భగవంతుడిది శాశ్వత ప్రేమ

వివేక సూర్యోదయం - ధారావాహికం - 7

http://2.bp.blogspot.com/-9I5Dav5PfyQ/TwxBzvqyS6I/AAAAAAAAAYM/97mWZ2Dzes0/s200/Vivekasuryodayam.jpg

భక్తి అంటే భగవంతుని పట్ల అవ్యాజమైన ప్రేమ. మనిషి భగవంతుడ్ని ఎందుకు ప్రేమించాలి అనే ప్రశ్నను చేదించనంత వరకు విషయం బోధపడదు. జీవితానికి రెండు భిన్నమైన ఆదర్శాలున్నాయి. ఏ దేశస్తుడైనా, మతం తెలిసిన వారెవరినైనా తను శరీరము, ఆత్మల కలయిక అని తెలుసు. కాని మానవ జీవన లక్ష్యాలలో చాల భేదముంది. పాశ్చాత్య దేశాల్లో ప్రజలు మానవ శరీరం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. భారతదేశంలో ఆత్మ గురించి చింతన ఎక్కువ. ఇంగ్లండులో మరణం గురించి చెప్పినప్పుడు మానవుడు తనలోని భూతాన్ని వదిలిపెట్టాడంటే, భారత్ లో మానవుడు శరీరాన్ని వదిలాడంటారు. పాశ్చాత్య దేశాల్లో మానవుడెందుకు జీవిస్తున్నాడంటే, భోగాలను, వాసనలను, సంపదను అనుభవించేందుకంటారు. అంతకు మించి అతనాలోచించలేడు. భవిష్యత్తులోనూ మానవుడు ఇదే ఆనందం కొనసాగిస్తుంటానంటాడు. మరణం తరువాత కూడా తానెక్కడికో వెళ్తానని అక్కడ కూడా ఇవన్నీ లభిస్తాయని భావిస్తుంటాడు. ఈ లక్ష్యం కోసమే భగవంతుడ్ని పూజిస్తుంటాడు. భగవంతుడనే వాడొకడున్నాడని, అతడే ఇవన్నీ తనకిస్తుంటాడని భావిస్తుంటాడు.


భారత్ లో భగవంతుడంటే జీవన లక్ష్యం. భగవంతుడికి మించినది లేదు. భోగాలను, వాసనలను శాశ్వతమైనవిగా కాక జీవన ప్రవాహంలో కొన్ని మజిలీలుగానే భావిస్తాం. వీటికి మించిన పరమోత్కృష్ట సాధన ఒకటుందని నమ్ముతాం. కేవలం వీటి గురించే ఆలోచించడం భయానకమని తెలుసుకుంటాం. కుక్క తినేటప్పుడు చూడండి, అంత తృప్తిగా ఎవరూ తినరు. పంది కూడా అంతే. అంత తృప్తిగా మనిషి జీవించలేడు. చిన్న చిన్న జంతువులలో వినికిడి శక్తి, చూసే శక్తి ఎక్కువ. వాటి వాటి వ్యవహారాల్లో అవి మునిగి తేలుతుంటాయి. వాసనలను అనుభవిస్తూ అవి ఒళ్ళు మరిచిపోతుంటాయి. మనిషి కూడా అదే స్థాయికి వెళితే అతనికీ అదే తరహా ఆనందం లభిస్తుంటుంది. కొంచెం స్థాయి పెరిగితే అతని లక్ష్యం ప్రేమ వైపు మళ్ళుతుంది. అదే భక్తి వైపు నడిపిస్తుంది. జీవితంలో అన్ని దశల్లోనూ మనం ఒకేరకంగా ఆలోచించం. చిన్నతనంలో స్వీట్లు, బిస్కట్లు గూర్చి ఉన్న యావ క్రమంగా జీవితంలో కొన్ని ఉన్నతమైన విషయాలను, విలువలను విజ్ఞానాన్ని అర్థం చేసుకుంటున్న కొద్దీ ఉన్నత లోకాల వైపు ఆలోచనలు మళ్ళుతాయి. ఒక దశలో ఎంతో ప్రధానమైనది మరో దశలో అప్రధానమై క్రమంగా శాశ్వత సత్యమైన భక్తి వైపు, భగవంతుని వైపు ఆలోచన జరుగుతుంది. భగవంతుడు పూర్ణతత్వం, అంతకుమించి ఆనందం లేదు, నిస్వార్థమైన ప్రేమ అది. కుటుంబంలో భార్యను, పిల్లలను ప్రేమించడం ఒక మజిలీ. శాశ్వతమైన భగవంతుడి ప్రేమను చేరేందుకు ఇవన్నీ కొన్ని దశలు. ఎవరి పట్లా కోపం, ద్వేషం లేక ఎప్పుడూ సంతులనం కోల్పోక, జనన మరణాల పట్ల సమదృష్టి కల్గిన వాడే భగవంతుడు. భగవంతుడి మార్గం సుదూరమైనది. కష్టసాధ్యమైనది. కొందరే దాన్ని సాధించగలరు. అదొక నిరంతర పోరాటం. సూర్యోదయానికి ముందు మిణుకు మిణుకుమనే చిన్న నక్షత్రాల వంటివి సాంసారిక ప్రేమతో కూడిన బంధనాలు. సూర్యోదయం అయినా వెంటనే అవి మటుమాయం అవుతాయి. కనుక సూర్యోదయమే భగవత్ సాక్షాత్కారం, శాశ్వత ప్రేమతో సమానం. 

- హనుమత్ ప్రసాద్