ఓ యువతీ మేలుకో...!

 
సహనంలో భూదేవి...
సమరంలో రుద్రమదేవి...
స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశాబ్దాలైనా...
కొనసాగుతున్న ఎదురీత...
దినదినమూ పెరుగుతున్న అభద్రత...
టెక్నాలజీ పేరుతో ఆడతనం ఊరేగింపు...
మానవత్వాన్నే మరచిపోతున్న సందర్భం...
హెల్త్ చెకప్ లు, స్కానింగ్ లు అంటూ...
మాతృదనానికి అవమానం...
టెస్ట్ ట్యూబ్ బేబీ అంటూ చెత్తకుప్పల్లో...
ఛిద్రమవుతున్న బాల్యం...
మన జీవన విధ్వంస మరణశాసనం...
ఓ యువతీ మేలుకో... !
నీ శక్తిని జాగృతపరచుకో... !


మారుతున్న కాలానికి అనుగుణంగా సమాజంలో కూడా అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భారతం అభివృద్ధి పథంలో ముందుకు సాగిపోతోంది. ఏ దేశం అయినా సరే అభివృద్ధి చెందాలంటే అక్కడ ఉన్న స్త్రీ శక్తి ముందంజలో ఉండాలి. గడచిన కాలంతో పోలిస్తే మహిళాశక్తి జాగృతమైంది. అన్ని రంగాలలో తమదైన ప్రతిభను చాటుకొంటోంది. మొన్న జరిగిన గణతంత్రదినోత్సవ వేడుకల్లో సైతం ఈ విషయం స్పష్టంగా కనబడింది. అందులో మనకున్న స్త్రీ శక్తిని చూసి అమెరికా దేశ మొదటిపౌరుడు ఒబామా సైతం అబ్బురపోయాడు. ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోందనడానికి ఇదొక చిన్న ఉదాహరణ.  
 
మనదేశంలో ఉన్న మహిళాశక్తి ప్రపంచం మొత్తాన్ని శాసించేవిధంగా ఉంది. అది శుభపరిణామమే కాని, ఏ దేశంలో అయితే స్త్రీని తల్లిగా, దైవంగా భావించి పూజించామో, అదే దేశంలో నేడు స్త్రీలపై అనేక దాడులు, అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయి. అభివృద్ధి చెందుతోంది అని మనం భావిస్తున్న సమాజం అథ:పాతాళానికి పోతున్నది. టెక్నాలజీ అని మనం మురిసిపోతుంటే సమాజంలో నైతిక విలువల పతనం జరుగుతోంది. నైతిక విలువలు లేనిదే ఎంత అభివృద్ధి సాధించినా అది వ్యర్థమే. 
 
స్త్రీ అభివృద్ధి చెందడం మంచిదే. కాని మగవారితో సమానంగా పోటీపడే విషయంలో తమనుతాము మానసికంగా, శారీరికంగా బలహీనపరచుకుంటున్నారు. ఆత్మగౌరవం, సమానత్వం, సాధికారత పేరుతో తమలోని స్వతంత్రతను, వ్యక్తిత్వాన్ని మరస్తున్నారు. అన్ని విలువలతో కూడిన సమాజం నిర్మాణం కావాలంటే కుటుంబ వ్యవస్థ సంఘటితం కావాలి. దానికి మూలం మహిళలు మాత్రమే. ఉద్యోగాలు చేయడం, తమ కాళ్లమీద తాము నిలబడటం తప్పుకాదు. కాని కుటుంబ వ్యవస్థను బలహీనపరచడం మంచిదికాదు. తల్లి చెపితేనే పిల్లలు వింటారు. అందుకని ప్రతి కుటుంబంలో తల్లి ఆచరిస్తూ పిల్లలకు నేర్పాలి. అప్పుడే నైతిక విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించగలం.  
 
ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, ఎవరిని నమ్మాలో తెలియడం లేదు. ఒంటరిగా వెళ్లలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలంటే మానసికంగా, శారీరికంగా కూడా బలంగా ఉండాలి. అందుకోసం కరాటే, కర్రసాము లాంటి విద్యలు నేర్చుకొని ఉండాలి. పూర్వకాలం నుంచీ స్త్రీ, పురుషుల మధ్య అసమానతలున్నమాట వాస్తవమే అయినా, వాటిని మార్చే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ అసమానతలు తొలగించడానికి అనేక ఎన్.జి.ఓ.లు, అనేక ప్రభుత్వాలు, ప్రముఖులు ముందుకొస్తున్నారు. కాని మార్పు ప్రచారాల వల్ల రాదు. ప్రతిఒక్కరం వ్యక్తిగతంగా మారినప్పుడే సమాజం బలపడుతుంది. దాన్ని మార్చేశక్తి మహిళకు ఉంది. దానికోసం అందరూ ఝాన్సీరాణి, నివేదిత, రుద్రమదేవి వంటి ధీశాలురను ఆదర్శవంతంగా తీసుకొని కృషిచేయాలి. అప్పుడే ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించగలం.
 
- లతా కమలం