సమాజ కార్యమే జీవన వ్రతంగా స్వీకరించిన స్వర్గీయ టి.వి.దేశ్ ముఖ్

శ్రద్ధాంజలి సభలో నివాళులర్పించిన ఆర్.ఎస్.ఎస్. సర్ కార్యవాహ శ్రీ భయ్యాజీ జోషి


శ్రద్ధాంజలి సభలో ప్రసంగిస్తున్న ఆర్.ఎస్.ఎస్. సర్ కార్యవాహ మాననీయ శ్రీ భయ్యాజీ జోషి

"ఈనాటి కలుషిత వాతావరణంలో విశుద్ధంగా ఉండటం, సమర్పణ భావంతో ఉండటం, కర్మశీలతతో ఉండటం చాలాకష్టం. ఈ మూడు సద్గుణాలు మూర్తీభవించిన వ్యక్తి స్వర్గీయ శ్రీ దేశ్ ముఖ్ గారు. బాల్యజీవితంలోనే సంఘంలో చేరారు, ప్రచారక్ గా కొంతకాలం పనిచేశారు. గృహస్తు జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నారు, అయినా నిలబడ్డారు. క్రిందిస్థాయి నుండి ప్రాంత, క్షేత్ర సంఘచాలకులుగా ఎదిగారు. 'ఈశ్వరుడు ఈశ్వరీయ కార్యం కోసం ఈశ్వరనిష్ఠ కలిగిన కార్యకర్తల పరంపరను సృజిస్తూనే ఉంటాడు' అని సంత్ జ్ఞానేశ్వర్ చెప్పారు. అటువంటి పరంపరకు చెందిన దేశ్ ముఖ్ జీ ఈశ్వరునిలో లీనమయ్యారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తూ వారి పవిత్ర ఆత్మకు ప్రణామాలర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను" అని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సర్ కార్యవాహ మాననీయ శ్రీ భయ్యాజీ జోషి అన్నారు. స్వర్గీయ టి.వి.దేశ్ ముఖ్ గారి శ్రద్ధాంజలి సభకు భయ్యాజీ ముఖ్య అతిథిగా విచ్చేసి, ప్రసంగించారు.  

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ దక్షిణమధ్య క్షేత్ర సంఘచాలక్ గా ఉన్న టి.వి.దేశ్ ముఖ్ గారు గత కొంతకాలంగా ప్రొస్టేట్ క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ దీపావళి పండుగ రోజున (అక్టోబర్ 23, 2014) తుదిశ్వాస విడిచారు.   

అక్టోబర్ 27న హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ మెమోరియల్ క్యాంపస్ పటేల్ హాల్ లో శ్రద్ధాంజలి సభ జరిగింది.  

ఆ సభలో క్షేత్ర కార్యవాహ శ్రీ దూసి రామకృష్ణగారు మాట్లాడుతూ -"ఒక పర్యటన కార్యకర్తకు ఉండవలసిన సక్రియత, సహజత, సంఘ కేంద్రిత నిష్ఠ, సంవాదము, సమన్వయము, సకారాత్మకత, సార్థకత, సమరసత ఈ ఎనిమిది గుణాలు శ్రీ దేశ్ ముఖ్ జీలో ఉన్నాయి'' అన్నారు.

శ్రద్ధాంజలి సభలో పాల్గొన్న దేశ్ ముఖ్ జీ కుటుంబ సభ్యులు, స్వయంసేవకులు

దేశ్ ముఖ్ జీ అనేక సామాజిక సంస్థల వికాసానికి కృషి చేశారు. అటువంటి సంస్థలలో ఒకటి కేశవ మెమోరియల్ విద్యాసంస్థ. ఆ సంస్థకు ప్రస్తుతం చైర్మన్ గా ఉన్న జస్టిస్ ఎల్.నరసింహారెడ్డిగారు శ్రద్ధాంజలి సభలో ప్రసంగిస్తూ -"క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కేశవ మెమోరియల్ విద్యాసంస్థను ఒక ఆరోగ్యకరమైన స్థాయికి తీసుకొచ్చారు శ్రీ దేశ్ ముఖ్ గారు. ఈ సంస్థను ప్రజోపయోగకరమైన పనులకు ఎలా వినియోగించాలనే విషయమై తపన చెందేవారు. వారితో అందరికి చక్కటి చనువుండేది. దేశ్ ముఖ్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ. పునర్జన్మ అంటూ ఉంటే ఒక స్వయంసేవక్ గానే జన్మించాలని వారు కోరుకునేవారు'' అని అన్నారు.  

ఆంధ్రభూమి సంపాదకులు శ్రీ ఎం.వి.ఆర్.శాస్త్రి మాట్లాడుతూ -"దేశ్ ముఖ్ అచ్చమైన ఆర్.ఎస్.ఎస్. నాయకుడు. ఆర్.ఎస్.ఎస్. నాయకుడికి పనిచేయడమే కాని, ప్రతిఫలం ఆశించటం తెలియదు. సద్గురు శివానందమూర్తిగారిని దేశ్ ముఖ్ గారు తమ ఆధ్యాత్మిక గురువుగా భావించేవారు, సద్గురు శివానందమూర్తిగారి ఆలోచనలను ఆచరణలో పెట్టినవారు శ్రీ దేశ్ ముఖ్. 'ధర్మశక్తి' సంస్థకు దేశ్ ముఖ్ కొండంత అండగా ఉండేవారు. వారు లేనిలోటు తీర్చలేనిది" అంటూ నివాళి అర్పించారు శ్రీ ఎం.వి.ఆర్.శాస్త్రిగారు.  

దేశ్ ముఖ్ జీ సంఘానికి ఒక పెద్ద దిక్కు అని, వారు లేనిలోటు పూడ్చలేనిదని సరస్వతి విద్యాపీఠం సంఘటన మంత్రిగా ఉన్న శ్రీ లింగం సుధాకరరెడ్డిగారు తమ ప్రసంగంలో పేర్కొన్నారు. కర్నూలులోని ఛత్రపతి శివాజి స్ఫూర్తి కేంద్రం నిర్మాణంలో స్వర్గీయ రాంమోహన్ రావుగారి వంటివారు ప్రముఖ పాత్ర పోషించినా, దానిని ప్రజలందరికి దర్శనీయ స్థలంగా మార్చటంలో దేశ్ ముఖ్ జీ చేసిన కృషి విశేషమైనదని అన్నారు. సంఘం తరువాత విద్యాపీఠం పనికి విశేష కృషి చేశారు దేశ్ ముఖ్ గారు. విద్యాపీఠానికి సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించడానికి ఎంతో కృషి చేశారు. సంఘ వివిధ క్షేత్రాలను సక్రమంగా నడిపేందుకు దేశ్ ముఖ్ గారు ఎంతో కృషి చేశారని శ్రీ సుధాకరరెడ్డిగారు పేర్కొంటూ, దేశ్ ముఖ్ జీ మృతికి తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. 

స్వర్గీయ దేశ్ ముఖ్ జీకి నివాళి
స్వర్గీయ దేశ్ ముఖ్ గారి పెద్ద కుమారుడు శ్రీ టి.వి.చరణ్ కూడా ప్రసంగించారు. నాన్నగారు కుటుంబానికి ఎంతో విలువనిచ్చేవారు. అయినప్పటికి సంఘ కార్యానికి ఎటువంటి ఇబ్బంది రానివ్వలేదని చరణ్ అన్నారు.  

ప్రసంగించినవారిలో వైదేహీ ఆశ్రమానికి చెందిన శ్రీ బాలకృష్ణ, బి.ఎమ్.ఎస్. నాయకులు శ్రీ మల్లేశం, శంషాబాద్ లోని రామానుజ చిన్నజియర్ స్వామీజీ సంస్థ కార్యదర్శి శ్రీ పురుషోత్తమరావు, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు, భారతీయ జనతాపార్టీ నాయకులు శ్రీ బండారు దత్తాత్రేయ తదితరులు ఉన్నారు. వక్తలంతా దేశ్ ముఖ్ జీతో వారికి గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.  

ఈ శ్రద్ధాంజలి సభలో అనేకమంది ప్రముఖులు, ఆర్.ఎస్.ఎస్. ప్రాంత, క్షేత్ర నాయకులు, సంఘ వివిధ క్షేత్రాల నాయకులు, అనేకమంది స్వయంసేవకులు పాల్గొని స్వర్గీయ దేశ్ ముఖ్ జీకి సంతాపం తెలియచేశారు.

- సమాచార భారతి