ఆరోగ్యానికి ఆహారం - 3

తోటకూర నేత్రములకు మంచిది, విరేచనము కాగోరు వారికి అత్యంత మంచిది. భోజనం చేసిన వెంటనే ఏదో ఒక ఫలాన్ని భుజించుట ఆరోగ్యమునకు చాలా మంచిది. ఫలములన్నింటిలో ద్రాక్షపండు శ్రేష్ఠం. దానిమ్మ గర్భిణీ స్త్రీలకు శ్రేష్ఠం. నారింజపండు స్త్రీలలో నెలవారీ ఋతుస్రావమును క్రమబద్ధీకరించును. ముట్టునొప్పిని తగ్గించును, చర్మానికి కాంతిని కలిగిస్తుంది, మొటిమలను తగ్గిస్తుంది.


బచ్చలి కూర : మధురరసం కలిగి ఉంటుంది. బలాన్ని కలుగచేస్తుంది. శుక్రవృద్ధిని కలిగిస్తుంది.  కఫం ఎక్కువవుతుంది. చలువ చేస్తుంది. 

పాలకూర : బలకరము, నేత్రములకు మంచిది. చలువ చేయును, రుచిగా నుండును, అతిగా తీసుకొన్నచో మూత్రపిండములలో రాళ్ళు ఏర్పడతాయి. 

గోంగూర : అత్యంత ఉష్ణవర్థకము, బలం, రక్తవృద్ధిని కలుగచేయును. 

తోటకూర : చలువ చేయును, నేత్రములకు మంచిది, మలమూత్రములను జారీ చేయును. విరేచనము కాగోరు వారికి అత్యంత మంచిది.  

ఫలములు :  


భోజనం చేసిన వెంటనే ఏదో ఒక ఫలాన్ని భుజించుట ఆరోగ్యమునకు చాలా మంచిది. ఆయా ఋతువులలో లభించు అన్ని ఫలములను తప్పక వాడవలయును. 

ద్రాక్ష : ఫలములన్నింటిలో ద్రాక్షపండు శ్రేష్ఠమయినది, చలువ చేయును. నేత్రములకు మంచిది, బలమును కలుగచేయును. మలమూత్రములను జారీ చేయును, శుక్రవృద్ధిని కలిగిస్తుంది, రుచిని కలిగించును. దప్పికను తగ్గించును. జ్వరము, శ్వాస, వాత రోగములందు, కామెర్లు, మూత్ర రోగములందు, రక్తస్రావములందు అత్యంత మంచిది. ద్రాక్షపండ్లు తాజాగాను మరియు ఎండు ద్రాక్షపండ్లుగాను దొరుకును. ఎండు ద్రాక్ష అత్యంత గుణవత్తరం. 

ఖర్జూర : ఇది కూడా తాజా పండుగను, ఎండబెట్టినవిగాను దొరుకును. హృదయమునకు మంచిది. ఛాతి వ్యాధులందు, క్షయ రోగమందు మంచిది. రక్తస్రావ రోగములందు హితకరం, దగ్గు ఆయాసంలను తగ్గించును. దప్పికను తగ్గించును, బలకరం, శుక్రవృద్ధికరం. 

ఎండు ద్రాక్ష, ఖర్జూర కాయలను పగులగొట్టి నీటిలో నానవేసి త్రాగిన వేసవిలో దాహము, ఎండ వేడిమి నుండి ఉపశమనము కలుగచేయును. చంటి పిల్లలకు త్రాగించుట వలన వడదెబ్బ తగలనీయదు. 

దానిమ్మ : దాహము, జ్వరము, హృద్రోగము, కంఠ రోగములందు మంచిది. నోటి దుర్వాసనను పోగొట్టును. శుక్రవృద్ధిని కలిగించును. పైత్యమును తగ్గించును, గర్భిణీ స్త్రీలకు శ్రేష్ఠం. 

మామిడి : హృదయమునకు మంచిది. బలమును కలిగించును, వాతమును హరించును, శుక్రవృద్ధికరం, రుచికరము, కాంతిని కలుగచేయును, శరీరమునకు చలువ చేయును. 

అరటిపండు : చలువ చేయును, మలబద్ధము చేయును (త్వరగా జీర్ణము కాదు). బలము కలుగచేయును. దప్పిని తగ్గించును. రక్తస్రావము, క్షయ రోగములందు పథ్యము. 

నారింజపండు : చలువ చేయును, దప్పికను తగ్గించును, రుచిని కలిగించును, మధుమేహమునందు పనిచేయును, పైత్యమును తగ్గించును, స్త్రీలలో నెలవారీ ఋతుస్రావమును క్రమబద్ధీకరించును. ముట్టునొప్పిని తగ్గించును, నులి పురుగులను నశింపచేసి, జీర్ణాశయ సంబంధ వ్యాధులను తగ్గించును. రక్తవృద్ధిని చేస్తుంది. చర్మానికి కాంతిని కలిగిస్తుంది, మొటిమలను తగ్గిస్తుంది. 

- వచ్చే సంచికలో మరిన్ని ఫలాల గురించి..