రాజ్యాంగ సమీక్ష చేయాలి

కలియుగాబ్ది 5115 , శ్రీ జయ నామ సంవత్సరం, పుష్యమాసం

 
స్వతంత్రభారతదేశం తనదైన రాజ్యాంగాన్ని అమలుపరచుకొని వచ్చే జనవరి 26వ తేదీకి 65 సంవత్సరాలు పూర్తి చేసుకొని 66వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నది. ఈ 65 సంవత్సరాలలో దేశం అనేక సంక్షోభాలు ఎదుర్కొంది. అయినా నిలకడగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం పటిష్టమవుతూ వస్తున్నది. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో అప్పటి పరిస్థితులు, భావోద్వేగాలు, అంతకుపూర్వమే బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశం పాలనకోసం ఏర్పాటు చేసిన వ్యవస్థలు కొనసాగించటము అన్నీ కలగలిపి మన రాజ్యాంగం తయారైంది. 
 
రాజ్యాంగము భారతీయ సంస్కృతికి పూర్తి ప్రాతినిథ్యం వహించి ఈ దేశ ప్రజలను జాతీయ పౌరులుగా నిర్మాణం చేసేందుకు కావలసిన ప్రేరణను అందించాలి. ఆ విషయంలో అలాగే జరుగుతోందా. ఆలోచించాలి. 
 
1) రాజ్యాంగ నిర్మాణంలో తొలి అడుగే తప్పటడుగు పడింది. ఈ దేశాన్ని ఏ పేరుతో గుర్తించాలనే దానిపై చాలా పెద్ద చర్చ జరిగింది. ఆ చర్చ వేల సంవత్సరాలుగా ఈ దేశం ఒక జాతిగా విలసిల్లిన విషయాన్ని ప్రశ్నార్థకం చేసింది. మౌలికమైన ఈ ప్రశ్న మన జాతీయతను వివాదాస్పదం చేసింది. రాజ్యాంగంలో ఈ దేశం పేరు ఇండియా దటీజ్ భారత్ అని వ్రాసారు. వేల సంవత్సరాల నుండి ఇది భారత్. దానికి అదే పేరు ఉంచక, 'ఇండియా దటీజ్ భారత్' అని ఎందుకు వ్రాయవలసి వచ్చింది? కనీసం ఇప్పుడైనా ఆలోచించాలి. 
 
2) ప్రపంచంలో ఏ దేశంలోనైనా తమ దేశంలో బయటదేశాల నుండి వచ్చి అక్కడే జీవిస్తున్నవాళ్ళను అల్పసంఖ్యాకులుగా గుర్తిస్తారు. దానికి మతం ఆధారం కాదు. దేశం, జాతి ఆధారం. కాని మనదేశంలో మైనార్టీలుగా (అల్పసంఖ్యాకులుగా) ఎవరిని గుర్తించారు? ఈ దేశీయులను మతం ఆధారంగా మైనార్టీలు అన్నారు. ఇస్లాం, క్రైస్తవాలలోకి మతంమారిన వారిని మైనార్టీలుగా గుర్తించారు. వాళ్ళకు ప్రత్యేక సౌకర్యాలు, భద్రత మొదలైనవి కల్పించారు. దీని అర్థమేమిటి? ఇస్లాం మతస్థులు, క్రైస్తవ మతస్థులు బయట దేశాల నుండి ఇక్కడికి వచ్చారని చెప్పదలచుకొన్నారా? లేదా భవిష్యత్ లో తమ రాజకీయ అధికారం కోసం ఓట్ బ్యాంకులుగా మలచుకొనేందుకు చేసారా? ఈ విషయాన్ని ఆలోచించవలసిన అవసరం ఉంది. మైనార్టీలు అంటే ఎవరు అనేది స్పష్టం చేయవలసిన అవసరం ఉంది. 
 
3) 1976వ సంవత్సరంలో ఇందిరాగాంధీ రాజ్యాంగ సవరణ చేసి సెక్యులరిజం, సోషలిజం పదాలను రాజ్యాంగంలో చేర్చింది. అది ఈ రోజు ఎంతో వివాదాస్పదంగా మారింది. ఈ దేశ మౌలిక స్వభావం సర్వపంథసమభావన కాబట్టి రాజ్యాంగ రచన చేసిన పెద్దలు దానిగురించి ప్రత్యేకంగా చెప్పలేదు. ఈ దేశం స్వభావానికి భిన్నంగా "సెక్యులరిజం" అనే పదం రాజ్యాంగంలో చేర్చి మైనార్టీల సంరక్షణకు దానిని ఒక ఆయుధంగా మలచాలని భావించారు. అది వివాదాస్పదమైంది. అది కుహనా సెక్యులరిజం. దానిపై దేశమంతా పెద్ద ఎత్తున ఉద్యమించింది. అట్లాగే సోషలిజం అనేది కాలదోషం పట్టిన సిద్ధాంతం. 
 
ఇట్లా అనేక విషయాలపై వస్తున్న ప్రశ్నలకు సరియైన సమాధానం చెప్పి భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన పాలన చెయ్యాలి. రాజ్యాంగం స్పష్టంగా, స్ఫూర్తిదాయకంగా ఉండాలి. రాజ్యాంగం రచించి 65 సంవత్సరాలయింది కాబట్టి ఈ 65 సంవత్సరాల అనుభవాల ఆధారంగా మనభారత రాజ్యాంగాన్ని ఒకసారి సమీక్ష చేసి ఈ దేశానికి సరియైన దిశానిర్దేశనం చేయాలి. 
 
రాజ్యాంగము ముందుమాటలో మన వారసత్వసంపద గురించి వివరించింది. ఆ విషయాలను ప్రజలకు వివరించి ఒకజాతిగా మనం మన పూర్వీకులు అందించిన విలువలు కాపాడటానికి ప్రేరణ కలిగించాలి. ప్రపంచంలో భారతదేశాన్ని సమున్నతంగా నిలబెట్టాలి. స్వామి వివేకానంద చెప్పినట్లుగా ఈ దేశం విశ్వగురుత్వస్థానంలో ఉండి ప్రపంచ కళ్యాణానికై పనిచేయాలి. ఆ స్ఫూర్తిని మన రాజ్యాంగం మనకు అందించాలి.