భారత్ లో ఐ.ఎస్.ఐ.ఎస్.పై నిషేధం

భారత గృహమంత్రి రాజ్ నాథ్ సింగ్
 
నేడు మధ్య్రపాచ్యంలో అనేక దేశాలను అతలాకుతలం చేస్తున్న తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐ.ఎస్.ఐ.ఎస్.). ఈ తీవ్రవాద సంస్థను భారత చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధకచట్టం (Prevention of Illigal Activities Amendment Act) - 1962 ప్రకారం నిషేధించినట్లుగా భారతప్రభుత్వం ప్రకటించింది. మే 2011లో పాకిస్తాన్ లోని అబోటాబాద్ లో ఒసామాబిన్ లాడెన్ ను అమెరికన్ నావీసీల్ దళాలు మట్టుపెట్టడంతో ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దులలో స్థావరాలు ఏర్పరచుకున్న అల్ ఖైదా, తాలిబాన్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు మందగించాయి. అయితే ఇరాక్, సిరియాలలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలకే ఎదురుతిరిగి కొంత ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకొని సమాంతర ప్రభుత్వాలను నడుపుతున్న ఐ.ఎస్.ఐ.ఎస్. తీవ్రవాద సంస్థ ప్రపంచదేశాలకు ముఖ్యంగా ఐరోపా దేశాలపై విద్వేషాన్ని చిమ్ముతున్నది. ఇటీవల ఫ్రాన్స్ లో పత్రికా కార్యాలయంపై దాడి జరిపి 12మందిని హతమార్చడం దీనికి తాజా ఉదాహరణ. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల (Social Networks) ద్వారా ముఖ్యంగా యువతను ఆకర్షించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నది. అందువల్ల భారతప్రభుత్వం ఈ తీవ్రవాద సంస్థను నిషేధించింది. అంతేకాక ఈ సంస్థ కార్యకలాపాలపై నిఘా కొరకు సైబర్ స్పేస్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా హోంమంత్రి ప్రకటించారు.  
 
- పతికి