హిందుత్వం అందరికీ చెందిన ఒక సమగ్ర జీవనవిధానం

 
ఇటీవల పార్లమెంటులో శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రత్యేకించి రాజ్యసభలో మతమార్పిడులపై ప్రతిపక్షాలు నానారభస చేసి వారంరోజులపాటు సభలో చర్చలు జరగకుండా స్తంభింపచేశాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్ఠి చేకూర్చే అనేక ముఖ్యమైన బిల్లులు సైతం గట్టెక్కకుండా అడ్డుకున్నాయి. దీనిద్వారా 'ఒకదెబ్బకు రెండు పిట్టలు' అన్నచందంగా ప్రతిపక్షాలు లబ్ది పొందాలని చూశాయి. 
 
లోక్ సభలో 2014 సాధారణ ఎన్నికలలో సొంతబలంతోను, ఎన్.డి.ఏ. పక్షాల మద్దతుతోను బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీనితో లోక్ సభలో ఏ బిల్లు ప్రవేశపెట్టాలన్నా ప్రభుత్వానికి తగినంత బలం ఉన్నది. కాని రాజ్యసభలో తగినంత బలం లేదు. ఈ బలహీనతను ఆసరాగా చేసుకొని ప్రతిపక్షాలు ముఖ్యంగా కుహనా సెక్యులర్ పార్టీలైన కాంగ్రెస్, సమాజ్ వాది, వామపక్షాల నేతలు రాజ్యసభలో విడ్డూరమైన వితండవాదం చేస్తున్నారు. 
 
మతమార్పిడుల గురించి అర్థం కావాలంటే చరిత్రలోకి వెళ్ళి చూడవలసిందే. క్రీ.శ. 11వ శతాబ్దంలో మహమ్మదీయులు భారతదేశంలో ప్రవేశించింది మొదలు క్రీ.శ. 1750 ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశించేంతవరకు భారతదేశ భూభాగం 80% మహమ్మదీయుల పాలనలో ఉండి రాజకీయ, అధికార ప్రాబల్యంతో జిహాదీ పవిత్రయుద్ధం పేరుతో బలవంతంగా హింసాపద్ధతుల ద్వారా ఇక్కడి హిందువులను మతం మార్పిడులు చేశారు. అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశించిననాటి నుండి నేటివరకు విదేశీ నిధులతో క్రైస్తవ సంస్థలు యథేచ్ఛగా మతమార్పిడులు చేస్తున్నాయి. ఈ దేశంలోని నిరక్షరాస్యులను, పేదలను ఆసరా చేసుకొని క్రైస్తవ సంస్థలు గిరిజనులను, నిమ్నజాతి వర్గాలవారిని విద్యా, వైద్యసేవల పేరిట, ప్రలోభాలకు గురిచేసి మతమార్పిడులు చేస్తున్నాయి. 
 
మరోవైపు మహమ్మదీయ అతివాద సంస్థలు 'లవ్ జిహాదీ' పేరుతో అమాయక హిందూయువతులను ప్రేమపేరుతో వలలో వేసుకొని మతంమార్చి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కేరళలో 'లవ్ జిహాదీ' పేరుతో కనిపించకుండా పోయిన యువతులను ప్రభుత్వం, పోలీసులు వెతకలేక కొన్నివేల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. స్వయంగా కేరళ ఉన్నత న్యాయస్థానం కేరళ ప్రభుత్వాన్ని హెచ్చరించేస్థితికి వచ్చిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 
 
భారతదేశంలో మతమార్పిడుల వాస్తవస్థితి ఇలా ఉండగా ఇటీవల ఆగ్రాలో గతంలో ప్రలోభాలకు లోనై మహమ్మదీయమతం పుచ్చుకున్న కొంతమంది పశ్చాత్తాపం చెంది తిరిగి హిందూధర్మంలోకి రావాలని అభిలషించారు. దానికోసం విశ్వహిందూపరిషత్ కార్యకర్తలు పునరాగమన శిబిరం నిర్వహించారు. 
 
స్వాతంత్ర్యం సిద్ధించిననాటినుండి మతమార్పిడులను నిషేధిస్తూ సమగ్రచట్టం తేవాలని జనసంఘ్, బిజెపి వంటి జాతీయపార్టీలు కోరినా గత 67 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉన్న సమాజ్ వాదీపార్టీ కూడా మతమార్పిడులపై కూలంకషంగా, సమగ్రంగా చర్చించడానికి సిద్ధంగా లేదు. కాని మైనారిటీలను సంతృప్తిపరచడానికి రాజ్యసభను స్తంభింపచేసి ఆర్థిక బిల్లులను అడ్డుకోవటం మాత్రం వారికి చేతనైంది. 
 
2014 ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయాన్ని విశ్లేషించడానికి నియమించిన 'ఆంటోని కమిటి' సైతం సెక్యులరిజంపై కాంగ్రెస్ పార్టీ వైఖరి మారాలని సూచించినప్పటికి కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరి మారకపోవడం దురదృష్టకరం. భారతదేశంలో 'హిందూ' శబ్దాన్ని ఒక జీవనవిధానంగా గ్రహించినప్పుడు ఈ దేశంలో నిజమైన సెక్యులరిజం పరిఢవిల్లుతుంది. ఈ దిశగా చట్టసభలో వాస్తవిక చర్చ జరగాల్సి ఉంది. 
 
- పతికి