వ్యక్తులు సంస్కారవంతులైతేనే వ్యవస్థ బాగుంటుంది

ద్వితీయవర్ష శిక్షావర్గ సమారోప్ లో శ్రీ వేణుగోపాల్ రెడ్డి

సార్వజనికోత్సవ వేదికపై ప్రసంగిస్తున్న శ్రీ వేణుగోపాల్ రెడ్డి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వితీయ వర్ష సంఘ శిక్షావర్గ భాగ్యనగర్, నారాయణ గూడలోని కేశవ స్మారక విద్యాలయ ప్రాంగణంలో మే 5 నుండి 26 వరకు జరిగింది. ఇందులో పశ్చిమాంధ్ర ప్రాంతం నుండి 116 మంది శిక్షార్ధులు, పూర్వాంధ్ర ప్రాంతం నుండి 42 మంది శిక్షార్ధులు పాల్గొన్నారు. వీరికి శిక్షణ ఇవ్వటానికి 20 మంది శిక్షకులు, శిబిర నిర్వహణకు 50 మంది ప్రబంధకులు కూడా పాల్గొన్నారు. 2012 మే 25 సాయంకాలం సార్వజనికోత్సవం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సామాజిక కార్యకర్త డా.ఎం.అంజయ్య, విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉన్నత అధికారిగా పని చేసి రిటైరైన మనోహరరావు గారు పాల్గొన్నారు. కరీనగర్ విభాగ్ సంఘచాలక్ శ్రీ మల్లోజుల కిషన్ రావు వర్గ సర్వాధికారిగా వ్యవహరించారు. శిబిర నివేదిక తర్వాత శారీరక్, ఘోష్ ప్రదర్శనలు కన్నుల పండువగా జరిగాయి. శ్రీ పి.వేణుగోపాల రెడ్డి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రాంత కార్యకారిణి సభ్యులు ప్రధాన వక్తగా విచ్చేసి ప్రసంగించారు. 

శ్రీ వేణుగోపాల రెడ్డి ఉపన్యాసం 

"మన దేశం అనేక రంగాలలో అనేక రకాలుగా అభివృద్ధి సాధించింది. మన శాస్త్రజ్ఞులు ఈ మధ్యనే సుదూర లక్ష్యాలను చేధించ గలిగిన క్షిపణిని ప్రయోగించి పరీక్షించడంలో విజయులయ్యారు. ఈ క్షిపణి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే తయారయ్యింది.

దేశం ఇన్ని రంగాలలో అభివృద్ధి సాధించింది. అయినా ప్రజలు ఆనందంగా లేరు. నిరాశ నిస్పృహకు లోనవుతున్నారు. ఒకవైపు దేశం ఇంతగా ప్రగతి సాధిస్తున్నా, ప్రజలలో ఆనందం ఎందుకు కొరవడింది? ప్రజలకు సుఖంగా ఉండడానికి పంచాయితీ, మున్సిపాలిటీ, అసెంబ్లీ, పార్లమెంట్ వ్యవస్థలను ఏర్పరచుకున్నాం.  ఈ వ్యవస్థలలో పనిచేసే వారందరూ ప్రజలకు సేవ చేసేవారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే వారందరూ ప్రజలకు సేవకులు. పై వారందరి జీతాలు మనం చెల్లించే పన్నుల నుండి చెల్లించబడుతున్నాయి. సర్పంచ్ కాని, ఎం.ఎల్.ఏ. కాని, ఎం.పి. కాని వీరందరూ ప్రజలకు సేవకులే. అలాగే మంత్రులు కూడా ప్రజలకు సేవకులే.. కాని మన దేశంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది.

ప్రభుత్వ కార్యాలయానికి వెళితే ఆ ఉద్యోగి మనను ఖాతరు చేయడు, సరిగా సమాధానం ఇవ్వడు. ఆ ఉద్యోగికి జీతమందేది మనలాంటి పౌరులు కట్టే పన్నుల నుండే అయినా వాడి ప్రవర్తనకు పౌరులే అణగి మణగి ఉంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ప్రజలకు సేవకులుగా ఉండవలసిన వారు యజమానులుగా మసలుకుంటున్నారు. ఈ విచిత్రమైన స్థితి మన దేశంలో నెలకొని ఉంది. రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల వల్ల ప్రజలు కులాల వారిగా విడిపోతున్నారు. చట్టాలు చాలా ఉన్నాయి. కాని అవి పాటించే నిబద్ధత ఏది? చట్టం నుండి ఎలా తప్పించుకోవచ్చో అధికారులే బోధిస్తుంటే.. నైతిక విలువలు ఎలా రక్షింప బడతాయి? లోపం వ్యక్తిలో ఉంది. ఆ వ్యక్తిని సంస్కరించాలి. బాగుచేయాలి. ఈ దేశంలో నివసించే మేమందరం ఈ భారతమాత సంతానం, మేమందరం ఒకే కుటుంబం - ఈ భావన నిర్మాణం కావాలి.

శారీరిక ప్రదర్శన నిర్వహిస్తున్న స్వయంసేవకులు

ఈ భావన నిర్మాణం చేయడానికే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం కృషి చేస్తున్నది. నిత్య శాఖా కార్యక్రమాల ద్వారా అందరితో కలిసిపోయే మనస్తత్వం, ఆటపాటల ద్వారా మనమంతా ఒకటే అనే భావన, ఆటల ద్వారా విజిగీషు ప్రవృత్తి... ఇలా ఒకటేమిటి ? రకరకాల శారీరిక, మానసిక కార్యక్రమాల ద్వారా ఆ వ్యక్తిలో సంస్కారాలను నింపే ప్రయత్నాలు జరుగుతాయి. అందులో భాగంగానే ఈ శిక్షావర్గలు. ఈ ఇరవై రోజుల శిక్షావర్గలో స్వయంసేవకులు అన్ని ఖర్చులు తామే భరించి పాల్గొంటారు. శిక్షావర్గ సవ్యంగా జరగడానికి శిక్షకులు, ప్రబంధకులు వర్గలో పాల్గొంటారు. ప్రబంధకులుగా వచ్చిన వారు తమకు ఏ విభాగం పని అప్పజెప్పితే ఆ విభాగం పని చూసుకుంటారు. అంతే తప్ప నేను ఈ పనే చేస్తాను, ఆ పని చేయను, అని అనరు. ఈ మనస్తత్వం సంఘ శిక్షావర్గ ద్వారానే లభిస్తుంది. నిత్య శాఖ, శిక్షావర్గల ద్వారా బాధ్యతాయుతమైన వ్యక్తులు తయారు చేయబడతారు. ప్రతి క్రియాశీలమైన వ్యక్తి సమాజంపై ప్రభావం చూపాలి. అతడు ఎక్కడ పనిచేసినా అతని ప్రభావం ఆ చుట్టుప్రక్కల ప్రసరించాలి. మన లక్ష్యమైన ఈ దేశ పరమ వైభవ స్థితిని సాధించ గలుగుతాము. నిత్య శాఖ, శిక్షావర్గలో నిర్మాణమైన క్రియాశీలమైన కార్యకర్తల ద్వారానే ఇది సాధ్యమౌతుంది" అని చెపుతూ శ్రీ వేణుగోపాల రెడ్డి తమ ప్రసంగాన్ని ముగించారు.