ఈ పిల్లలు అనాథలు కాదు - నా కుటుంబం

ఎ.బి.వి.పి. సభలో "యశ్వంత్ రావ్ కేల్కర్ యువ పురస్కారం" అంటుకుంటున్న శ్రీమతి మనన్ చతుర్వేది

"సేవాహి పరమోధర్మః" అనే సూక్తికి సార్ధకత చేకూర్చిన అనేక వందల వేల ఉదాహరణలు ఈ దేశంలో మనకు కనబడతాయి. అట్లా సంస్థల రూపంలో వ్యక్తిగతంగా చేసేవారు కనబడతారు. ఎవరి కార్యపద్ధతి  వారిది. అట్లా ఒక ఆదర్శ పద్ధతిలో అనాశ్రిత బాలల సదన్ నిర్వహిస్తున్నవారు శ్రీమతి మనన్ చతుర్వేది. శ్రీమతి మనన్ చతుర్వేది జైపూర్ లోని తన ఇంటినే నిరాశ్రిత  బాలల సదన్ గా రూపుదిద్దింది.  

8 సంవత్సరాలకు పూర్వం ఆమె సమయం దొరికినపుడు దగ్గరలోని సేవాబస్తీ (వెనుకబడిన) కి వెళ్లి అక్కడి పిల్లలతో గడుపుతూ ఉండేవారు. ఒకసారి ఆ బస్తీకి వెళ్ళినప్పుడు ఆ బస్తీ వాసులు బాగా అనారోగ్యంతో ఉన్న అనాథయైన ఒక పసిపాపను ఆమెకు అందించారు. ఆమె ప్రార్థన, డాక్టర్ల కృషి కారణంగా ఆ పాప అనారోగ్యం నుండి బయటపడింది. ఆ పాపను శ్రీమతి మనన్ తనవద్దే ఉంచి పెంచింది. ఆ పాప నేడు గౌరీ విద్యాలయంలో చదువుతున్నది. అట్లా ప్రారంభమైన ఆ పని నేడు 70 మంది బాలలకు ఆశ్రయం కల్పించే స్థాయికి పెరిగింది. ఆ 70 మందికి ఆమె తల్లి. 

ఈ నిరాశ్రిత పిల్లల పోషణకు ఆమె నాలుగు నియమాలు పెట్టుకుని కొనసాగిస్తున్నారు. 1) ఈ 70 మందితో కూడిన కుటుంబాన్ని నడిపించటానికి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు తీసుకోకూడదు అని నిర్ణయించుకున్నారు. 2) ఈ పిల్లలను వేరెవ్వరికి ఇవ్వకూడదు, 3) బయటి నుండి వచ్చే ఆహారము ఈ పిల్లలకు పెట్టకూడదు, 4) వీరి పోషణకు తనే స్వయంగా రకరకాల పనులు చేస్తూ సంపాదించాలి. ఈ నియమాలను పరిశీలించినప్పుడు ఆమె దృష్టిలో అది ఒక అనాథ ఆశ్రమం కాదు. ఒక కుటుంబం. అక్కడకు వచ్చేవారిలో కాని, ఆ బాలలలో కాని ఆ భావన రాకూడదు. ఈ రకంగా 37 సంవత్సరాల వయస్సున్న శ్రీమతి మనన్ చతుర్వేది ఒక ఆదర్శ పద్ధతిలో సాగిస్తున్న ఈ ప్రయోగానికి ఈ మధ్య ఎ.బి.వి.పి. వాళ్ళు  ఒక అవార్డు నిచ్చారు.

అఖిల భారత విద్యార్థి పరిషత్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక యువ అవార్డును "యశ్వంత్ రావ్ కేల్కర్ యువ పురస్కారం" పేరుతో ఇస్తుంటారు. ఈ సంవత్సరం ఆ అవార్డు డిల్లీలో జరిగిన జాతీయ మహాసభలలో శ్రీమతి మనన్ చతుర్వేదికి ఇచ్చి ఒక మంచి ఆదర్శాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకొని వచ్చారు.