కేన్సర్ నూ జయించవచ్చు

డా.నోరి దత్తాత్రేయుడుగారు
 
మధుమేహం (డయాబెటిక్) అధికరక్తపోటు (బిపి) లాగే కేన్సర్ ను కూడా నియంత్రణలో ఉంచడం ద్వారా జీవితకాలాన్ని పొడిగించుకోవచ్చు. దీనికి సంబంధించిన మందులు భారత్ లో కూడా మార్కెట్ లో అందుబాటులోకి వచ్చాయి. అమెరికాలో ప్రముఖ కేన్సర్ వైద్యులు, ప్రవాస ఆంధ్రుడైన డా.నోరి దత్తాత్రేయుడుగారు భారత ప్రభుత్వం నుండి 'పద్మశ్రీ' బిరుదును పొందిన తరువాత మొట్టమొదటి భారత సందర్శనలో, ఇటీవల హైదరాబాద్ బంజారాహిల్స్ లోని విస్టా ఇమేజెస్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కేన్సర్ ను ఆధునిక సాంకేతిక పరీక్షల ద్వారా ప్రాథమిక స్థాయిలోనే గుర్తించే పరికరాలు ఇప్పుడు భారత్ లో కూడా అందుబాటులోకి వచ్చాయని తెలియచేశారు. కేన్సర్ పేషంట్లు ముఖ్యంగా మానసికంగా "కేన్సర్ వల్ల చనిపోతామనే భయాందోళనల నుండి రోగులు ముందుగా బయటకు రావాలి" అని సూచించారు. 
 
కేన్సర్ 4వ దశలో ఉన్నవారు కూడా ఈ మందులను వాడడం ద్వారా వ్యాధిని నియంత్రణలో ఉంచుకుంటూ 10 ఏళ్ళు జీవిత కాలాన్ని పొడిగించుకునే అవకాశం ఉంది. భారత్ లో ముఖ్యంగా స్త్రీలలో రొమ్ము మరియు గర్భాశయ ముఖద్వార (సెర్విక్) కేన్సర్ బారిన ఎక్కువగా పడుతున్నారు. ఇతరత్రా రోగనిర్ధారణకు, చికిత్సలకు ఆసుపత్రులకు వెళ్ళిన స్త్రీలు రొమ్ము సెర్విక్ కేన్సర్ పరీక్షలను కూడా చేయించుకోవడం ద్వారా ప్రాథమిక దశలోనే కేన్సర్ ను గుర్తించి చికిత్స ప్రారంభించడం ద్వారా కేన్సర్ నుండి విముక్తి పొందే అవకాశము ఉందని వారు సూచించారు. మద్రాసులోని అడయారు కేన్సర్ ఆసుపత్రిలో బీదలకు ఉచిత కేన్సర్ చికిత్స చేస్తున్నట్లుగా వివిధ సోషల్ నెట్ వర్క్స్ ద్వారా తెలుస్తున్నది.

- పతికి