సజ్జన శక్తి జాగృతే దేశ సమస్యలకు పరిష్కారం

పూర్వాంధ్రప్రదేశ్ హిందూ చైతన్య శిబిరంలో శ్రీ మోహన్ భాగవత్ పిలుపు

హిందూ చైతన్య శిబిర సార్వజనికోత్సవంలో ప్రసంగిస్తున్న శ్రీ మోహన్ జీ భాగవత్, ప్రక్కన ఆసీనులైన పూజ్య శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామీజీ
ఆంధ్రప్రదేశ్ లో సంఘం ప్రారంభించబడి 75 సంవత్సరాలు పూర్తయింది. స్వామి వివేకానంద జన్మించి 150 సంవత్సరాలు అయ్యింది. ఈ రెండు సందర్భాలను పురస్కరించుకొని పూర్వ ఆంధ్రప్రదేశ్ లో జనవరి 18, 19, 20 తేదీలలో హిందూ చైతన్య శిబిరం నిర్వహించబడింది. ఆద్యంతం ఉత్సాహ వంతంగా నిర్వహించబడిన ఈ శిబిరంలో రెండు వేలకు పైగా గ్రామాల నుండి 17,300 మంది గణవేషధారి స్వయంసేవకులు పాల్గొన్నారు.  

హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేయటానికి నిరంతరం పర్యటిస్తూ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే శ్రీశ్రీశ్రీ పరిపూర్ణానంద స్వామీజీ 18వ తేదీ ఉదయం లాంఛనంగా శిబిరం ప్రారంభించి ప్రారంభోపన్యాసం చేశారు. ఆర్.ఎస్.ఎస్. సర్ కార్యవాహ మాననీయ భయ్యాజీ జోషి ప్రసంగించారు. 19వ తేదీ ఉదయం పూజ్య శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానందస్వామి (కుర్తాళం పీఠాధిపతి) అనుగ్రహభాషణం చేశారు. అదేరోజు సాయంత్రం విజయవాడ, గుంటూరు నగరాలలో అపూర్వమైన పథసంచలన్ కార్యక్రమం నిర్వహించబడింది. 20వ తేదీ మధ్యాహ్నం సాధుసంతులు, ప్రతిష్ఠిత వ్యక్తులు, మహిళలకు ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. అదేరోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహించిన బహిరంగసభలో పూజ్య శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామిజీ ఆశి:ప్రసంగం చేసారు. ముఖ్య అతిథిగా శ్రీ కరణం అరవిందరావు (రిటైర్డ్ డిజిపి) పాల్గొని ప్రసంగించారు. పూజనీయ సర్ సంఘచాలక్ జీ బహిరంగ సభలో మార్గదర్శనం చేశారు.

ఈ కార్యక్రమంలో విశేష ఆకర్షణ భారతీయ ప్రజ్ఞ ప్రదర్శిని. ఈ కార్యక్రమానికి పత్రికా రంగము, ఛానల్స్ విశేష ప్రాధాన్యతనిచ్చాయి. పత్రికలలో వచ్చిన విశేషాలు అందరిని ఆకర్షించాయి. ఆద్యంతము విశేషంగా నిర్వహించబడిన ఈ శిబిరంలో పాల్గొని ప్రసంగించిన పెద్దల ప్రసంగాల సారాంశము లోకహితం పాఠకులకు అందిస్తున్నాము.

పూజ్య శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి :పూజ్య శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి తమ ప్రసంగంలో చిన్న వయసులో తాను శాఖలో నేర్చుకున్న "భారతాంబిక పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం" అనే పాటలో ఒక చరణం పాడి, ఆ పాటే తన జీవితానికి పునాది వేసిందని అన్నారు. ఈ పుణ్యభూమిలోని నీరు, గాలి స్వచ్ఛమైన హిందువుకు ఆయువుపట్టనీ, భారతజాతికే నిజమైన చరిత్ర చెప్పే దమ్ము ఉందని అన్నారు. దేశాన్ని, ధర్మాన్ని వేరుగా చూడరాదన్నారు. భారతమాత మన తల్లి, పరమేశ్వర ప్రతిరూపమైన హిందూ ధర్మం మన తండ్రి. ఈ దేశం హిందూ దేశంగా ఉండాలంటే ధర్మాన్ని కాపాడాలన్నారు. ధర్మానికి అనుసంధానమైనవి గోవు, గంగ, గీత, గోవిందుడు, గురువు అని, వాటిని హిందువులు కాపాడాలన్నారు. నేడు దేవాలయాలు ఎబిసిడి తరగతులుగా విభజించబడి అతలాకుతలం అయ్యాయన్నారు. డాక్టర్జీ, గురూజీ, స్వామి వివేకానంద వంటి బోధకులను కాపాడుకోవాలన్నారు. సూర్యుడిగా హెడ్గేవార్, చంద్రుడిగా గురూజీ అసీనులైన 40వేల మంది స్వయంసేవకుల దళం గళంగా మీ ముందు ఉన్నారని స్వయంసేవకులను మెచ్చుకున్నారు. ఇటువంటి కార్యక్రమాలు దేశమంతా జరగాలనీ, ఇక్కడికి వచ్చినందుకు తానెంతో అదృష్టవంతుడనని అన్నారు.

శ్రీ భయ్యాజీ జోషి ప్రసంగం : 


సంఘ సర్ కార్యవాహ మాననీయ శ్రీ భయ్యాజీ జోషి ప్రసంగిస్తూ శ్రీ పరిపూర్ణానంద స్వామి ఉద్ఘాటన కార్యక్రమంలో పాల్గొనటం మన అందరి అదృష్టమన్నారు. హిందూ అంటే సంప్రదాయం, పూజా పద్ధతి, గ్రంథపఠనం మాత్రమే కాదని అన్నారు. పరమపూజ్య శ్రీ డాక్టర్జీ సమాజ జీనవానికి, విశ్వకల్యాణానికి రాష్ట్రీయ స్వయంసేవక సంఘమును 1925లో స్థాపించారని, నేడు సంఘం దేశమంతా విస్తరించిందని అన్నారు. ఈ రోజున దేశంలో కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్, ఈశాన్య ప్రాంతాల సరిహద్దులు విద్రోహశక్తులకు ఆలవాలమైనాయనీ, నక్సల్ వాదులు, ఉగ్రవాదుల బెడద దేశానికి సవాలుగా మారిందన్నారు. భారత సైన్యంపై ధృడనమ్మకం ఉందనీ, భాష, కులం, ప్రాంతాల వారీగా కాకుండా హిందువులంతా ఐక్యంగా ఉండాలన్నారు. సేవ పేరుతో కొన్ని సంస్థలు మతం మార్పిడులకు పాల్పడుతున్నాయనీ, వీరిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న, భోగవాద చింతన ప్రమాదకరంగా మారిందన్నారు. నేడు మహిళల పరిస్థితి దారుణంగా ఉందనీ, బైటకు వెళ్లిన స్త్రీ సురక్షితంగా వస్తుందన్న భరోసా లేదన్నారు. జీవన మూల్యాల రక్షణ నేటి కర్తవ్యమనీ, సంఘటనల పట్ల మూగసాక్షులు కారాదన్నారు. నేడు మహిళలు పలురంగాలలో ముందుకు వెళ్తున్నారు. మాతా స్వరూపంగా దేవతలను మనం ఆరాధిస్తాం. స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా వారి బోధనలను సమాజం ముందు ఉంచాలన్నారు. పూర్వాంధ్రలో జరుగుతున్న ఈ మూడు రోజుల శిబిరం శక్తి సమీకరణకు దోహద పడుతుందన్నారు. సజ్జనశక్తిని జాగరణ చేసి హిందువులను కలుపుకుపోవాలన్నారు. కాలక్రమంలో హిందూజాతిలో తలెత్తిన దోషాలను తొలగించుకోవాలని పిలుపునిచ్చారు.

బహిరంగ సభ : 


గుంటూరు జిల్లా కాజ గ్రామంలోని శాతవాహన నగర్ లో 11 జిల్లాలకు చెందిన వేలాది మంది స్వయంసేవకులు సువిశాల మైదానంలో భగవాధ్వజం ముందు బారులు తీరారు. వేదికనలంకరించబోయే పెద్దలకు శంఖానాదంతో స్వాగతం పలికారు. ధ్వజారోహణం, ప్రార్థన, సూర్య నమస్కారాలు, వ్యాయామ్ యోగ్ - దండతో, ఘోష్ తో, బ్యాండ్ - శంఖ్ దళ్ (డ్రమ్), బిగిల్, ఆనక్, తాళ్ గంట, వంశీ వాయిద్యాలతో వీక్షకులకు కనువిందు చేశారు.


'జయహో జయభారతం' వైయక్తిక గీత్ వసుధైక కుటుంబాన్ని, చెట్టు, పుట్ట, జీవకోటి, ప్రకృతిని ప్రతిబింబిస్తూ కొనసాగింది. సార్వజనికోత్సవం సందర్భంగా స్వాగత సమితి అధ్యక్షులు, విశ్వహిందూ పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ గోకరాజు గంగరాజు ఆశీనులైన స్వామీజీలు, పెద్దలకు నమస్సులు తెలిపారు. వారు తమ ఉపన్యాసంలో అంటరానితనం శాపమనీ, మతమార్పిడులకు అడ్డుకట్ట వేయాలన్నారు. స్వామి వివేకానంద, పూజ్య డాక్టర్జీ బోధించిన హిందూ సమాజ సంఘటనకు పిలుపునిచ్చారు. శిబిర నిర్వహణకు సహకరించిన వారందరికీ శ్రీగోకరాజు గంగరాజు ధన్యవాదములు తెలియచేశారు. సహకరించిన వదాన్యులకు ధన్యవాదములు తెలుపుతూ, ఈ శిబిరంతో హిందూ సంఘటనను మరింత వేగవంతం చేయాలన్నారు. క్షేత్రసంఘచాలక్ శ్రీ దేశ్ ముఖ్, పూజ్య త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామికి ఫలాలను అందచేశారు.

పూజ్యశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జియ్యర్ స్వామిజీ ఆశి:ప్రసంగం : 

పూజ్యశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జియ్యర్ స్వామిజీ

భగవద్భంధువులను ఉద్దేశించి "తేజస్సు, శక్తి కలిసి సాగుతుందని, స్వయంసేవకులు అటువంటి ఉత్తమ ఉద్యమానికి నాంది పలికారని మంగళాశాసనములు చేసారు. 'యతో అభ్యుదయ' అని వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, శాస్త్రాలు ధర్మఘోష చేశాయనీ, దీనిని స్వయంసేవకులు ఆచరించే ప్రయత్నం చేస్తున్నారనీ, ఈ ధర్మ ఘోషను ఆచరించే విషయాన్ని సమాజంలో కొందరు మరిచారన్నారు. ధర్మానికి వారసులమని మనం చాటగలిగితే, మిగిలినవారు ఆలోచిస్తారని అన్నారు. ధర్మాన్ని జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏది ధర్మమో, ఏది కుటుంబ ఆచారమో దానిని ఆచరించాలన్నారు. నాస్తికునికి కూడా ఈ సమాజంలో గౌరవం ఉందన్నారు.

నేడు ఆదర్శ గ్రామాల స్థితి అవసరం ఉంది. ఆధునికంగా స్మార్ట్ ఫోన్ లు, సెల్ ఫోన్ లు, టీవీల కారణంగా వ్యక్తిగత కలయికలు తగ్గుతున్నాయనీ, పట్టణాలలోనే కాదు, గ్రామాలలోను మానవత్వపు ఛాయలు తగ్గడం గమనార్హమని అన్నారు. మీలో మానవత్వపు సౌరభాలు స్థిరంగా ఉన్నాయి. స్వాభిమానం జాగృతం కావాలనీ, యువత ఆ బాధ్యత చేపట్టాలన్నారు. ధర్మకుటుంబం, దైవ కుటుంబం అంటూ మీరంతా చొరవ చూపించారు. ఆదర్శ గ్రామాల స్థితి ఉద్యమానికి ఈ శిబిరం నాంది పలకాలన్నారు. ఇది ద్వైతమా, అద్వైతమా అనేది ప్రశ్న కాదని చెపుతూ తమ ఆశీ:ప్రసంగం ముగించారు.

ముఖ్య అతిథి విశ్రాంత డిజిపి కరణం అరవిందరావు : 
"స్వామీజీలకు, పెద్దలకు నమస్కారాలు". దేశ సమగ్రతపై భక్తి ఉన్న సంస్థ ఆర్.ఎస్.ఎస్. ఒక్కటే. నేడు జీవన సంస్కృతి కూడా ప్రపంచీకరణ జరుగుతోంది. మనపై సాంస్కృతిక దాడులు బ్రిటిష్ వారితో మొదలైనాయి. వారు మన సంస్కృతిని ఆటవిక సంస్కృతి అని ముద్ర వేశారు. పాశ్చాత్యులు మన పుస్తకాలపై ఎన్నో వక్రభాష్యాలు చెబుతున్నారు. 'టెలిగ్రాఫ్" యుకె పత్రికలో వచ్చిన చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యాఖ్యలను గుర్తు చేసారు. మేధావులలో చైతన్యం కలిగించాలంటే, వివేకానంద స్వామి ప్రసంగాలలో ఎన్నో అంశాలు మనకు లభిస్తాయన్నారు. భగవద్గీత, ఉపనిషత్తులలో ఎంతో సాత్విక బలం ఉందనీ, ఇవి మతాలకు అతీతమని అన్నారు. హిందువు ఎప్పటికీ మతఛాందసుడు కాడు. మనం ఏ దేశం పైనా దాడి చేయలేదు. ఎవరైనా తమ మతం జనాభా పెంచుకోవడం ప్రధానంగా ఎంచుకున్నప్పుడే చిక్కులు వస్తాయి. హైదరాబాద్ లో ఓ నాయకుడు తనకు ఎంతో శక్తి ఉందని సవాలు విసిరాడు. బంగ్లాదేశ్ లో హిందువుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. భారత్ లో మైనారిటీలు ఎంతో సురక్షితంగా ఉన్నారని ఈ మధ్య కేంద్రమంత్రి ఎ.కె.ఆంటోనీ అన్నారు. మేధావులు సంస్కృతికి దూరమయ్యా రన్నారు. స్వయంసేవకులు భారతం, రామాయణం చదవాలన్నారు. సాత్విక శక్తిని పొందాలన్నారు.

పూజనీయ సర్ సంఘచాలక్ మాననీయ శ్రీ మోహన్ జీ భాగవత్ : 
శ్రీ మోహన్ జీ భాగవత్ వారి ప్రసంగంలో పర్యావరణ సమస్యలు కుటుంబాల విచ్ఛిన్నంటాంటి అనేక సమస్యలతో ఈ రోజున ప్రపంచం అతలాకుతలమవుతున్నదనీ, భారతదేశంలోని సనాతన విలువలను మనం ముందుగా జాగృతం చేసి ప్రపంచానికి మార్గదర్శనం చేయాలని పిలుపునిచ్చారు. పాకిస్థాన్ గత కొద్ది రోజులుగా వ్యవహరించే తీరు చూస్తే అది మిత్ర దేశం కాదు శతృదేశమనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చైనా కూడా అలాగే మనకు ప్రమాదకారి. సరిహద్దుల బలహీనం కారణంగా మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, దొంగ కరెన్సీ విచ్చలవిడిగా దేశంలోకి వస్తున్నాయని అన్నారు. మన దేశ విధానాలు దేశ హితానికి మేలు కలిగించేవిగా లేవు. ధరల పెరుగుదల, చిల్లర వ్యాపార రంగంలో విదేశీ పెట్టుబడులు, కుల, ప్రాంత విభేదాలు ప్రజలలో నిరాశా నిస్ప్రహను కలిగిస్తున్నాయి. నేడు సమాజంలో దేశభక్తి భావనలను జాగృతం చేయాలని అన్నారు. రాడికల్ హ్యూమనిజం ప్రవక్త ఎమ్.ఎన్.రాయ్ కూడా జాతీయ భావనల ఆవశ్యకతను ఉటంకించారు. నేడు దేశంలో భాషలు వేరు, భోజన పద్ధతులు వేరు. అయితే ఆ వైవిధ్యాన్ని కాపాడుతూనే హిందుత్వ భావజాలాన్ని, జీవన విలువలను మనం అనుసరించాలి. పూర్వాంధ్ర, పశ్చిమాంధ్రలో మాట్లాడుతున్న తెలుగు భాష ఒక్కటిగా ఉందా? లేదు. అట్లాగే దేశంలో అనేక భాషలు ఉన్నాయి. హిందూ తత్వాన్ని జాగృతం చేయాల్సిన అవసరం ఉంది. ఆర్.ఎస్.ఎస్. లోకకళ్యాణం కోసం పని చేస్తున్నది. ఆర్.ఎస్.ఎస్. ఎవరినీ భయభ్రాంతులను చేయదు, ఎవరికీ భయపడదు. సంఘాన్ని తీవ్రవాదంతో జోడించరాదు. సమాజంలో సామాజిక పరివర్తన కొరకు సంఘం దేశవ్యాప్తంగా 1,30,000 సేవా కార్యక్రమాలను చేపట్టింది. సంఘటిత హిందూ సమాజ నిర్మాణానికి సంఘం కృషి చేస్తున్నది. సమాజంలో సంఘటన శక్తి నిర్మాణం యొక్క అవసరాన్ని అబ్దుల్ కలాం వంటి వారు గుర్తించారు. శక్తి అంటే ఆయుధాలను సమకూర్చటం మాత్రమే కాదు. లోకహితం, దేశహితం, సమాజహితం ఉండాలి. సద్గుణ వికాసంతోనే సమాజం జాగృతమవుతుందని అన్నారు.

సంఘంలో గంట సేపు జరిగే శాఖ కార్యక్రమానికి మీరు రండి. ఆ గంట సమయం సద్గుణ సంపన్నతకు నాంది పలుకుతుంది. రాష్ట్ర సేవికా సమితి మహిళల కోసం కృషి చేస్తున్నది. నేడు సజ్జన శక్తిని జాగృతం చేయాలి. ఈ పనిలో అందరూ భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిస్తూ మోహన్ జీ ప్రసంగం ముగించారు.