ప్రయాగలో పూర్ణ కుంభమేళా


'పుణ్యభూమి నా దేశం నమో నమామి - ధన్యభూమి నా దేశం సదా స్మరామి' న్నాడొక కవి. నిజమే మరి! మన హిందూదేశం పుణ్యభూమి. ఇక్కడ ఎల్లప్పుడూ ఏదో ఒక పుణ్యకార్యం, ధర్మకార్యం జరుగుతూనే ఉంటుంది. అదే క్రమంలో వచ్చే సంవత్సరం 2013 జనవరి 14 సంక్రాంతి పర్వదినం మొదలుకుని మార్చి 10 మహాశివరాత్రి పర్వదినం వరకు క్షేత్రరాజంగా పిలువబడే ప్రయాగలో గంగా-యమున-సరస్వతి పుణ్యనదుల సంగమ స్థానమైన ప్రయాగ త్రివేణి సంగమ తీరాన పూర్ణకుంభమేళా జరుగనున్నది.  

పుణ్యస్నానాలు చేసే కోట్లాది భక్తజనులు పుష్యపౌర్ణమి, మౌని అమావాస్య, వసంత పంచమి మరియు మాఘపూర్ణిమ తిథులు అత్యంత పవిత్రమైనవిగా భావించి ఆయా తిథులలో పవిత్ర స్నానాలు చేయాలని కోరుకుంటారు. అయితే కుంభమేళా జరిగినన్నాళ్ళు అన్ని దినాలు కూడా స్నానాలు చేయటానికి పవిత్రమైనవి అని కూడా గ్రహించాలి. త్రివేణి తీరం ఈ కాలంలో "హర హర గంగే", "భం భం భోలే" నినాదాలతో మారుమ్రోగుతుంది. 

ఈ పుణ్యకార్యం విజయవంతంగా నిర్వహించడంలో విశ్వహిందూ పరిషత్ పూర్తిగా కృషి చేస్తున్నది. ఈ కుంభమేళా దర్శించదలచుకున్నవారు తగినంత ముందుగా ఏర్పాట్లు చేసుకోగలరు. ఎందుకంటే యాత్రికులు దేశ విదేశాల నుండి వస్తారు. సంఖ్య లక్షలలో ఉంటుంది. యావత్ ప్రపంచంలో జనసమూహం ఒకేచోట కలవడమనే విషయంలో కుంభమేళాకు ప్రపపంచస్థాయి రికార్డు ఉంది మరి!

- ధర్మపాలుడు