పరమాత్మ సృష్టి అంతటిలో వ్యాపించి ఉన్నాడనే సత్యాన్ని మన పెద్దలు ఏనాడో చెప్పారు

పరమ పూజనీయ శ్రీ కె.ఎస్.సుదర్శన్ జీ

ఈ సృష్టిలో, జడచేతన అన్నింటిలో పరబ్రహ్మ పరమాత్మ ఉన్నాడు.  ఈ విషయాన్ని మన భారతదేశంలో ఋషులు, మునులు అనుభవంతో చెప్పారు. ఉదాహరణకు రామకృష్ణ పరమహంస వివేకానందుని గురువు. ఆయన ఒకరోజు తన శిష్యులకు పాఠం చెబుతున్నాడు. చెబుతూ చెబుతూనే ఒక్కసారి "నేను త్రొక్కబడుతున్నాను, నన్ను కాపాడండి" అని అరవటం ప్రారంభించారు. అది చూసిన శిష్యులకు ఇదేమీ అర్థం కాలేదు. వైద్యులను పిలిచారు. వైద్యులు పరీక్షించి ఏమీ కాలేదని చెప్పారు. రామకృష్ణ పరమహంస కొద్దిసేపటి తరువాత మామూలు స్థితికి వచ్చారు. రామకృష్ణ పరమహంస తన శిష్యులతో ఈ విధంగా చెప్పారు. "నేను బయటకు చూసినప్పుడు ఎదురుగా గడ్డి కనిపించింది. ఆ గడ్డి, నేను ఒకటే అనుకొన్నాను; అంతలోనే ఒక ఆవు ఆ గడ్డిని త్రొక్కుతూ నడుస్తున్నది; అది నా ఛాతీపై నుండి నడిచినట్లు అయింది. బాధ కలిగింది. చూడండి నా ఛాతిపై ఆవు గిట్టల గుర్తులు" అని చూపించారు.

దీని ఆధారంగా ప్రకృతితో - అంటే చేతన, జడపదార్థాలతో కూడా ఎట్లా తాదాత్మ్యం చెందవచ్చో మనం తెలుసుకోవచ్చు. పరబ్రహ్మ పరమాత్మ ఈ సృష్టి అంతటిలో వ్యాపించి ఉన్నాడు అనేది సత్యం. ప్రత్యక్ష అనుభూతితో ఈ విషయాలను మన పెద్దలు చెప్పారు.