శతాబ్దాలుగా సాగుతున్న మతమార్పిడులకు అడ్డుకట్ట వేయాలి

 
డిశంబరు 11వ తేదీనాడు దేశంలోని అన్ని ప్రముఖపత్రికలలో ఆగ్రాలో 60 ముస్లిం కుటుంబాలు తమ పూర్వధర్మమైన హిందూధర్మంలోకి వచ్చిన విషయం ప్రముఖంగా చోటుచేసుకొన్నది. హిందూసంస్థలు ముస్లింలను, క్రైస్తవులను మతం మారుస్తున్నారంటూ ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏదోక పత్రికలో ఖండనో, వ్యాసమో వస్తూనే ఉన్నది. పార్లమెంటు ఉభయసభలను ఈ అంశము కుదిపేసింది. ప్రపంచంలో అనేకదేశాల పత్రికలలో కూడా ఈ వార్త చోటుచేసుకోవడం గమనార్హం. 
 
ఈ అంశాన్ని రాజకీయదృష్టికోణంతో చూస్తూ అనేక వ్యాసాలు వచ్చాయి. రాజకీయ వాతావరణము కూడా వేడెక్కింది. ఇది సామాజిక సమస్య. దీనిని సామాజిక కోణంలోనే చూడాలి. ఆ కోణంనుండి ప్రక్కకు తప్పించి దీనిపై చర్చలు సాగిస్తున్నారు. ఈ దేశంలో వందల సంవత్సరాల నుండి మతంమార్పిడులు బలవంతంగా ప్రలోభాలతో కొనసాగిస్తున్నది ముస్లింలు, క్రైస్తవులు. ఇస్లాం, క్రైస్తవాలు కేవలం భారత్ లోనే కాదు, ప్రపంచంలో అనేకదేశాలలో మతమార్పిడులు చేసారు, చేస్తున్నారు. అనేక సమస్యలకు కారణమవుతున్నారు. ప్రపంచాన్ని ఇస్లామీకరణ చేసి ఇస్లామిక్ సామ్రాజ్యం ఏర్పాటు చేయాలనేది ముస్లింల లక్ష్యం. క్రైస్తవీకరణ చేయాలనేది క్రైస్తవుల లక్ష్యం. ఈ విషయంలో వీరిద్దరూ పరస్పరం పోటీపడుతూ పనిచేసుకొంటూ వస్తున్నారు. 
 
ఒక సంవత్సరం క్రితం దక్కన్ క్రానికల్ పత్రికలో "ది కలర్ ఎబ్యూజ్" పేరుతో ఒక వ్యాసం వచ్చింది. అందులో పాకిస్తాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన ముస్లిం యువకులు ఇంగ్లాండు దేశానికి చెందిన ఆడపిల్లలను ఎట్లా లోబరచుకుంటున్నారు, ఎట్లా మతం మారుస్తున్నారు, ఎట్లా ఉపయోగించుకొని వదిలేస్తున్నారనే అంశంపై చాలా విషయాలు ప్రముఖంగా వచ్చాయి. ఆ విషయం ఇంగ్లాండు పార్లమెంటును కూడా కుదిపేసింది. ఇంగ్లాండులోనే కాదు, ఫ్రాన్స్ మొదలుకొని ఐరోపా ఖండంలోని అనేక దేశాలలో ఇస్లామీకరణ జరుగుతోంది. ఈ రోజున అమెరికాలో కూడా ముస్లింలు గణనీయంగా పెరిగారు. భారతదేశంలో స్వాతంత్ర్యపోరాటం జరుగుతున్న రోజులలో ఒకప్రక్క హిందువులు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తుంటే, మరోప్రక్క ముస్లింలు దేశాన్ని ముక్కలు చేసేందుకు మతంమార్పిడులు చేసారు. చరిత్ర చదివితే ఈ విషయం అర్థమవుతుంది. దేశం నుండి విడిపోయిన భూభాగాలను ఎట్లా ఇస్లామీకరణ చేసారో వర్తమాన చరిత్ర తెలుపుతున్నది. 
 
ఇస్లాం మాత్రమేకాదు, క్రైస్తవం కూడా గడిచిన రెండువందల సంవత్సరాలకు పైగా దేశవ్యాప్తంగా మతంమార్పిడులు ఎట్లా చేస్తున్నారో క్రైస్తవీకరణ ఎట్లా చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఈశాన్య రాష్ట్రాలను, అందులో నాగాల్యాండును చూడాలి. మధ్యప్రదేశ్ లో గిరిజన ప్రాంతాలలో జరిగిన మతంమార్పిడులపై ఆందోళన చెంది దాని వివరాలు సేకరించేందుకు నియోగి కమిషన్ ను వేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ఈ రెండు మతాల కార్యకలాపాలు దేశప్రజలలో ఆగ్రహం, ఆందోళన కలిగిస్తున్నవి. కాంగ్రెసు ప్రభుత్వం ఓట్ బ్యాంకు రాజకీయాల కోసం ఆ శక్తులకు ఎలా చేయూతనిచ్చిందో గడచిన 20-25 సంవత్సరాల కాంగ్రెసు పాలన చూస్తే మనకు అర్థమవుతుంది. దేశంలో ఒకప్రక్క క్రైస్తవీకరణ, మరోప్రక్క ఇస్లామీకరణ ప్రయత్నాలు దశాబ్దాలుగా సాగుతూంటే ఈ దేశంలో రాజకీయ నాయకులు ఖండించడం కాని, ఆందోళన వ్యక్తం చేయడం కాని చేయలేదు. పైగా ఆ శక్తులకు చేయూతనిచ్చారు. ఎక్కడో ఆగ్రాలో తిరిగి తమ స్వంతమతంలోకి 60 కుటుంబాలు వస్తే దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా గగ్గోలు పెడుతున్నారు. దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలి. 
 
అసలు మతంమార్పిడుల వల్ల ఏంనష్టం జరుగుతున్నదో ఒకసారి తెలుసుకోవాలి. మతం మారితే పేరు మారుతుంది, శ్రద్ధాకేంద్రం మారుతుంది, తమ పూర్వీకుల పరంపర నుండి దూరం జరుగుతారు, జాతీయత మారిపోతోంది. అందుకే స్వామి వివేకానంద అన్నారు -"ఒక వ్యక్తి మతం మారితే కేవలం హిందువుల సంఖ్య ఒక్కటే తగ్గటం కాదు, ఒక శ్రతువు పెరుగుతున్నాడు" అని హెచ్చరించారు. ఈ హెచ్చరిక చాలు, మతంమార్పిడి ఎంత ప్రమాదకరమో తెలుసుకొనేందుకు. దేశంలో మతఘర్షణలు, వేర్పాటువాదాలకు దారితీస్తున్నది కూడా వాళ్ళ జనాభా ఎక్కువ ఉన్నచోటే. ఇలా ఏ కోణం నుండి చూసినా దేశంలో అనేక సమస్యలకు కారణమవుతున్నాయి ఈ మతమార్పిడులు. అందుకే ఈ మధ్యనే నారాయణరావ్ అనే ఒక ప్రముఖ కాంగ్రెసు నాయకుని కొడుకు నీలేష్ రావ్ పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ "హిందూధర్మంలోకి ఎక్కువమంది తిరిగివస్తే దేశంలో మతకలహాలు తగ్గుతాయని" వ్యాఖ్యానించారు. అట్లాగే ఫస్ట్ పోస్ట్ అనే పత్రికలో వచ్చిన ఒక వ్యాసంలో "అమెరికా మొదలైన దేశాల నుండి ఈ దేశంలో అనేక ఎన్.జి.ఓ. (నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్) లకు విపరీతమైన డబ్బులు వస్తున్నాయి. ఆ ఎన్.జి.ఓ.లు ఆ డబ్బులను మతంమార్పిడులకు ఉపయోగిస్తున్నారు. క్రైస్తవం అనేక ఎన్.జి.ఓ.ల పేర్లతో పనిచేస్తూ విపరీతంగా మతంమార్పిడులకు పాల్పడుతున్నది. అట్లా హిందూసంస్థలకు డబ్బులు ఏమీ రావటం లేదు" అని వ్రాశారు. ఈ విధంగా వ్రాసుకొంటూ పోతే చాలా విషయాలుంటాయి. 
 
ఇక్కడ ఆలోచించవలసిన అంశం ఒకటి ఉంది. ఎవరైనా క్రైస్తవుడు కావచ్చు, ముస్లిం కావచ్చు, తాము తిరిగి తమ మాతృధర్మంలోకి వస్తానంటే తప్పకుండా ఆహ్వానించాలి. చరిత్రలో హిందూసమాజం చేసిన ఒక చారిత్రక తప్పిదం ఏమిటంటే ముస్లింలుగా మతంమారినవారు తిరిగి తమ మాతృధర్మంలోకి వస్తానంటే ససేమిరా అన్న కారణంగా అనేక సమస్యలు మనసమాజం ఎదుర్కొన్నది. స్వామి దయానంద సరస్వతి, వీరసావర్కర్ ఆ రోజుల్లో శుద్ధి కార్యక్రమం పేరుతో పునరాగమన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ విధంగా వచ్చేవారిని సాదరంగా ఆహ్వానించి హిందూసమాజంలో కలపాలి. అట్లా ఈ చర్చకు అనేకమంది ప్రముఖులు ఇంకొక విషయాన్ని ప్రతిపాదించారు. దేశంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు బలవంతపు మతంమార్పిడులను నిరోధించే బిల్ ప్రవేశపెట్టాలని కోరాయి. మతం మార్పిడులను నిరోధించేబిల్ ప్రవేశపెట్టాలని చాలా సంవత్సరాల నుండి చాలామంది అడుగుతూనే ఉన్నారు. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలు ప్రభుత్వాలను ఆ పని చేయనీయటం లేదు. 
 
ఇప్పటి పరిస్థితుల్లో ఆ బిల్ ను తీసుకొని రావాలంటే కొన్నిపార్టీలు వ్యతిరేకించాయి. ముఖ్యంగా దేశంలో ప్రముఖ క్రైస్తవ సంస్థలు అటువంటి బిల్ తీసుకురావటాన్ని వ్యతిరేకించారు. తమ పని యథేచ్ఛగా కొనసాగించేందుకు ఆ బిల్ అడ్డంకి కాబట్టి అది రాకూడదు. క్రైస్తవులుగా మారిన హిందువులను తిరిగి హిందువులుగా మార్చకూడదు. ఏ కోణం నుండి చూసినా తమ ప్రయోజనాలకు భంగం కలగకూడదు అనేది క్రైస్తవుల ఆలోచన. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సరసంఘచాలక్ ఈ విషయంపై స్పందిస్తూ "తిరిగి తమ మాతృధర్మంలోకి వచ్చేవారిని సాదరంగా ఆహ్వానిస్తాం, దానిపై ఎటువంటి వేరే ఆలోచన లేదు, బలవంతపు మతమార్పిడులను నిరోధిస్తూ బిల్ ఒకవేళ ప్రవేశపెడితే మేము స్వాగతిస్తాం" అని చెప్పారు. హిందూసమాజం జాగృతమై శతాబ్దాలుగా సాగుతున్న ఈ మతమార్పిడులకు ఎక్కడో ఒకచోట అడ్డుకట్ట వేయాలి. తిరిగి మాతృధర్మంలోకి వస్తామనేవారిని సాదరంగా ఆహ్వానించి, వారికి పూర్తి భద్రత, విశ్వాసం కల్పించాలి. ఇస్లాం, క్రైస్తవం నుండి ఎదురవుతున్న సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొనేశక్తి హిందూసమాజంలో జాగృతం కావాలి. ఈ దేశంలో సామాజిక సమరసత, దేశభద్రతకు ఎదురయ్యే ఎటువంటి సవాలునైనా ఎదుర్కోవాలి. ఈనాటి అవసరం ఇదే. దీనిని ప్రతి హిందువు ఆలోచించాలి. 
 
- రాము