ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం భారతదేశంలో మాత్రమే ఉన్నది


ఇటీవల కంచ ఐలయ్య "హిందూ మతానంతర భారతదేశం" అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఆ పుస్తకాన్ని సమీక్షిస్తూ డా.ఎం.ఎఫ్.గోపీనాద్ ఆంధ్రజ్యోతి పత్రికలో హిందూమతంలో ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం లేదని నిరాధారమైన, అభ్యంతరకరమైన విమర్శలు చేశారు. 

భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం లేకపోయినట్లయితే ఈ దేశంలో అనేక మతాలూ, సాంప్రదాయాలు వికసించేవే కావు. ఈ దేశంలో జన్మించిన బౌద్ధం, జైనం ఈ దేశంలోనే కాక, ప్రపంచంలోని అనేక దేశాలకు వ్యాపించింది. పంజాబ్ లో సిఖ్ సాంప్రదాయం వికసించింది. ఈ దేశంలో క్రైస్తవం, ఇస్లాం మతాలూ ఎట్లా వ్యాపించాయో మనందరికీ తెలుసు. ప్రపంచంలో అన్ని మతాల ప్రజలు సహజీవనం చేస్తున్న దేశం ఒక్క భారతదేశమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భారతదేశంలో మహమ్మదీయుల జనాభా 1947 నాటికి 7 శాతం ఉంటే నేడు అది 14 శాతానికి చేరింది. అదే పాకిస్తాన్ లో విభజన నాటికి హిందువులు 28 శాతం ఉంటే నేడు అది 2 శాతానికి పడిపోయింది. మరి, ఏ దేశంలో మతసహిష్ణుత, ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం ఉన్నట్లు?

వాస్తవానికి హిందూమతం అనేది ఈ దేశంలో లేదు. హిందుత్వం అంటే ఈ జాతి ప్రజల జీవనవిధానం, సంస్కృతీ. ఈ దేశంలో షణ్మతాలు అయిన శైవం, వైష్ణవం, శాక్తేయం, గానపత్యం, సౌరసిద్ధాంతం, షణ్ముఖ తత్త్వం - ఈ ఆరు ఆదిశంకరుల కంటే ముందు నుండే ఈ దేశంలో ఉన్నాయి. ఆ తదుపరి కాలంలో ఆవిర్భవించిన బౌద్ధం, జైనం, అకాలీ వంటి మతాలూ కూడా ఈ దేశంలో వికసించి పరిదవిల్లుతున్నాయి. జీవిస్తున్న జీవన విధానమే హిందూ జీవన విధానం. హిందూ సమాజం అత్యంత ఉదారమైనది కాబట్టే కంచ ఐలయ్య లాంటి వారు "నేను హిందువునెట్లైత", "హిందూ మతానంతర భారతదేశం" వంటి హిందుత్వ వ్యతిరేక పుస్తకాలు, వ్యాసాలూ వ్రాసికూడా స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాడు. ఒకవేళ ఈ ఉదారవాదం లేకపోయినట్లయితే సాల్మన్ రష్డీ, తస్లీమా నస్రీన్ ల వలె స్వదేశాన్ని వదలి ప్రవాస జీవితం గడపవలసి వచ్చేదేమో! 

ఈ దేశంలో  ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం మోతాదుకు మించి ఉండటం వల్లనే రాజకీయ పక్షాలు, సెక్యులరిస్టులు మైనార్టీలను సమర్థిస్తూ మైనారిటీయిజాన్ని అభివృద్ధి చేయగలిగారు. వారి మెప్పు కోసం హిందూ సమాజంలో భేదభావాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ వారి వ్యక్తిగత ప్రచారం కోసమో, విదేశీ పర్యటనల కోసమో, ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలో ఉండే ప్రాయోజిత సంస్థల మెప్పు కోసమో వ్రాస్తున్నారు. ఇక్కడి పత్రికా రంగం కూడా ఇటువంటి కుహనా సెక్యులరిస్టులను   ప్రోత్సహిస్తున్నట్లుగా కనబడుతున్నది. హిందూ సమాజంలోని సామాన్య ప్రజలలో కుల, మతపరమైన  భేదభావాలను సృష్టిస్తూ తమ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్న కంచ ఐలయ్య వంటి వారి విషయంలో హిందూ సమాజం అప్రమత్తంగా, జాగృతంగా ఉండాలి.

- పతికి