హిందూధర్మంలోకి తిరిగివచ్చేవారికి ఆత్మీయ స్వాగతం

భాగ్యనగర్ హిందూశక్తి సంగమంలో ప్రసంగించిన శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియా

వేదికపై ఆసీనులైన శ్రీ మాడుగుల నాగఫణి శర్మ, శ్రీ కమలానంద భారతి స్వామి, శ్రీ చినజీయర్ స్వామి. ప్రసంగిస్తున్న శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియా

మతంమారిన హిందువులు తిరిగి తమ మాతృధర్మంలోకి రావాలనుకున్నట్లయితే వారికి హిందువులు ఆత్మీయ స్వాగతం పలకాలని, అటువంటి వారికి పూర్థి భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా హిందూసమాజంపై ఉన్నదని విశ్వహిందూపరిషత్ అంతర్జాతీయ కార్యాధ్యక్షులు శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియా పేర్కొన్నారు.  

విశ్వహిందూపరిషత్ స్వర్ణోత్సవాల సందర్భంగా భాగ్యనగర్ లోని ఎన్.టి.ఆర్.స్టేడియంలో భాగ్యనగర్ హిందూశక్తిసంగమం నిర్వహించబడింది. హనుమాన్ చాలీసా కోటిపారాయణ యజ్ఞం ముగింపు కార్యక్రమంలో శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియా ప్రసంగించారు. శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియా ఇంకా మాట్లాడుతూ -హిందూధర్మాన్ని రక్షించే బాధ్యతను ప్రతి హిందువూ తీసుకోవాలని, హిందూరాష స్థాపనే అందరిలక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లతోపాటుగా భారత్ లోనూ హిందువుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేసారు. దీనిపై ప్రతిహిందువు జాగ్రత్తపడాల్సిన అవసరముందని అన్నారు. పాకిస్తాన్ లోని రావల్పిండిపై మన జాతీయపతాకను ఎగురవేసి అఖండభారతం నిర్మించిననాడే విశ్వహిందూపరిషత్ కి అసలైన ఉత్సవాలని అన్నారు. హిందూసమాజం గురించి శాసనవ్యవస్థ ఈ దేశంలో రావాలని నొక్కిచెప్పారు. 'హిందువుగా ఉండటమే కాదు, హిందూధర్మాన్ని పరిరక్షిస్తాను' అని కార్యక్రమానికి వచ్చిన అందరితో ప్రతిజ్ఞ చేయించారు.  

గోవధను అడ్డుకోవడానికి ప్రతిఒక్కరూ కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలోని అందరికీ ఒకేచట్టం వర్తించేలా కామన్ సివిల్ కోడ్ రావాలని కోరారు. నలుగురు భార్యల పద్ధతి పోవాలని అన్నారు.

ప్రతి హిందువు హృదయం అయోధ్యలో రామమందిరం నిర్మించాలని చెబుతున్నదని అన్నారు. హిందువుల డబ్బులతో క్రైస్తవులను, జెరూసలేంకు ముస్లింలను మక్కాకు ప్రతి సంవత్సరం పంపే మన ప్రభుత్వాలు హిందువులను కనీసం తిరుపతికి ఒక్కసారైనా పంపాయా? అని ప్రశ్నించారు. ఉర్దూ అకాడమీకి 3 కోట్లు ఇచ్చి, తెలుగు అకాడమీకి కేవలం 30 లక్షలు ఇస్తుందా? అని ప్రశ్నించారు. నిజాం పాలనను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ప్రతి హిందువు ఒక సర్దార్ పటేల్ గా మారతాడని హెచ్చరించారు. హిందువులంతా ఒక్కటిగా ఉంటే అందరికీ రక్షణగా ఉంటుందని ఆయన అన్నారు.  

ప్రతి హిందువుకు విద్య, వైద్య సౌకర్యాలు అందాలని, భారత్ అన్నిరంగాల్లో అగ్రస్థానంలో నిలవాలని శ్రీ తొగాడియా పిలుపునిచ్చారు. 

ఇప్పటివరకు ఉచిత విద్యను అందిస్తున్న విశ్వహిందూపరిషత్ ఇకనుండి ఉచితవైద్యాన్ని కూడా అందించే ప్రయత్నం చేస్తున్నదని, ఇందుకోసం 18602333666 టోల్ ఫ్రీ నంబరును అందరికీ అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.  

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామీజీ మాట్లాడుతూ 'హిందువులు ఒక వైదికవృక్షం లాంటివారని, విశ్వహిందూపరిషత్ హిందువుల తరపున ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న గొప్ప సంస్థ అని, వైదికవృక్షానికి వచ్చిన అందరిచేతా చిన్నజీయర్ స్వామి వేదమంత్రపఠనం చేయించారు.  

విశ్వహిందూపరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామరాజుగారు మాట్లాడుతూ -గోరక్షణ, మతమార్పిడిల నిరోధన, మఠమందిరాల పరిరక్షణ, హిందూధర్మ పరిరక్షణ, హిందూదేశ పునర్నిర్మాణం తదితర ఐదు అంశాలతో తీసుకున్న సంకల్పంతో నేడిక్కడ హిందూశక్తి సంగమం జరుపుకుంటున్నట్లు వివరించారు. రానున్న అరెనెలల్లో ప్రతి హిందువు నేత్ర, రక్తదానానికి, గోరక్షణకు సిద్ధం కావడానికి సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి హిందువు దేవతా వృక్షాలైన మర్రి, మామిడి, మేడి, రావి, జువ్వి, ఉసిరి, మారేడు, తులసి వంటి మొక్కలను నాటాలని సూచించారు. రానున్న ఉగాదినుండి శ్రీరామనవమి వరకు ప్రతిగ్రామం, బస్తీలో శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని' పిలుపునిచ్చారు.

అత్యంత వైభవంగా జరిగిన హిందూశక్తిసంగమం కార్యక్రమంలో వేలాదిమంది హిందువులు పాల్గొన్నారు. ప్రతిఒక్కరూ హనుమాన్ చాలీసా పారాయణం చేసిన చీటీలను హుండీలో సమర్పించారు. ఇవన్నీ అయోధ్యకు చేర్చబడతాయి. కార్యక్రమం ప్రారంభంలో సభాప్రాంగణంలో ఏర్పాటు చేయబడిన భారీ హనుమాన్ విగ్రహానికి పూజ చేయబడింది.  

ఈ కార్యక్రమంలో ఇంకా హంపీ విరూపాక్ష పీఠాధిపతి విద్యారణ్యభారతి స్వామి, హిందూదేవాలయాల ప్రతిష్ఠాపన పీఠం నుండి శ్రీ కమలానంద భారతి స్వామి, మంత్రాలయం మఠాధిపతి శ్రీ సుబుదేంద్రతీర్థ స్వామి, సత్యపదానందస్వామి, ఇంకా అనేకమంది ఇతర సాధుసంతులు పాల్గొన్నారు. ప్రముఖ జ్యోతిష్కులు శ్రీ మాడుగుల నాగఫణిశర్మ పాల్గొన్నారు. విశ్వహిందూపరిషత్ అంతర్జాతీయ నేతలు శ్రీ చంపత్ రాయ్, దినేష్ చంద్రజీ, శ్రీ రాఘవులు పాల్గొన్నారు. రాష్ట్ర వి.హెచ్.పి. స్వర్ణజయంతి కమిటీ చైర్మన్ శ్రీ టి. హనుమాన్ చౌదరి, కేంద్రమంత్రి శ్రీ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర బిజెపి నాయకులు, జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ కమిటి చైర్మన్ శ్రీ కర్నె శ్రీశైలం తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు.

దేశవ్యాప్తంగా వెల్లివిరుస్తున్న హిందూచైతన్యం
ఆర్.ఎస్.ఎస్. సర్ కార్యవాహ శ్రీ భయ్యాజీ జోషి

ఆర్.ఎస్.ఎస్. సర్ కార్యవాహ శ్రీ భయ్యాజీ జోషి

భాగ్యనగర్ హిందూశక్తిసంగమంలో పాల్గొన్న ఆర్.ఎస్.ఎస్. సర్ కార్యవాహ శ్రీ భయ్యాజీ జోషి మాట్లాడుతూ - హిందూచైతన్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందని, దేశవ్యాప్తంగా అనేకచోట్ల నిర్వహిస్తున్న సమ్మేళనాలలో, వివిధ ఇతర కార్యక్రమాలలోను ఇది చాలా ప్రస్ఫుటమవుతున్నదని అన్నారు. జాగరూకత, సంస్కృతిని అర్థం చేసుకోవడం, నిర్వాహక బాధ్యత తీసుకోవడం, హిందువుగా భాగస్వామ్యం కావడం ముఖ్యమని అన్నారు. అంతర్జాతీయంగా వస్తున్న సవాళ్ళను, లోపాలను సరిదిద్దడంలో హిందువులు తమశక్తిని గుర్తించాలని, పరిష్కారాలను చూపాలని అన్నారు. దేశంలో తీవ్రవాదం, చొరబాట్లు, విచ్ఛిన్నకర ఉద్యమాలు తీవ్రమయ్యాయని, దీనివల్ల దేశంలో శాంతి నడుస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశరు. వివిధ సంస్థలుగా ఉన్న అన్ని హిందూసంస్థలు కలిసి ఒక్కటై హిందూసమాజ సంఘటనకు కృషిచేయాల"ని పిలుపునిచ్చారు.