భారత్ ముంగిట అమెరికా అధినేత

 
గత సెప్టెంబరులో ప్రధానమంత్రి నరేంద్రమోది అమెరికా పర్యటన అమెరికాతో మనదేశం మళ్ళీ సత్సంబంధాలు కొనసాగించేందుకు ఊతమిచ్చింది. వీసా సైతం నిరాకరించిన అమెరికా, మోదీ ప్రధాని అయిన తరువాత ఆయన్ను జనమానస నేతగా గుర్తించింది. సాదర ఆహ్వానం పలికింది. గతంలో యుపిఎ ప్రభుత్వ సమయంలో అమెరికాతో మనదేశం నెరపిన సంబంధాలు సంకీర్ణ ప్రభుత్వం పరిమితుల పేరున మొక్కుబడిగానే సాగాయి. యుపిఎ-1 హయాంలో కాంగ్రెసుతో చెలిమికట్టిన కమ్యూనిస్టులు సహజంగానే అమెరికాను వ్యతిరేకించేవారై ఉండడంతో అణుఒప్పందం పేరున మద్దతు ఉపసంహరించడంతో, అనేక విషయాలపై సంబంధాలు కొనసాగించడంలో అవాంతరాలేర్పడ్డాయి. 282 మంది పార్లమెంటు సభ్యుల మద్ధతుతో పూర్తి మెజారిటీతో ఏర్పడిన ప్రభుత్వం కావడంతో ప్రజాస్వామ్య భారతం విలువ అమెరికాకు తెలిసొచ్చింది. తమ వాణిజ్య వ్యాపారాలకు 30% భారత్ లో అనుకూల వాతావరణం ఉండడంతో మళ్ళీ భారత్ తో స్నేహం అమెరికాకు అనివార్యమైంది. మోదీని పనిచేసే మనిషిగా ఒబామా గుర్తించారు. మోదీ కూడా అందివచ్చిన అవకాశాన్ని విస్తృతంగా ఉపయోగించుకోవాలనుకున్నారు. జనవరి 26, 2015 గణతంత్రదినోత్సవ సంబరానికి రమ్మని ఆహ్వానించగానే ఒబామా ఒప్పుకోవటం, అదే విధంగా పటాలంతో తరలిరావడం చకచకా జరిగిపోయాయి. ఈమధ్యకాలంలో మోదీ యు.ఎన్.ఓ.లో ప్రతిపాదించిన 'యోగ దినోత్సవం' విషయంపై యు.ఎన్.ఓ. ఆమోదం తెలిపి జూన్ 21 ని ప్రపంచ యోగదినోత్సవంగా ప్రకటించటం భారత్ మాటకు ప్రపంచదేశాలు విలువనిచ్చిన తీరును తెలియచేస్తున్నాయి. భారత్ కు వచ్చిన అగ్రనేతకు ప్రోటోకాల్ ను ప్రక్కన పెట్టి మోదీ స్వయంగా ఢిల్లీ పాలం విమానాశ్రయంలో స్వాగతం పలకడం, హైద్రాబాద్ హౌస్ లో ఇద్దరూ ఏకాంతంగా రెండుగంటలపాటు చాయ్ తాగుతూ చర్చించుకోవడం ఇవన్నీ చూస్తే వారిద్దరూ ఇద్దరు దేశాధినేతలుగా కాకుండా, చిరకాల మిత్రులవలె అందరికి అనిపించింది. వ్యవస్థాపరంగా చేయలేని నిర్ణయం, తన విశేషాధికారాలను ఉపయోగించి ఒబామా అణుఒప్పందం విషయంలో చేయడం, అణుఒప్పంద అమలును ముందుకు తీసుకెళ్ళాలని ఇరుదేశాలు ప్రకటించడం వాణిజ్యపరంగా ఒక ముందడుగు అనుకోవచ్చు. రక్షణావసరాలలో భారత్ కు మరో పదేళ్లపాటు సహకరించేందుకు అమెరికా అంగీకరించడం, 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను భారత్ లో పెట్టేందుకు అమెరికా అంగీకరించడం, స్మార్ట్ నగరాల అభివృద్ధి, భారత్ లో సౌరశక్తిని 2019 వరకు లక్ష మెగావాట్లకు పెంచేందుకు సహకారం వంటివన్నీ అభివృద్ధి దిశగా దేశం నడిచేందుకు సహకరించే విషయాలవుతున్నాయి.  
 
 
ఒక మహిళ (శ్రీమతి పూజ ఠాకుర్, ఢిల్లీలో ఎయిర్ ఫోర్స్ ప్రజాసంబంధాల విభాగంలో కార్యనిర్వహణాధికారి) భారత సాయుధ దళాల సారథిగా ఒబామాకు గౌరవవందనం ఇవ్వడం చరిత్ర సృష్టించే విషయమైంది. తమ ప్రభుత్వం మహిళా సాధికారతకు కట్టుబడి ఉందని మోదీ చెప్పకనే చెప్పినట్లయింది. గణతంత్రదినోత్సవ వేళ, వర్షం పడుతున్నప్పటికి రెండుగంటల పాటు రాజ్ పథ్ లో సాగిన పెరేడ్ ను ఒబామా చాలా ఓపిగ్గా వీక్షించడం, దేశ సాంస్కృతిక వైవిధ్యం, సైనికపాటవం, సాధించిన విజయాలు, ప్రభుత్వ పథకాలను గురించి ప్రక్కనే కూర్చుని మోదీ వివరించడం, సైనిక విన్యాసాలకు, సంగీతానికి ఆసక్తిగా స్పందించడం, తలూపడం చూస్తే భారత్ ఇచ్చిన స్వాగతానికి, గౌరవానికి ఒబామా ముగ్ధుడయ్యారనిపిస్తోంది. తీవ్రవాదం విషయంలో పాకిస్తాన్ పై అమెరికా స్వరం పెంచింది. చివరకు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్ కు గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు చెప్పాడు. చివరిరోజు ఢిల్లీలోని సిరిఫోర్డు ఆడిటోరియంలో సాగిన ఒబామా ప్రసంగం, సెప్టెంబరులో అమెరికా మాడిసన్ స్క్వేర్ లో మోదీ చేసిన ప్రసంగంలా సాగింది. భారతీయుల మనసు దోచుకొనేందుకు ఒబామా ప్రయత్నించారు. భార్య మిషెల్లీతో కలిసి అందరి ముందుకు వెళ్ళి కరచాలనం చేశారు. భారతీయుల ప్రజ్ఞను, ప్రతిభను ప్రస్తుతించారు. నిజానికి అమెరికా నుండి ఎక్కువమంది విద్యార్థులు భారత్ కు రావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. తాను, తన భార్య కూడా మోదీలాగా అట్టడుగుస్థాయి నుండి వచ్చినవారమని అమెరికాలో జాతివివక్షను ఎదుర్కొన్న చేదు అనుభవాలు తనకుకూడా ఉన్నాయని అన్నారు. రాజకీయాలకంటే, సామాజిక అంశాలనే చర్చించారు. ఒబామా భార్య మిషెల్లీ కోట్ల సంపాదనను వదులుకుని పిల్లల బాగోగులు చూసుకొనేందుకు ఇంటిపట్టున ఉండి గృహిణిగా జీవనం సాగించడం ఆదర్శవంతమైన విషయమని భారతీయ మహిళలకు మొదటిసారి తెలిసివచ్చింది.  
 
 
రేడియోలో ఇద్దరూ కలిసి చేసిన 'మన్ కీ బాత్' శ్రోతలను కట్టిపడేసింది. తన అధ్యక్ష పదవి అనంతరం ప్రజారోగ్యం గురించి పనిచేస్తానని ఒబామా చెప్పారు. ఒబామా తన పర్యటనలో భారత్ గురించి ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నారని చెప్పవచ్చు. మోదీ ఆయనకు 'స్వామి వివేకానంద' పుస్తకం బహూకరించారు. ఆయన వివేకానందుడి ఆదర్శం గురించి స్మరించారు. గాంధీజీని, భారత స్వాతంత్ర్యోద్యమాన్ని తలచుకున్నారు. 'నమస్తే ఇండియా' అన్నారు. ఒబామా భారత్ పర్యటన రాబోయే కాలంలో భారత్ కు మేలు చేస్తుందనే అందరూ అనుకుంటున్నారు. 
 
- హనుమత్ ప్రసాద్