హిందూ ధర్మ సమ్మేళనంకై స్వామీజీల పిలుపు

కలియుగాబ్ది 5114 , శ్రీ నందన నామ సంవత్సరం, ఆషాఢ మాసం

భాగ్యనగరంలోని శిల్పకళావేదికలో జూలై 1న హిందూ ధర్మ సమ్మేళనం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వివిధ మఠాధిపతులు, పీఠాధిపతులు, ధార్మిక పెద్దలు, వేద పండితులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ మఠాధిపతులు "స్వదేశంలోనే హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడబడుతున్నారు. ధార్మిక, మత వ్యవహారాలలో అడుగడుగునా ప్రభుత్వ పెత్తనానికి, వివక్షతకు గురి అవుతున్నారని, హిందూ సమాజానికి విదేశాల నుండి కూడా ముప్పు వాటిల్లుతున్నదని" విచారం వ్యక్తం చేశారు. దేశంలో కేవలం హిందూ దేవాలయాలపై మాత్రమే ప్రభుత్వ అజమాయిషీ ఉంటున్నదని, మరే ఇతర మతాల ప్రార్థనా స్థలాలపై ప్రభుత్వ అజమాయిషీ లేదన్న విషయాన్ని ఎత్తి చూపారు. హిందూ ఆలయాలు, ధార్మిక సంస్థల నిధులను డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణం వంటి వాటికి వినియోగించరాదని, అలాగే దేవాలయాలలో అన్యమతస్తులను ఎగ్జిక్యూటివ్ అధికారులుగా నియమించరాదని సూచించబడింది. మతమార్పిడుల పట్ల శ్రీ అరవిందరావు, శ్రీ హనుమాన్ చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. 

ఈ పరిస్థితులను అధిగమించేందుకు హిందువుల న్యాయబద్ధ రాజ్యాంగ విహిత ప్రాథమిక మతహక్కులను నిలబెట్టేందుకు విశాల ప్రాతిపదికపై హిందూ ధర్మ సమ్మేళనం అనే వ్యవస్థను ఏర్పాటు చేయాలని, దానికి భక్తి చానల్ అధినేత టి.నరేంద్ర చౌదరి బాధ్యత స్వీకరించాలని నిర్ణయించబడింది. "హిందూ ధర్మ సమ్మేళనం" వ్యవస్థ యొక్క స్వరూప స్వభావాలను త్వరలో ఖరారు చేయాలని నిర్ణయించటం స్వాగతించదగిన విషయం. పూజ్యులు సద్గురు శివానంద మూర్తి గారు, ప్రముఖ స్వామీజీలు హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు చేసిన ఈ సంకల్పము త్వరలోనే కార్యాచరణకు రావాలని, ఇప్పటికే ఈ దిశలో వివిధ రంగాలలో పని చేస్తున్న ప్రముఖులను కలుపుకొని పోవటానికి చేసిన నిర్ణయం ఎంతో హర్షించదగినది. దేశ వ్యాప్తంగా హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్న అనేకమంది ప్రముఖులను కలిపే ప్రయత్నం శ్రీ శ్రీ దయానంద సరస్వతీ స్వామీజీ చేస్తున్నారు. వారి శిష్యులు శ్రీ పరిపూర్ణానంద (శ్రీ పీఠాధిపతి) స్వామి, అనేకమంది ఇతర స్వామీజీలు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రయత్నాలు వేగవంతం కావాలి. హిందూ సమాజం జాగృతమై తన సమస్యలను తానే పరిష్కరించుకోవాలి. హిందూ సమాజం యొక్క సర్వతోముఖాభివృద్ధికి సమాజాన్ని సిద్ధం చేయటం ఎంతో మహత్తరమైన కార్యం. ఈ కార్యక్రమానికి కొత్తరూపం ఇవ్వాలని, పనిని వేగం చేయాలని నిర్ణయించి ఈ దిశలో ప్రయత్నాలు ప్రారంభించటానికి నాంది ఈ కార్యక్రమం. ఇది స్వాగతించదగినది.