క్రొత్త బ్రాయ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధం


భారత జీవ సాంకేతిక పరిజ్ఞాన నియంత్రణే  బ్రాయ్ (Biotechnology Regulatory Authority of India) బిల్లు. ఆ బిల్లులో అవసరమైన మార్పులు చేసామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ దానిలో చాలా లోటుపాట్లు ఉన్నాయని విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ అవకతవకల బిల్లుని వెంటనే పార్లమెంటులో పెట్టాలని కేంద్రం తీవ్రంగా ప్రయత్నించటం అనుమానాలకు దారి తీస్తున్నది. దీని వెనుక అంతర్జాతీయ రాజకీయ ఒత్తిడులున్నట్లుగా తెలుస్తున్నది. ఆహార వ్యాపారం ప్రపంచంలోనే అతి పెద్దది. దానిని నియంత్రించే వారు ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోగలరు. ఈ రంగంలో ఉన్న కంపెనీలన్నీ అమెరికాకు సంబంధించినవే. అమెరికా ప్రభుత్వంతో సంబంధాలు కలిగి ఉన్నవే. ఇప్పుడు ఈ కంపెనీలే భారత వ్యవసాయ రంగాన్ని నియంత్రణలోకి తెచ్చుకొనేందుకు ప్రయత్నిస్తూ, పకడ్బందీ వ్యూహంతో దూసుకొని వస్తున్నాయి. ప్రమాదాన్ని గుర్తించి వాటి ఆటలు కట్టించవలసిన ప్రభుత్వం ఆ బహుళ జాతి సంస్థలకు ఎర్ర తివాచీలు పరుస్తుండడం అసలైన విషయం. 

భారతదేశంలో జీ.ఎం. ఆహార పంటలు నిషేధించాలని, ఆ పంటల వల్ల ఆరోగ్యం పర్యావరణాలపై దుష్ప్రభావాలు పడవని సశాస్త్రీయంగా నిరూపణ అయ్యేదాకా వాటిని అనుమతించవలసిన అవసరం లేదని జీవ సాంకేతిక పరిజ్ఞానం పై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో హెచ్చరించింది. దేశీయ పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేసుకోవలసిన ఆహార ఉత్పత్తుల రంగాన్ని బహుళ జాతి కంపెనీలకు అప్పగించటం ఆంటే మన రైతులను త్రిశంకు స్వర్గంలోకి నేట్టివేయడమే. ఇప్పటికే రైతుల ఆత్మహత్యలు చూస్తున్నాము. అవి ఇంకా కొనసాగాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఉంది.