సెల్ ఫోన్ వినియోగదారులారా... తస్మాత్ జాగ్రత్త !

 
సాధారణ సెల్ ఫోన్ వినియోగదారులకు ఈ విషయం అతి స్వల్పంగానే అనిపించవచ్చు. కానీ జాతి భద్రత, వ్యక్తిగత సమాచార చౌర్యం దృష్ట్యా లోతుగా ఆలోచిస్తే ఈ విషయం చాలా తీవ్రమైన 'సైబర్ నేరము'.
 
 
సెల్ ఫోన్ 'సిమ్ కార్డు'ల తయారీలో ప్రపంచంలోనే అగ్రగణ్యమైన సంస్థ నెదర్లాండ్స్ కు చెందిన 'గెమాల్టో'. ఈ సంస్థ వివిధ దేశాలలోని ఎయిర్ టెల్, ఐడియా లాంటి 450 మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లకు సంవత్సరానికి 200 కోట్ల సిమ్ కార్డులను సరఫరా చేస్తుంది. అనేక డెబిట్ కార్డులలోనూ, క్రెడిట్ కార్డులలోనూ వీటినే ఉపయోగిస్తారు. సిమ్ కార్డుల తయారీలో సమాచార భద్రతకు ఉపయోగించే 'ఎన్ స్క్రిప్షన్-కీ' వివరంగా చెప్పాలంటే ఇది ఒక రహస్యమైన కోడ్ లాంటిది. ఇది తయారీదారులకు మాత్రమే తెలిసి ఉంటుంది. కాని 2009-10 సంవత్సరాల మధ్యలో అమెరికా, బ్రిటన్ కు చెందిన నిఘా సంస్థలు చట్టవిరుద్ధంగా అడ్డదారిలో ఈ రహస్య సమాచారాన్ని రాబట్టుకున్నాయి. దీనివల్ల ప్రపంచంలోని అనేక దేశాల భద్రత, ప్రముఖుల, దేశాధిపతుల రహస్య సమాచారం కూడా ఈ నిఘా విభాగాల వారు వినే అవకాశం ఉంది.
 
అంతర్జాతీయ మానవహక్కుల గురించి (యు.ఎన్.ఓ.) ఐక్యరాజ్యసమితి, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి వేదికల మీద నుండి ఇతర దేశాలకు నీతులు వల్లించే ఈ అగ్రరాజ్యాలు 'సిమ్ కార్డు' రహస్యకోడ్ సమాచారాన్ని సేకరించడం ప్రపంచంలోనే అతి పెద్ద సైబర్ నేరం. ఈ విషయం గురించి ఏ దేశాలు అగ్రదేశాలకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. ప్రపంచదేశాలన్నీ ఈ విషయ తీవ్రతను గుర్తించి అగ్రరాజ్యాల పెత్తనాన్ని నిరోధించాలి.

- పతికి