పశుమాంస ఎగుమతిని నిషేధించాలంటూ ముస్లింల ధర్నా

 
భారతదేశం నుండి పశుమాంసం ఎగుమతిని నిషేధించాలని 'పస్ మందా మహమ్మదీయ సమాజం' (Pasmanda Muslim Society) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించింది. ధర్నాలో సంస్థ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ భారతదేశం నుండి భారీయెత్తున పశుమాంసం విదేశాలకు ఎగుమతి చేయబడుతున్నదని, దీనివల్ల భారతదేశంలో పశుసంపద నశించిపోతున్నదని అన్నారు. అంతేకాకుండా దేశీయంగా మాంసం ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఎగబాకుతున్నాయి. ఈ దేశంలో మాంసం ఎగుమతి వ్యాపారంలో పెద్ద మాఫియా ప్రవేశించింది. ఈ దేశం నుండి పశుమాంసం ఎగుమతిని నిషేధించాలి, లేదంటే మా సమాజం తరపున పెద్ద ఎత్తున ప్రజాఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అంతేకాకుండా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇస్లాం ప్రకారం ఆవులను చంపటం తప్పనిసరి కాదు, అలాగే మహమ్మద్ ప్రవక్త ఆవుపాలను అమృతంగా పేర్కొన్నారని అన్నారు. ఆవుమాంసం తినడం వల్ల శరీరం అనేక రోగాలకు కారణమవుతుందన్నారు. 
 
భారతదేశంలో ఆధునిక కాలంలో పశుపోషణదారులు, వ్యవసాయదారులు పశువులను ధనాపేక్షతోనే చూస్తున్నారు. ప్రాచీనకాలంలో భారతదేశంలో పశుపోషణ ప్రధానవృత్తిగా ఉండేది.  వారు పశువులను పాలకొరకు మాత్రమే కాక, వట్టిపోయిన పశువులను, వయసుమీరిన పశువులను మందగా పోషించడం ద్వారా వ్యవసాయానికి అవసరమైన సేంద్రియ ఎరువులైన పేడ, మూత్రాలను తయారుచేసుకొనే వారు. ప్రస్తుతం సేంద్రియ ఎరువులు వ్యవసాయానికి తగినంత అందుబాటులో లేకపోవడం వల్ల 'యూరియా' వంటి రసాయనిక ఎరువులను కొన్నివేల కోట్ల విదేశీమారక ద్రవ్యాన్ని వెచ్చించి దిగుమతి చేసుకొనే దుస్థితి ఏర్పడింది. 
 
ఈనాడు కేవలం పాలిచ్చే పశువులను మాత్రమే పోషిస్తూ మిగతావాటిని కబేళాలకు తరలిస్తున్నారు. ఇది చాలా దారుణం. ఈ పవిత్ర భూమిలో మానవ సమాజానికి, పశువులు పరస్పరం ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించే ఆత్మీయ అవినాభావ సంబంధం ఉంది. పశువులను కేవలం రోజువారి డబ్బును తెచ్చిపెట్టే జీవాలుగా కాకుండా కుటుంబంలో భాగంగా చూడాలి. కొన్ని గ్రామాలలో వ్యవసాయ దాడుల నుండి, వర్షాకాలం, ఎండాకాలం నుండి పశువుల సంరక్షణకు వాటిని తమతోబాటు సమానంగా ఇండ్లలో కట్టివేయడం ఇప్పటికి చూడవచ్చు.  కనుక ప్రతిరైతు తప్పక ఒక పశువును పోషించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

- పతికి