నేపాల్ లో మావోయిస్టుల అకృత్యాలు


నేపాల్ లో మావోయిస్టులు పెట్రేగిపోతున్నారు. ఇంతకాలం ప్రభుత్వ కార్యాలయాలు, సైన్యం లక్ష్యంగా దాడులు చేసిన వామపక్ష తీవ్రవాదులు ఇప్పుడు పాఠశాలలపై  పడ్డారు. స్కూళ్ళపై దాడులు చేస్తూ భయాందోళనలు సృష్టిస్తున్నారు. విద్యా వ్యవస్థలోని కొన్ని లోపాలను సాకుగా చూపి, వారు ఈ దాడులకు తెగబడుతున్నారు. అంతేకాదు... ప్రైవేటు యాజమాన్యాల్లో నడిచే స్కూళ్ళపై వీరు చేస్తున్న దాదాగిరి అంతా ఇంతా కాదు. ఏకంగా విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సులపైనే దాడులు చేస్తూ భీభత్సం సృష్టిస్తున్నారు. కొన్ని స్కూళ్ళ పేర్లను మార్చాలని హుకుం జారీ చేశారు. తాము డిసైడ్ చేసిన ఫీజుల్ని మాత్రమే వసూలు చేయాలని లేకపోతే స్కూళ్ళనే కూల్చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీనిపై ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. బిబిసి కూడా స్కూళ్ళపై నేపాల్ మావోయిస్టులు జరుపుతున్న దాడులపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. 

తమది ప్రజా హక్కుల పోరాటమంటూ పూనకం వచ్చే నినాదాలు చేసే మావోయిస్టులు, వారి దాష్టీకాలకు తమ వక్ర మేధో బుద్ధితో వంత పాడే పౌర హక్కుల నేతలు దీనిపై ఏమి మాట్లాడటమే లేదు. విద్య ప్రతి విద్యార్థి హక్కు. విద్యార్థులు చదువుకోకుండా వారి స్కూళ్ళను బాంబులతో పేల్చివేయడం ఎంతవరకు న్యాయం? నేపాల్ నిరుపేద విద్యార్థులను విద్యకు దూరం చేయడం కాదా? ఇది వారి విద్యా హక్కు మీద దాడి కాదా? ఇది మన మావోయిస్టులకు, వారికి వంతపాడే వామపక్ష జర్నలిస్టు మేధావులకు కనిపించడం లేదా? గతంలో నేపాల్ రాజధాని ఖాట్మండులో ఓ.సురేంద్ర పోయాల్ అనే ఆల్ నేపాల్ నేషనల్ ఇండిపెండెంట్ స్టూడెంట్ యూనియన్ కు చెందిన (మావోయిస్టు స్టూడెంట్ వింగ్) ఓ కార్యకర్తను పోలీసులు పట్టుకుని విచారించే లోపే మావోయిస్టులు అతన్ని విడిపించుకుపోయారు. 

గత ఎనిమిదేళ్లుగా నేపాల్ లో మావోయిస్టులే ప్రత్యక్షంగా, పరోక్షంగా అధికారం చెలాయిస్తున్నారు. ఈ 8 ఏళ్లల్లో నేపాల్ లో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. దేశంలో అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఘోరంగా విఫలమయ్యారు. కాలం చెల్లిన మావోయిజం నేపాల్ లో ఇంప్లిమెంట్ చేయడం సాధ్యం కాదని తెలిసినా శుష్క నినాదాలతో అమాయక ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారు. మావోయిస్టులపై ప్రజల్లోనూ భ్రమలు ఒక్కొక్కటిగా తొలగి పోతుండటంతో నేపాలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ హింసా వాదుల పాలనకంటే నేపాల్ హిందూ రాజరిక పాలనే మంచిదని అభిప్రాయం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

- నారద