ఆదివాసీల వెలుగురేఖ : అన్నా కుజార్

ఓ యువతీ మేలుకో...! 


మహిళ ఓ శక్తి. ఆమె తలచుకుంటే భావి భవితను మార్చగలదు
మహిళా... మార్పు నీతోనే మొదలు...
'కొండలలో నెలకొన్న గుండెలలో కొలువుంటూ...
నరుడే నారాయణుడని తలచి సేవ చేయాలి' 

అని అన్నారు స్వామి వివేకానంద.
ఆమెకు ఈ నీతివాక్యాలు తెలుసో లేదో తెలియదు కానీ... 

అచ్చంగా అలాంటి పనే చేస్తోంది...
ఆదివాసీల బ్రతుకుల్లో వెలుగురేఖలా నిలుస్తోంది.
జానెడు భూమిలేని ఆ గిరిజనులకు

అటవీభూమి పట్టాలు ఇప్పించింది.
అక్రమంగా కలప తరలించకుండా... 

అడవితల్లిని, గిరిజన సంస్కృతిని కాపాడుతోంది...  

'అన్నా కుజార్' ఒక మహిళ. పుట్టింది ఒరిస్సాలోని సుందర్ నగర్ జిల్లాలోని సునజోర్ గ్రామం. ఈ జిల్లా అంతా అటవీప్రాంతమే. దాదాపు 50 శాతం ఆదివాసీలే. అక్కడ దొరికే కలప, సుగంధ ద్రవ్యాలను దగ్గరలో జరిగే సంతలో అమ్ముకొని తమ జీవనాన్ని కొనసాగిస్తుంటారు అక్కడి ఆదివాసీలు. అప్పుడప్పుడూ ఏమీ దొరకక పస్తులున్న కుటుంబాలెన్నో. అన్నా కుజార్ బాల్యంలో ఇలాంటి అనుభవాలు కోకొల్లలు. భూమికోసం అడుగుదామన్నా ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి. అప్పటినుంచీ తనకు ఒకటే ఆలోచన. ఆదివాసీలకు, అక్కడి సంస్కృతికి అన్యాయం జరగకుండా చూడాలి. పెళ్లై ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా అదే ఆలోచన. అన్నా భర్త పచ్చి తాగుబోతు. ఆ ఆలోచనే తనను గ్రామం దాటి బయటకు వెళ్లేలా చేసింది. అక్కడ చదువుకున్న వారినీ, మహిళా సంఘాలను కలిసి మాట్లాడింది. గిరిజనుల కోసం జరుగుతున్న సదస్సుల్లో పాల్గొంటుంటే డబ్బులు పాడుచేస్తున్నావంటూ తన భర్త రోజూ నానాహింసలు పెట్టేవాడు. ఒకరోజు అతన్ని కూడా సదస్సుకు తీసుకెళ్ళింది. అక్కడ అన్నాకు ఉన్న గుర్తింపు చూసి భర్త కూడా తనకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. ఇలా తన ఓర్పు, ప్రవర్తనతో భర్తను తనకు అనుకూలంగా మార్చుకుంది ఈ వనిత. 

అంతేకాదు, తను విన్న ప్రసంగాలను క్రమంగా గ్రామంలోని ప్రజలకు బోధించడం ప్రారంభించింది. క్రమంగా వారిని చైతన్యవంతులను చేసి గిరిజన సభలకు, సమావేశాలకు తీసుకెళ్ళింది. అటవీ అధికారులకు తమ గ్రామాల దుస్థితిని చెప్పి, వారు కనుక వ్యవసాయం చేస్తే వారి పరిస్థితి మెరుగవుతుందని సలహాకూడా చెప్పింది. ఇలా రెండువందల మంది ఆదివాసీలకు భూమి పట్టాలు ఇప్పించింది. అన్యాయంగా, అక్రమంగా తరలిస్తున్న కలపను పట్టుకొని అధికారులకు అప్పగించింది. అక్రమార్జన చేసే అధికారులను తొలగించేలా ఉద్యమాన్ని చేపట్టింది. అక్కడ కలపను ఎవరూ దొంగిలించకుండా ఎవరి ప్రాంతం వారు వాళ్ళ కలపను జాగ్రత్తగా కాపాడుకొనేలా పక్కా ప్రణాళిక తయారుచేసి అమలు పరుస్తోంది. ఇప్పటికీ రోజూ ఇరవై ఐదు కిలోమీటర్ల వరకూ నడిచి గ్రామాలన్నీ సందర్శించి వారి సమస్యలను తెలుసుకునే కృషి చేస్తోంది. 'అందరికీ చదువు, వైద్యం అందితేనే తన లక్ష్యం పూర్తయినట్లు' అంటోంది అన్నా.  

"పితా, పుత్ర, భ్రాతృంశ్చ, భర్తా రమేవం
సుమార్గం ప్రతిప్రే రయంతీ విహ'  

అని నిత్యం సేవికా సమితి ప్రార్థనలో చదువుతూనే ఉంటాం. దానర్థం ఒక స్త్రీ కనుక జ్ఞానవంతురాలైతే తండ్రిని, అన్నలను, భర్తను, కొడుకులను, సమాజాన్నీ మంచిమార్గంలో నడిపిస్తుంది అని. తనకు ఉన్న ఒకే ఒక్క ఆలోచనతో, తన ప్రవర్తనతో తాను జ్ఞానవంతురాలు కావడమే కాదు, అటు భర్తను, సమాజాన్ని కూడా మార్చేసింది అన్నా. అక్షరం ముక్కకూడా రాదు ఆమెకు. కానీ తను అవలంబించిన పనితీరు మహిళలందరికీ ఆదర్శనీయం. 

మహిళ ఓ శక్తి. ఆమె తలచుకుంటే భావిభవితను మార్చగలదు. ఈ మహిళా దినోత్సవం నాడు మనం కూడా ఓ మంచి ప్రణాళికతో ముందుకు అడుగేద్దాం. సమాజహితాన్ని కోరుకొని నవ్య సమాజాన్ని నిర్మిద్దాం.

- లతా కమలం