు జరిగిన ప్రదేశాలు సందర్శించి ప్రజలకు ధైర్యం చెప్పాలని విజ్ఞప్తి చేసారు. అధికార, ప్రతిపక్షం రెండూ దేశంలో మత సామరస్యం దెబ్బ తినటానికి అనుమతించబోమని ప్రజలకు స్పష్టం చేయాలని సూచించారు. కాని ఆ సూచన పాటించబడలేదు. కనీసం సమన్వయంతో వ్యవహరించారా అంటే అదీ లేదు. ఇది ప్రజలకు తప్పుడు సంకేతాలను ఇస్తున్నది. ప్రజలను చీలుస్తున్నది. 

ఓట్ బ్యాంక్ రాజకీయాలకు అలవాటు పడిన నాయకులు దేశాన్ని ఏ దశకు తెచ్చారో నేడు కనబడుతున్నది. కలిసి పని చేసేందుకు పరస్పర విశ్వాసం అవసరం. ఆ విశ్వాసం కోల్పోయినప్పుడు అనుమానాలు, సంఘర్షణలే. అస్సాంలో జరుగుతున్న గొడవల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకొనేందుకు ప్రయత్నం చేస్తారని ఆశించటం కూడా అత్యాశే. దీనికి ప్రజలే పూనుకోవాలి. ప్రజలు పరస్పరం కలిసి బాధితులకు ధైర్యం చెప్పాలి. రాజకీయ నాయకులను నిలదీసి కలిసి పనిచేసేట్లుగా చేయాలి. ప్రజలలో ఈ మార్పు వస్తే పరిస్థితులు కొంత మారవచ్చు.