ప్రణబ్ రాష్ట్రపతి పదవికి తగినవాడు కాదా?!


రాష్ట్రపతి పదవికి యుపిఎ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రణబ్ ముఖర్జీ అసలు అత్యుత్తమ అభ్యర్థి కాదనేది ఆయన గురించి బాగా తెలిసిన విశ్లేషకుల వాదన. దాదా ఎమర్జెన్సీకి వత్తాసు పలకడమే కాక, దేశమంతటా దమనకాండ సాగించిన ఇందిర అనుచర వర్గంలో ఒకరనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, కార్పొరేట్ లాబీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే ఆర్థికమంత్రిగా కూడా ఆయనకు పేరు ఉంది. అవినీతి, అక్రమాలతో విదేశాల్లో నల్లధనం దాచుకున్న దొంగల పేర్లు బయటకు వెల్లడించకుండా కాపాడింది ప్రణబ్ దాదాయేనని ప్రముఖ న్యాయవాది రాంజత్మలానీ ఇటీవలె ఆరోపించారు. దేశ ప్రజలచే గాంధీ, నెహ్రూలకంటే ఎక్కువగా అభిమానించబడిన నేతాజీ విషయంలోనూ దాదా తన దుష్టభుద్ధిని చాటుకున్నారని అనుజ్ థార్ అనే జర్నలిస్టు తన "ఇండియన్ బిగ్గెస్ట్ కవరప్" అనే పుస్తకంలో విమర్శలు గుప్పించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించారనే వాదనను నిజమని నిరూపించేందుకు ప్రణబ్ నేతాజీ కుటుంబ సభ్యులకు లంచం ఇవ్వజూపారని ఆ పుస్తకంలో వివరించారు. 

1995లో పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో అప్పటి విదేశాంగ శాఖ మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ జర్మనీ వెళ్ళారు. అక్టోబర్ 21న బోస్ సతీమణి ఏమ్లీని కలుసుకున్నారు. నేతాజీ విమాన ప్రమాదంలోనే మరణించారనీ, దీనికి అంగీకరిస్తున్నట్లుగా ఒక పత్రంపై సంతకాలు చేయాలని ఒత్తిడి చేశారు. తన ప్రతినిధి ద్వారా బ్యాంక్ చెక్ ఇచ్చేందుకు కూడా ప్రణబ్ యత్నించారు. ప్రణబ్ తీరుపై ఏమ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతకం చేసేందుకు నిరాకరించారు. నేతాజీ విమాన ప్రమాదంలో మరణించాడని తమ కుటుంబ సభ్యులు నమ్మడం లేదని చెప్పారు. అంతేకాదు, జపాన్ లో ఉన్న అస్థికలు నేతాజీవి కావని స్పష్తం చేశారని అనుజ్ తన పుస్తకంలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని భారత్ లోని నేతాజీ ముని మేనల్లుడు సూర్యకుమార్ బోస్ కు ఏమ్లీ ఫోన్ చేసి చెప్పారని, సూర్య కుమార్ బోస్ ఈ విషయాన్ని తన డైరీలో వ్రాసుకున్నారని అనుజ్ థార్ తన పుస్తకంలో స్పష్టం చేశారు.

ఇక్కడ అందరికీ ప్రశ్నార్ధకం అయిన విషయం ఏమిటంటే, ప్రణబ్ దాదా నుంచి ఈ ఆరోపణలపై ఎటువంటి సమాధానం లేకపోవటం. ఇది పలు విమర్శలకు, అనుమానాలకు దారి తీస్తున్నది. దేశ అత్యున్నత పీఠంపై కూర్చునే వ్యక్తి వివాదాస్పదుడుగా ఉండకూదనేది ప్రజల మనోభావం. 


- నారద