వైవిధ్యం సృష్టి నియమం

కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి, శ్రీ మోహన్ భాగవత్
 
ప్రపంచంలో వైవిధ్యాన్ని అంతం చేసి ఏకత నిర్మాణం చేయాలనే ప్రయత్నాలు సాగుతున్నవేళ, 'ప్రపంచంలోని ప్రజలందరూ మా మతాన్ని అంగీకరిస్తేనే శాంతి లభిస్తుంది' అనే వేళ 'వైవిధ్యమే సృష్టి నియమం' అని చెప్పేందుకు ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది. దాని వివరాలలోకి వెళితే... 
 
మైసూరులోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో 2015 ఫిబ్రవరి 1 నుండి 5 వరకు (Children of the mother earth unite) 'ఈ భూమాత ప్రపంచంలోని బిడ్డలను కలుపుతుంది' అనే అంశంపై ఒక సదస్సు నిర్వహించబడింది. ఈ సదస్సుకు ప్రపంచంలోని 40 దేశాల నుండి 73 సంస్కృతులకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సరసంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారు తమ ప్రసంగంలో ఇలా అన్నారు - 
 
'ఈ సృష్టిలో వైవిధ్యం ఉంది, వైవిధ్యాన్ని మనం అంగీకరించాలి, దానిని కాపాడాలి. ఈ వైవిధ్యంలో ఏకాత్మత ఉంది. వైవిధ్యం సృష్టి నియమం. ప్రపంచశాంతికై ఈ విషయాన్ని మనం అంగీకరించి ముందుకు పోవలసిన సమయం ఆసన్నమైంది. ప్రపంచంలో ఉన్న పురాతన సంస్కృతులు, సంప్రదాయాలు ఈ వైవిధ్యాన్ని గుర్తించి ముందుకు సాగాయి. ఇదే విషయాన్ని ఆధునిక పరిశోధనలు కూడా నిరూపిస్తున్నాయి. ఈ వైవిధ్యంలో పరస్పర సంబంధాలు కూడా ఉన్నాయని చెప్పబడుతున్నది.
గడచిన 2 వేల సంవత్సరాల నుండి నాకు మేలు జరిగితే నీవు నాకు ఉపయోగపడకపోతే నిన్ను నేను ధ్వంసం చేస్తాను అనే నీతి నడుస్తున్నది. ఈ నీతిద్వారా ప్రపంచం అంతట ఒకే విధానం నిర్మాణం చేయాలనే ప్రయత్నం జరుగుతూ వస్తున్నది. ఈ సృష్టి వైవిధ్యాన్ని ధ్వంసం చేసి ప్రపంచం అంతటా ఒక్కటిగా నిలపాలనేది వాళ్ల లక్ష్యం. ఇది ప్రపంచానికి మేలు చేయకపోగా కీడు చేస్తుంది. ఈ సృష్టిలోని వివిధతను అంగీకరించి జీవనం సాగించడమే సుఖమయ జీవనానికి ఆధారం అని మన సనాతన సంస్కృతిలో చెప్పబడింది. ఇది ఎన్నో అనుభవాల సారాంశం. విభిన్న వేషధారణలు, ఆరాధనలు, ఆహారపు అలవాట్లు, వివిధ ఆచార పద్ధతులు ఉన్నాయి. కాని ఈ వివిధత మధ్య ఏకత అనేది ఉన్నది. ఈ సృష్టిలో ఏకత్వం ఉన్నదనే విషయం ఎంత సత్యమో వివిధత ఉన్నదనే విషయం కూడా అంతే సత్యం. ఈ సత్యాన్ని గుర్తించి మనం జీవిస్తుంటే ప్రపంచం శాంతిగా ఉంటుంది.
 
- సమాచార భారతి