గంగశుద్ధికి కేంద్రం భగీరథ ప్రయత్నం

 
నాడు గంగను భూమిమీదకు తీసుకురావడానికి భగీరథుడు ప్రయత్నించాడు. గంగానది జీవనది. పాడిపంటలనందిస్తున్న గంగ, దేశంలోని నాలుగు రాష్ట్రాల ఆర్థిక స్థితికి దోహదపడుతున్న గంగానది నేడు కలుషితమైంది. కాశిదర్శనం, గంగాస్నానం భారతీయులందరికి ముఖ్యమైనవి. కేంద్రంలో కొత్తగా ఏర్పడిన మోదీ ప్రభుత్వం గంగశుద్ధికి నడుం బిగించింది. 11 రాష్ట్రాలలోని 40% జనాభాకు గంగనుంచే నీరు లభ్యమవుతున్నది.

1986లో మొదటిసారిగా నాటి ప్రధాని రాజీవ్ గాంధీ గంగాయాక్షన్ ప్లాన్ ను ప్రారంభించారు. ఇందుకోసం 20వేల కోట్ల రూపాయలు వెచ్చించారు. కాని ప్రభుత్వంలో చిత్తశుద్ధి లోపించిన కారణంగా గంగశుద్ధి యోజన మూలనబడింది. మార్చి 2000లో దీనిని ప్రభుత్వం పూర్తిగా విరమించుకుంది. పర్యావరణవేత్తలు, శాస్త్రజ్ఞుల వేదన అరణ్యరోదనే అయింది. శ్రీ సుందర్ లాల్ బహుగుణ వంటివారు ఇందులో ఉన్నారు. 2004లో కేంద్రప్రభుత్వ పగ్గాలు చేపట్టిన యూపిఎ ప్రభుత్వం గంగశుద్ధికి మతం రంగు పులిమి పక్కన పెట్టింది. గంగ మహాసభ జాతీయ కార్యదర్శి ఆచార్య జితేంద్ర 2008లో ఉత్తరాఖండ్ ప్రభుత్వంపై తెచ్చిన వత్తిడి కారణంగా గంగపై జలవిద్యుత్ కేంద్రాల స్థాపనను ఆ ప్రభుత్వం నిలిపివేసింది. 2011లో హిందూ సన్యాసి స్వామి నిగమానంద సరస్వతి హరిద్వార్ జిల్లాలో సాగుతున్న అక్రమమైనింగు వల్ల గంగ కలుషితమౌతున్నదని, దాన్ని ఆపాలని ఆమరణ దీక్ష చేసి ప్రాణాలర్పించారు. ఆయన మరణానంతరం ఉత్తరాఖండ్ ప్రభుత్వం అక్రమ మైనింగును నిషేధిస్తూ ఉత్తర్వులిచ్చింది. 2012లో గంగముక్తి సంగ్రామ సమితి గంగా రథయాత్రలను చేపట్టి ప్రయాగ, కాన్పూర్, మధుర, బృందావన్ ల మీదుగా 6 నెలలపాటు నిర్వహించింది.  ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

గంగలో 5000 పాళ్ళు (వంద మి.లీ.) ఉండే బ్యాక్టీరియా ఇపుడు 5800 పాళ్ళకు చేరింది. అందుకే మోదీ ప్రభుత్వం వెంటనే గంగశుద్ధి ప్రాజెక్టును చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పరచింది. 'క్లీన్ గంగా ఫండ్' ను కూడా ఏర్పరచింది. ప్రజలు, స్వచ్చంద సంస్థలు, ఎన్.ఆర్.ఐ.ల నుండి విరాళాలను స్వకరించే పనికి శ్రీకారం చుట్టింది. ఇది కేంద్రం ప్రకటించిన 'నమామి గంగే' పథకానికి అదనం. ఇది ఆర్థికమంత్రి అధ్యక్షులుగా ఉండే ట్రస్టు క్రింద పనిచేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 'నమామి గంగే' పథకానికి 2037 కోట్లు కేటాయించారు. గంగశుద్ధిపై టి.వి., రేడియోలలో అవగాహన కార్యక్రమాలను ప్రసారం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గంగశుద్ధి పథకం అమలుకు నిపుణులతో కూడిన ఒక కమిటీని కూడా ప్రభుత్వం నియమించనుంది. ఈ కమిటీ ఈ పథకం అమలును నిరంతరం పర్యవేక్షిస్తుంది. 
 
- హనుమత్ ప్రసాద్