అఫ్జల్ గురు కాశ్మీరీ బ్రాహ్మణుడా?!

అఫ్జల్ గురు
అఫ్జల్ ఖాన్ ఒక మతోన్మాది, ఒక దేశద్రోహి. ఈ పేరు చెబితే ఎవ్వరూ గుర్తుపట్టరు. కాని! అఫ్జల్ గురు అంటే అందరికీ తెలుస్తుంది. డిసెంబర్ 13, 2001 నాడు పార్లమెంటుపై జరిగిన దాడికి ఇతడు కీలక సూత్రధారి. పదకొండు సంవత్సరాల పాటు తిహార్ జైలులో సర్వసుఖాలు పొందిన (రాజభవనంలో ఉన్నట్లే) ఇతడిని 2013 ఫిబ్రవరి 9 నాడు ఉరి తీశారు. 2012 ఆగస్టులో ఈద్-ఎ-ముస్సల్మాన్ సందర్భంగా కాశ్మీరులో హురియత్ కాన్ఫరెన్స్ గా పేరుబడ్డ ఒక తీవ్రవాద సంస్థ నాయకుడైన సయ్యద్-అలీ-షా-జిలానికి వ్రాసిన లేఖలో అఫ్జల్ గురు తన అంతరంగాన్ని ఈ విధంగా ఆవిష్కరించాడు. 
 
"కాశ్మీర్ సమస్య భారత-పాక్ లకు చెందిన సమస్య కాదు. అది ఒక అంతర్జాతీయ సమస్య. భారత ప్రభుత్వం కాశ్మీరీలను వేధిస్తున్నది. వారిని లేనిపోని కోర్టు సమస్యల సుడిగుండంలోకి నెట్టివేసింది. నేను ఆరు సంవత్సరాల చిరుప్రాయంలోనే ఖురాన్ నేర్చుకున్నాను., తఫ్ సీర్, జిహాద్-ఫిల్-ఇస్లాం రచయిత మౌలానా హౌదూదీ అంటే నాకెంతో అభిమానం. అయినా కూడా నేను నిన్న మొన్న జైలులోనే ఖురాన్ నేర్చుకున్నానని దుష్ప్రచారం చేస్తున్నారు. నేను తౌహీద్ (ఒకే దేవుడు) గట్టిగా నమ్ముతాను. భారతీయ పత్రికలు / ప్రచార మాధ్యమాలు ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా వ్యవహరిస్తున్నాయి. గూఢచార సంస్థలకి కొమ్ము కాస్తున్నాయి. నన్ను తీవ్రవాది అంటున్నారు. కాని ఎవరు తీవ్రవాది ? భారత సైన్యమే తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్నది. మన తల్లులు-బిడ్డల మాన ప్రాణాలను హరిస్తున్నది. అదంతా ఎందుకు? పార్లమెంటుపై దాడి ఎందుకు జరిగిందో ఎరుగుదువా? కాశ్మీరులో సంక్షోభం కారణంగానే దాడి జరిగింది. నన్ను గాని, నా వంటి ఇతరులను గాని ఉరి తీసినంత మాత్రాన ఇటువంటి బాంబు దాడులు ఆగవు" అంటూ ఇతడు సుదీర్ఘమైన లేఖ వ్రాశాడు. అందులో మతం, రాజకీయాలు, కాశ్మీరు సమస్య, భారత న్యాయవ్యవస్థ తదితర అంశాల గురించి వ్యాఖ్యానించాడు. "నేను చేస్తునన ఈ పోరాటం నా దేశం కోసం చేస్తున్న పోరాటం. మెడికల్ కాలేజీలో చదువుకు స్వస్తి చెప్పి JKLF (జమ్మూ కాశ్మీర్ విమోచన వేదిక)లో చేరాను. నేను చేసిన పనికి పశ్చాత్తాపం లేదు. ఉరి అంటే భయపడేది లేదు. నాకు మరణశిక్ష విధించారు. ఉరి తియ్యకుండా ఎందుకు ఉంచారు? నన్ను తిహార్ నుండి శ్రీనగర్ జైలుకు మార్చమని అడిగాను. కాని ప్రభుత్వం పట్టించుకోలేదు. క్షమాభిక్ష కోరటం నాకు ఇష్టం లేదు. నా శ్రేయోభిలాషులు / కుటుంబం వారు అనవసరంగా క్షమాభిక్ష కోరారు. నిజానికి రంజాన్ మాసంలో నేను అల్లాను ప్రార్థించాను, నన్ను వెంటనే ఉరి తియ్యాలని. మీకు తెలుసా? నేనూ, నా పూర్వీకులు బ్రాహ్మణులం. కాశ్మీరు భూమి పుత్రులం. మాకు స్వతంత్ర కాశ్మీరు కావాలి. భారత ఆక్రమణ సైన్యాలు తొలిగిపోవాలి"! 
 
ఇది ఆ లేఖ సారాంశం. ఇది చదివిన వారికి సహజంగానే కొన్ని సందేహాలు కలుగుతాయి. 
 
అఫ్జల్ గురు తనను తాన బ్రాహ్మణుడు అని చెప్పుకున్నాడు. అంటే అఫ్జల్ కాశ్మీరీ పండిట్ అన్నమాట. కాశ్మీరీ పండితులు భారతీయులు. వాస్తవానికి భారతదేశంలోని ముస్లిములు 99 శాతం మంది హిందూజాతి వారేనన్న విషయం ఇటీవలి విజ్ఞాన పరిశోధన (DNA Test) ద్వారా తేటతెల్లమైంది. అఫ్జల్ గురు తాను, తనవారతా కాశ్మీరు భూమి వారమని చెప్పాడు. మరి అటువంటప్పుడు స్వదేశాన్నుంచి స్వదేశాన్ని విముక్తి చేసే ప్రసక్తి రాకూడదు కదా! భారతదేశం మీద వీరు చేస్తున్న యుద్ధం ఎవరి మీద చేస్తున్నట్లు? ఈ తీవ్రవాద కార్యకలాపాలకు స్ఫూర్తి ఎక్కడి నుండి వస్తున్నది? చివరికి ఏమి సాధించాలని వీరి లక్ష్యం? ఇది యావద్భారతదేశాన్ని ఇస్లామీకరించే ప్రయత్నమా? ఇటువంటి వంకర ఆలోచనలు కలిగిన వారు కొందరు 1947లో దేశాన్ని విచ్ఛిన్నం చేశారు. పాకిస్తాన్ అనే ఒక కృత్రిమ దేశాన్ని సృష్టించారు. ఏమి సాధించారు? నిత్యం రక్తపాతమే! బహుశా! పాకిస్తాన్ లో కొందరు తమ తప్పు తెలుసుకున్నట్లు కనపడుతున్నది. ఉర్దూను ప్రక్కనపెట్టి పంజాబీ-సింధీ వంటి వారి మూల భాషలను తలకెత్తుకుంటున్నారు. 'పాకిస్తాన్ కు గొప్ప గతం ఉన్నది, ఘనమైన చరిత్ర ఉన్నది, పాణిని మా వాడే, హరప్పా-మొహంజదారో నాగరికతలు మావే" అని చెప్పుకుంటున్నారు. కాశ్మీరు ఆక్రమణకు విఫలయతనం చేసిన పాకిస్తాన్ ఎత్తుగడలలో పావులుగా మారిన కాశ్మీరీలు కాశ్మీర్ ను ఒక అంతర్జాతీయ సమస్యగా భావించి చేస్తున్న దేశద్రోహకర కార్యకలాపాలు చివరకు ఎటు దారితీస్తాయో? 
 
- ధర్మపాలుడు