మన చరిత్రను తిరిగి వ్రాయాలి

సరస్వతీ నది

ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సు (PNS) అమెరికాకు సంబంధించిన సంస్థ. హరప్పా నాగరికత, సరస్వతీ నదిపై పరిశోధనలు చేస్తున్నది. ఆ పరిశోధనలకు సంబంధించిన కొన్ని విషయాలు ఈ మధ్య వెలుగులోకి వచ్చాయి. సరస్వతీ నది హిమాచల్ ప్రదేశ్ లోని శివాలిక్ పర్వత శ్రేణుల్లో పుట్టి పంజాబు హర్యానా మీదుగా రాజస్థాన్ లో ప్రవహించినట్లుగా నిర్ధారణకు వచ్చారు. వేదాలలో వర్ణించిన విధానం ఆధారంగా సరస్వతీ నది ప్రవాహ దిశను గుర్తించారు. ఋగ్వేద వర్ణన ఆధారంగా బ్రిటిష్ కొలంబియా యూనివర్శిటీలోని ఆసియా అధ్యయన విభాగం ప్రొఫెసర్ అశోక్ అజాల్కర్ ఈ విశ్లేషణ చేసారు. సరస్వతీ నది గుర్తింపు కోసం మనదేశంలో కూడా "ఇతిహాస సంకలన సమితి" చాలా సంవత్సరాలకు పూర్వమే అధ్యయనం చేసింది. వేదాలలో వర్ణించినట్లుగా ఆ నది ఎక్కడ పుట్టింది, ఏ ఏ ప్రదేశాలలో ప్రవహించింది, ఆ ప్రదేశాలకు వెళ్లి చూసారు. ఆ నది పునరుద్ధరణ కూడా జరిగింది. ఇప్పుడు ఆ నది హర్యానాలో మనకు దర్శనమిస్తోంది.

బ్రిటిష్ వాళ్ళు మన చరిత్రను కుదించేందుకు చేసిన ప్రయత్నాలలో ఒక భాగం "సింధు నాగరికతే" మన దేశ నాగరికత అని చూపించడం. మనది అసలు వేద నాగరికత. అదే సరస్వతీ నాగరికత. సరస్వతీ నదీ తీరంలో అనేక సామ్రాజ్యాలు, జనపదాలు, ఋషుల ఆశ్రమాలు ఉండేవి. వాటి చరిత్ర వెలికి తీయబడింది. దీని ఆధారంగా మన చరిత్రను తిరిగి వ్రాయవలసిన అవసరం ఉంది. అప్పుడే భారతదేశ నిజమైన చరిత్ర వెలుగులోకి వస్తుంది. మన చరిత్ర ఇప్పుడు రెండు వ్యవస్థలలో చిక్కుకొని విలపిస్తున్నది. 1) ప్రభుత్వం చేతులలో, 2) కమ్యూనిస్టుల చేతులలో. కమ్యూనిస్టు మేధావుల నుండి దీనిని బయట పడవేసి స్వతంత్రంగా వాస్తవ చరిత్రను వ్రాయిస్తే గర్వించదగిన మన చరిత్ర మనకందుతుంది.