మాతృభాష కారాదు మృతభాష

 
"Language is a medium of Communication" అన్నది ఒక ఆంగ్లపదబంధం. కాని ఆశ్చర్యంగా ఈ పదబంధాన్ని ఎక్కువ ఉపయోగించేది మాత్రం తెలుగువారు. "తెలుగు మాట్లాడవలసిన అవసరం లేదు, ఒకవేళ మాట్లాడినా అది శుద్ధంగా ఉండవలసిన అవసరం ఏమాత్రం లేదు" అన్నది తెలుగువారి నిశ్చితాభిప్రాయం. 
 
హరిప్రీత్ సింగ్
 
డిశంబరు 20వ తేదీ శనివారంనాడు "ఈ-అక్షరత" కార్యక్రమం ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన హరిప్రీత్ సింగ్ ఐ.టి.శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పై కార్యక్రమంలో ఆయన తెలుగులో మాట్లాడగా స్థానికులైన ఇతర ఐ.ఎ.ఎస్. అధికారులు ఆంగ్లంలో మాట్లాడారు. అదిచూసి హరిప్రీత్ సింగ్ వారిని ఉద్దేశించి "అయ్యా ! తెలుగులో మాట్లాడండి" అని సూచించారు. తెలుగు చలనచిత్ర కథానాయికలైన ఛార్మి (పంజాబి), రకుల్ ప్రీత్ సింగ్ (హింది) లు చక్కటి తెలుగులో మాట్లాడుతూండగా స్థానికురాలు, "సహజ నటి"గా పేరు తెచ్చుకున్న ఒక తెలుగునటి వచ్చీరాని ఆంగ్లంలో తడుముకుంటూ మాట్లాడుతూ "అయామ్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, ఐ డోంట్ నో టెల్గూ" అని చెప్పడం సిగ్గుచేటు. మాతృభాషను కాపాడుకుందాం.
 
- ధర్మపాలుడు