కోరితే భగవంతుడు వస్తాడా?

వివేక సూర్యోదయం - ధారావాహికం - 8

http://2.bp.blogspot.com/-9I5Dav5PfyQ/TwxBzvqyS6I/AAAAAAAAAYM/97mWZ2Dzes0/s200/Vivekasuryodayam.jpg

భగవంతుడి కంటే ఎక్కువైంది ఏముంది? భగవంతుడే మనిషి ముందున్న సర్వోత్కృష్ట లక్ష్యం. ఆయన్ని చూడాలి. ఆనందం అనుభూతి చెందాలి. భార్య భర్తను ప్రేమించానంటుంది, కాని భర్త మరణించగానే అతని బ్యాంకు ఖాతా గురించి ఆలోచిస్తుంది. భర్త భార్యని ప్రేమించానంటాడు, కాని భార్య అనారోగ్యం పాలయినా, అందం కోల్పోయినా, ఆమె గూర్చి ఆలోచించడం మానేస్తాడు. ఇదంతా నటన అని తేలిపోతుంది. భార్య భర్తను ప్రేమిస్తున్నానంటుంది. కాని ఒక బిడ్డ పుట్టగానే ఆ ప్రేమలో సగం జారిపోతుంది. కనుక మరింత ప్రేమించగలిగిన వస్తువు మన దగ్గరికి వచ్చిన కొద్దీ పూర్వపు ప్రేమ అంతరించి పోతుంది.

పిల్లలు తమతో కలిసి చదువుకునే మిత్రులు తమకు బాగా ప్రియమైన వారనుకుంటారు. కాని వాళ్లకు పెళ్ళయితే, పూర్వమున్న భావన మటుమాయమవుతుంది. కొత్త ప్రేమ ప్రముఖమవుతుంది. జీవితం యొక్క అంతం క్రూరమైనదని, వినాశకర మైనదని భావించడం వ్యక్తిని వినాశనం వైపు నడిపిస్తుంది. వాసనలకు బానిస అయితే వ్యక్తి మనోస్థాయి పెరగదు. దీనికంటే మరేదో ఉంది అని, ఎదగడం వైపు ఆలోచించడమే జీవితం.

భౌతికవాదం నుంచి ఆధ్యాత్మికత వైపు నిదానంగా అడుగులు వేయాలి. 'అడుగు, నీకది లభిస్తుంది; కోరు, నీకది దొరుకుతుంది; కొట్టు, తలుపులు తెరచుకుంటాయి', కాని అడిగేదెవరు? కోరేదెవరు? మనందరం మాకు భగవంతుడు తెలుసు అంటాం. ఒకతను దేవుడు లేడని, ఒకడు ఉన్నాడని రుజువు చేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకోసం రుజువు చేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకోసం పుస్తకాలు రాస్తారు. ఆ అవసరమేముంది? భగవంతుడుంటే ఏమి, లేకపోతే ఏమి? చాలామంది యంత్రంలా పని చేస్తుంటారు. కాని మృత్యువు తరుముకు వచ్చినపుడు, "నాకు కొంత సమయం కావాలని తాపత్రయపడతారు, తన కొడుకు ఎదుగుదల చూసి వస్తానంటాడు. కాని మృత్యువు ఆగదు కదా! కొందరు జీవితంలో జరిగే సంఘటనలను బట్టి 'భగవంతుడి' తత్త్వం తెలుసుకొంటారు. భక్తి ఒక మతం. మోకాళ్ళ మీద నిలబడడం, వంగి నమస్కరించడం ఇవన్నీ కొందరికి భక్తి అనిపిస్తాయేమో ! కాని అది నిజమైన భక్తి కాదు.  


మనకు భగవంతుడు తప్ప అన్నీ కావాలి. మన భౌతికావసరాలన్నీ ఈ బయటి ప్రపంచం నుండి లభిస్తున్నాయి. మన అవసరాలు దీనికి మించినవైతేనే మనకు భగవంతుడు గుర్తొస్తాడు. భగవంతుడు 'కోరితే' వస్తాడు. కోరిక బలంగా ఉండాలి. భౌతిక జగత్తులో ఏది లేకపోతే మనం బతకలేమని భావిస్తామో అది భగవంతుడి గూర్చిన ఆలోచనలోనూ జరగాలి. మనకేం కావాలో మనకు తెలియాలి. మనకు భగవంతుడు కావాలా? పుస్తకాలు, శాస్త్రాలు దీన్ని నేర్పవు.  

ఆంగ్లంలో ఒక సామెత ఉంది. "వేటాడితే పులిని వేటాడాలి, దొంగిలిస్తే రాజుగారి ఖజానా దొంగిలించాలి, కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి" అని. అడుక్కునే వాళ్ళను దొంగిలిస్తేనో, చీమలను వేటాడితేనో ఉపయోగమేముంది? కనుక ప్రేమిస్తే భగవంతుడ్నే ప్రేమించాలి. భగవంతుడు మన అవసరాలు తీర్చే మాధ్యమం కాదు. మన అవసరాల కోసం భగవంతుడ్ని ప్రేమించడం కన్నా నాస్తికుడిగా మిగిలిపోవడమే మేలు.

- హనుమత్ ప్రసాద్