సామాజికరంగాన్ని కొత్త పుంతలు త్రొక్కించిన సుదర్శన్ జీ


హిందూ సమాజంలోని అన్ని మతాలూ, సాంప్రదాయాల మధ్య సారూప్యతను గుర్తు చేస్తూ అందరం దేశ హితం కోసం ఎట్లా పని చేయాలో సూచించిన వారు శ్రీ సుదర్శన్ జీ. ఇస్లాం, క్రైస్తవం మత పెద్దలతో కూడా చర్చించి మత సామరస్యం కోసం కృషి చేశారు. పూజ్య శ్రీ గురూజీ తరువాత అంతగా విశేష అధ్యయనం చేసినవారు శ్రీ సుదర్శన్ జీ అని మాననీయ శేషాద్రిజీ చెబుతూ ఉండేవారు. అపారమైన విషయ పరిజ్ఞానం వారి సొత్తు. అటువంటి అధ్యయన శీలి 58 సంవత్సరాలు ప్రచారక్ జీవనం గడిపి సెప్టెంబర్ 15న (2012) ఇహలోకాన్ని వదలి పెట్టారు. సెప్టెంబర్ 16న నాగపూర్ లో జరిగిన అంత్యక్రియలలో వేలాది మంది స్వయంసేవకులు, వారి ఆలోచనలతో ప్రభావితులైన వివిధ మతాల, సాంప్రదాయాలకు చెందిన ప్రముఖులు అశ్రునయనాలతో వారికి వీడ్కోలు పలికారు.

సుదర్శన్ జీ పూర్వీకులు కర్నాటక ప్రాంతానికి చెందిన కుప్పనహళ్లి గ్రామానికి చెందినవారు. వారి తండ్రి గారు రాయ్ పూర్ లో ప్రభుత్వ ఉద్యోగం చేసారు. ఇది యాదృచ్చికమో లేక వారి నిర్ణయమో తెలియదు కాని శ్రీ సుదర్శన్ జీ 1931 జూన్ 18న రాయ్ పూర్ లో జన్మించారు. 2012 సెప్టెంబర్ 15న అదే రాయ్ పూర్ లో తుదిశ్వాస విడిచారు.

9 సంవత్సరాల వయస్సులో సంఘంలో చేరి తన 23వ ఏట ప్రచారక్ జీవనం ప్రారంభించారు. ప్రచారక్ గా అనేక బాధ్యతలు నిర్వహిస్తూ 2000 సంవత్సరములో సంఘంలో అత్యున్నత బాధ్యత అయిన సర్ సంఘచాలక్ గా పూజ్య రజ్జూభయ్యా
జీచే నియుక్తి చేయబడ్డారు. 9 సంవత్సరాల పాటు (2000-2009 వరకు) ఆ బాధ్యతలో పనిచేస్తూ 2009 మార్చిలో జరిగిన ప్రతినిధి సభలో ఆ బాధ్యతను శ్రీ మోహన్ భాగవత్ కు అప్పగించి ఒక సాధారణ స్వయంసేవక్ గా శేష జీవితాన్ని గడిపారు.

అనేక సంస్థలలో, వ్యవస్థలలో పనిచేసే వారిలో సాధారణంగా ఎక్కువ మంది ఇతరులు చేపట్టిన పనులను కొనసాగించే వారు కనబడతారు. సంఘంలో మాత్రం సంఘం యొక్క మౌలిక కార్యాన్ని కొనసాగిస్తూ సంఘ పనిలో కొత్తపుంతలు త్రొక్కించిన వారు ఎక్కువగా కనబడతారు. అందులోనూ పూజ్య సర్ సంఘచాలక్ బాధ్యతలో పని చేసిన వారు ఎవరికి వారు తమ విశేష ప్రయత్నంతో సమాజాన్ని ప్రభావితం చేసిన వారే. పూజ్య సుదర్శన్ జీ శాఖలో గంట సేపు తీసుకొనే కార్యక్రమాలలో మార్పులకు శ్రీకారం చుట్టారు. పరంపరాగతమైన నియుద్ధ విద్యను అనేకమంది గురువుల దగ్గర సాధన చేసి, దానిని సరళీకరణ చేసి శాఖలో ప్రవేశపెట్టారు. ఈ రోజున శాఖలలో జరిగే శారీరక్, బౌద్ధిక్ కార్యక్రమాలపై వారి ముద్ర మనకు స్పష్టంగా కనబడుతుంది.


దేశ సమస్యల పరిష్కారానికి చేసిన కృషి :

పంజాబులో ఖలిస్తాన్ ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న సమయంలో స్వయంసేవకులకు, హిందూ సమాజానికి స్పష్టమైన దిశాదర్శనం చేసినవారు శ్రీ సుదర్శన్ జీ. పంజాబులోని సిక్ఖు సాంప్రదాయం హిందూ ధర్మ రక్షణకు ఏర్పాటు చేయబడింది. సిక్ఖుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథసాహెబ్ లో హిందూ ధర్మానికి సంబంధించిన విషయాలు, ఈ సమాజంలో జన్మించిన మహా పురుషుల పేర్లు ఒకవేళ తొలగేస్తే చివరకు ఆ గ్రంథం యొక్క అట్ట కూడా మిగలదు అని వివరించారు. ఈ దేశంలో ఉన్న మనందరి పరంపర ఒకటేనని స్పష్టం చేసారు. ప్రారంభంలో విమర్శలకు గురియైనా చివరకు ఆ సత్యాన్ని అక్కడి ప్రజలు గుర్తించారు.  ఖలిస్తాన్ ఉద్యమం బలహీనమయ్యింది. సుదర్శన్ జీ అస్సాం క్షేత్ర ప్రచారక్ గా పని చేస్తున్న రోజులలో అక్కడి పరిస్థితులను విశేష అధ్యయనం చేశారు. బంగ్లాదేశ్ నుండి వస్తున్న అక్రమ ముస్లిం వలసలపై హెచ్చరించారు. అస్సాంలో రాబోవు రోజులలో తలెత్తబోయే విపరీత పరిణామాలను అందరి దృష్టికి తీసుకొని వచ్చారు. 1981లో అస్సాంలోని విశ్వవిద్యాలయ విద్యార్థులు బంగ్లాదేశ్ ముస్లింల అక్రమ వలసలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఉద్యమానికి తోడ్పాటునందించారు. ఆ సమస్యను దేశ ప్రజలందరి దృష్టికి తెచ్చారు.

సైద్ధాంతిక ఘర్షణలలో స్వయంసేవకులను సరిగా నిలబెట్టటానికి కృషి :

ప్రపంచంలో ఈ రోజున చెలరేగుతున్న అనేక సమస్యలకు ఇస్లాం, క్రైస్తవం, కమ్యూనిజం ఎట్లా కారణం, ప్రపంచ శాంతికి, ప్రపంచ కల్యాణానికి హిందుత్వ ఆలోచనలు ఎట్లా దోహదపడతాయో వివరించేవారు. ఆయా సిద్ధాంతాల మౌలిక విషయాలలోని అస్పష్టతను స్వయంసేవకులకు వివరించేవారు. హిందుత్వం విశ్వజనీనమైనదని పదే పదే వివరించేవారు. భాగ్యనగర్ లో జరిగిన ద్వితీయవర్ష సంఘ శిక్షావర్గలో ఒకసారి రెండు కాలాంశాలలో ఈ విషయాన్ని వివరించారు. దానిని శిక్షావర్గ పూర్తి అయ్యేలోగా తెలుగులో అనువాదం చేసి పుస్తకం అందరికి ఇవ్వబడింది. ఈ రోజుకీ ఆ పుస్తకం ఒక దిశా దర్శనం.

ఈ రోజున ప్రపంచం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం వెంపర్లాడుతున్నది. ఆ దిశలో ఈ దేశంలో కృషి చేస్తున్న అనేకమంది ప్రముఖులను వ్యక్తిగతంగా కలిసి వారి కృషిని అందరి దృష్టికి తేవటమే కాకుండా ఈ దిశలో జరగవలసిన ప్రయత్నాలు వివరించేవారు. సమాజంలో మేధావి వర్గంతో సామాజిక నేతృత్వంలో స్వయంసేవకులు సంబంధాలు  ఏర్పాటు చేసుకోవాలని ప్రోత్సహించారు. దేశంలో గ్రామాల దుర్భర పరిస్థితులను చూసి గ్రామం స్వయంసమృద్ధికి చేయవలసిన ప్రయత్నాల గురించి, గో ఆధారిత వ్యవసాయం గురించి స్వయంసేవకులకు సమాజానికి ఎప్పటికప్పుడు తెలియజేసేవారు. ఈ విధంగా పూజ్య సుదర్శన్ జీ భారతమాత సేవలో తన జీవితాన్ని ధన్యం చేసుకొన్నారు. వారు ప్రారంభించిన పనులను కొనసాగించటమే వారికి సమర్పించే నిజమైన శ్రద్ధాంజలి.