గీతాశ్రవణం చేయడం ఉత్తమం

హితవచనం
 
విద్యప్రకాశానందగిరి స్వామి

విద్యప్రకాశానందగిరి స్వామి

యోగ:కర్మసు కౌశలమ్ - కర్మలందలి నేర్పరితనమే యోగమని గీత సెలవిచ్చెను. కావున గీతాశ్రవణముచేచెప్పులు కుట్టేవాడు ఇంకా బాగుగా చెప్పులు కుట్టగలడు. వర్తకుడు ఇంకను చక్కగా వర్తకము చేయగలడు (మోసం లేకుండా అని అర్థం). ఈ ప్రకారముగ భగవద్గీత భౌతిక, ఆధ్యాత్మికతను వ్యాపింపచేయవచ్చుననియు సోపపత్తిగ ఋజువుచేసి, ఆ రెండింటిమధ్యనున్న అఖాతమునకు ఒక చక్కటి సేతువును (వారధి) నిర్మించినది యాయెను. ఇదియే గీత యొక్క ఘనత.   

సామాన్యముగ మనుజుల యొక్క స్వభావము మూడు విధములుగ నుండును. కొందరి స్వభావము భక్తిరసాత్మకముగ నుండును, కొందరిది క్రియాశీలమై యుండును, మరికొందరిది విచారణాత్మకముగ నుండును. మొదటి తరగతివారు ఎక్కువగ పూజారాధనాదులందు, భజన కీర్తనాదులందు మక్కువ కలిగియుందురు. రెండవ తరగతివారు సేవాకైంకర్యములందు ప్రీతికలిగి ఉందురు. మూడవ తరగతివారు తమ ధీశక్తిని ఉపయోగించి ఎక్కువగ తత్వవిచారణ గావించుచు దానియందే అభిలాష గల్గియుందురు. స్థూలముగ పేర్కొనినచో వీనినే భక్తిమార్గమని, కర్మమార్గమని, జ్ఞానమార్గమని చెప్పవచ్చును. గీతయందు ఈ మూడు మార్గముల గూర్చి క్షుణ్ణముగ తెలిపియున్నారు. మోక్షప్రాప్తికి ఈ మూడు ఆవశ్యకములే యగును.