అసత్య ఆరోపణలతో దేశ గౌరవానికి మచ్చ తెస్తున్న కాంగ్రెస్

కలియుగాబ్ది 5114 , శ్రీ నందన నామ సంవత్సరం, పుష్య మాసం

2009 జూలైలో భారత్ లోని అమెరికా రాయబారి తిమోరీ రోమెర్ తో రాహుల్ గాంధీ మాట్లాడుతూ లష్కర్ - ఏ - తోయిబా ఉగ్రవాదులకంటే బి.జె.పి., రాష్ట్రీయ స్వయంసేవక సంఘము ప్రమాదకరమైన సంస్థలని చెప్పినట్లు వికీలీక్స్ ద్వారా గతంలో వెల్లడైన విషయాలు మనందరికీ తెలుసు. గాంధీజీ హత్యకు సంఘానికి ఏమీ సంబంధం లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పటికీ సంఘం గాంధీజీని హత్య చేసినట్లు పదే పదే ఆరోపించటం కాంగ్రెస్ కు అలవాటై పోయింది. దేశంలో ఎక్కడ, ఏ చిన్న మత ఘర్షణలు జరిగినా దానిలో సంఘం హస్తమున్నదని మాట్లాడటం చూస్తూనే ఉన్నాము. దేశంలో ఉన్న మైనార్టీలకు సంఘం నుండి ప్రమాదం ఉన్నదని, ఆ ప్రమాదం నుండి వారిని కాపాడేది తామేనని పదే పదే చెప్పేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తూ ఉంటుంది. దీని నుండి రెండు ప్రయోజనాలను కాంగ్రెస్ ఆశిస్తున్నది. అవి 1) తాను కోల్పోయిన ముస్లిం మైనార్టీల ఓట్ బ్యాంకులను తిరిగి సాధించుకోవటం, 2) సహజంగా శాంతిప్రియులైన హిందూ సమాజాన్ని తప్పుదారి పట్టించి తమ పబ్బం గడుపుకోవడం. ఈ రకమైన దుష్ప్రచారం వల్ల ఇప్పటికే దేశం ఎంతో మూల్యం చెల్లించుకొంది. తమ ప్రాభవం ప్రమాదంలో పడుతున్నదనే సంకేతాలు అందినప్పుడల్లా ఇటువంటి విషయాలను బయటకు తేవడం కాంగ్రెస్ కు అలవాటు. 
 
ఇదే దిశలోఈ మధ్య తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ పార్లమెంటు ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్న కాంగ్రెస్, అర్జెంటుగా రెండు పనులు చేసింది. 1) జైపూర్ లో చింతనా శిబిరం ఏర్పాటు చేయడం, 2) కాంగ్రెస్ లో ద్వితీయ స్థానాన్ని రాహుల్ కు కట్టబెట్టడం. మొదటి స్థానంలో సోనియా, రెండవ స్థానంలో రాహుల్. ఈ ఇరువురే కాంగ్రెస్ ను గట్టెక్కించగలరని భజంత్రీలు వినిపిస్తున్న వేళ అత్యుత్సాహంగా సాక్షాత్ గృహమంత్రి సుశీల్ కుమార్ షిండే నోట ఆర్.ఎస్.ఎస్., బి.జె.పి.లు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ శిక్షణ కూడా ఇస్తున్నాయనే ఆరోపణలు వచ్చాయి. బింద్రన్ వాలే వంటి వారిని ఎవరు పెంచి పోషించారో షిండే అప్పుడే మరచిపోయినట్టున్నారు. భారతదేశ మత కలహాల చరిత్రలో తన పాపం ఎంతో కాంగ్రెస్ కు తెలుసు. రాజకీయ ప్రయోజనాల కోసం పరస్పర ఆరోపణలు చేసుకోవటం వేరు. కాని షిండే చేసిన ఇటువంటి వ్యాఖ్యలు దేశ గౌరవానికి మచ్చ తెస్తాయి. 
 
షిండే వంటి వ్యక్తులు చేస్తున్న ఈ ఆరోపణలు విని ఉగ్రవాదులు సంబరపడిపోతున్నారు. ఇప్పటికే దేశంలోని అనేకమంది పెద్దలు షిండే వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇటువంటి అసత్య ఆరోపణలతో దేశ గౌరవాన్ని విదేశాలలో తాకట్టు పెట్టినట్లయింది. ఉగ్రవాదుల చేతికి మంచి ఆయుధాలు సమకూర్చినట్లయింది. భారత్ ను ఒక ఉగ్రవాద దేశంగా ఆరోపించేందుకు పాకిస్థాన్ వంటి దేశాలకు ఆవకాశమిచ్చినట్లయింది.