
కలియుగాబ్ది 5114 , శ్రీ నందన నామ సంవత్సరం, భాద్రపద మాసం
భారతదేశంలో
ఒక పథకం ప్రకారం ఈ దేశానికి సంబంధించిన ఆధ్యాత్మిక ప్రముఖుల పైన
దుష్ప్రచారము చేసే ప్రక్రియ గడచిన కొద్ది సంవత్సరాలుగా సాగుతున్న విషయం
మనకు తెలుసు. ఈ నేపథ్యంలో మాతా అమృతానందమయి ఆశ్రమంలో చోటు చేసుకున్న
సంఘటనపై దుమారం లేపే ప్రయత్నం చేస్తున్నారు.
గత ఆగస్టు 1వ తేదీన అమృతానందమయి ఆశ్రమంలో కరుణాగవల్లిలో దేశ విదేశాల నుండి
వచ్చిన భక్తులు అమ్మ దర్శనం కోసం వరుసలో నిలబడి దర్శనం చేసుకుంటున్నారు.
అంతలో ఒక ఆగంతకుడు అందరిని తోసుకొని పరుగెత్తుకొంటూ అమ్మకు సమీపంలోకి
రావాలని ప్రయత్నించాడు. ఉన్మాదంతో బిస్మిల్లహ్-ఇర్-రెహ్మన్-ఇర్-రహేం అంటూ
అరుస్తూ బట్టలు విప్పేసి ఒక అండర్ వేర్ తో ఉన్నాడు. ఆ సమయంలో అక్కడున్న
భక్తులు వెంటనే అమ్మకు రక్షగా నిలబడి అగంతకుడిని నిరోధించారు. ఇంతలో
పోలీసులు వచ్చి అతనిని నిర్బంధించి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తదుపరి అతనిని
మానసిక రోగుల వైద్యశాలకు తరలించారు. అక్కడ తోటి రోగులతో గలాటా జరిగింది.
వాళ్ళు అతనిని కొట్టారు. దానితో అతను చనిపోయాడు. ఆశ్రమంలో భక్తులు
కొట్టినందువల్లె అతను చనిపోయాడని అనేక కథనాలు సృష్టించారు. సంబంధం లేని ఒక
అంశాన్ని ఇట్లా దుష్ప్రచారం చేయటం చూస్తుంటే ఒక పథకం ప్రకారం చేసారని
అనిపిస్తున్నది. ప్రస్తుత సంఘటనను ఆధారం చేసుకొని అక్కడి ముస్లిం
మతమౌడ్యులు ఉద్యమించి ఆశ్రమాన్ని అణగద్రొక్క చూస్తున్నారు. స్థానిక
జన్మభూమి పత్రిక సంపాదకురాలు పత్రికలలో ఆశ్రమానికి వ్యతిరేకంగా వచ్చిన
వాటిపై తీవ్ర నిరసన తెలియచేస్తూ ఆశ్రమం విశిష్టతను, అమ్మ సేవలను అందరి
దృష్టికి తెచ్చారు. జస్టిస్ కృష్ణయ్యగారు కూడా ఆశ్రమంపై, అమ్మపై చేస్తున్న
అభాండాలను నిర్ద్వంద్వంగా ఖండించారు. నిజమైన సెక్యులరిజానికి మతసహనానికి
ప్రతీకయైన అమ్మపై నిందలు వేయటం తగదు అని హెచ్చరించారు.
అన్ని మతాలను, సాంప్రదాయాలను గౌరవిస్తూ, గౌరవించేటట్లు బోధిస్తున్న
స్వామీజీలపై, మాతాజీలపై ఎందుకు దాడులు, దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ దాడులు
చేస్తున్న వారి లక్ష్యం ఏమిటి? దేశంలో మత సామరస్యానికి సమాధి కట్టి మత
విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారా? అటువంటి శక్తులకు సెక్యులర్
మేధావులు, సెక్యులర్ పత్రికలూ అని పిలిపించుకొనేవారు ఎందుకు
సహకరిస్తున్నారు? ఇట్లా చేయటం వల్ల మైనార్టీ మతతత్వాన్ని రెచ్చగొట్టటమేనని
గుర్తించటం లేదా? లేక హిందుత్వ శక్తులను అణచేందుకు మైనార్టీ మతమౌడ్యులు వత్తాసు పలకాలనుకొంటున్నారా? ఇటువంటి వార్తలను సామాన్య ప్రజలు గమనించి ఈ కుట్రలను ఎండగట్టాలి.